11 ఏళ్ల బాలుడి సర్జరీ కోసం రూ.31 లక్షల విరాళమిచ్చిన కేఎల్ రాహుల్

ABN , First Publish Date - 2022-02-23T02:46:42+05:30 IST

బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎంటీ) అవసరమైన 11 ఏళ్ల చిన్నారిని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆదుకున్నాడు...

11 ఏళ్ల బాలుడి సర్జరీ కోసం రూ.31 లక్షల విరాళమిచ్చిన కేఎల్ రాహుల్

న్యూఢిల్లీ: బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎంటీ) అవసరమైన 11 ఏళ్ల చిన్నారిని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆదుకున్నాడు. బాలుడి శస్త్రచికిత్సకు రూ. 35 లక్షలు అవసరం కాగా, రాహుల్ రూ. 31 లక్షలు సాయం చేశాడు. బాధిత బాలుడు వరద్ తండ్రి సచిన్ నలవాడే ఇన్సూరెన్స్ ఏజెంట్ కాగా, తల్లి స్వప్నఝా గృహిణి. కుమారుడి శస్త్రచికిత్సకు అవసరమైన రూ. 35 లక్షల కోసం ‘గివ్ ఇండియా’ ద్వారా డిసెంబరులోనే నిధుల సేకరణ ప్రారంభించారు. 


ఐదో తరగతి చదువుతున్న వరద్‌ అరుదైన రక్త రుగ్మత ‘అప్లాస్టిక్ అనీమియా’కు గురైనట్టు ముంబైలోని జస్‌లోక్ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. వరద్ బ్లడ్ ప్లేట్‌లెట్ల స్థాయులు దారుణంగా పడిపోయాయి. దీంతో మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. చిన్నపాటి జ్వరం వచ్చినా తగ్గేందుకు నెలలు పట్టేది. వరద్ తిరిగి మామూలు మనిషి కావాలంటే బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) ఒక్కటే పరిష్కారామని వైద్యులు భావించారు.


అయితే, ఇందుకు రూ. 35 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో వరద్ తల్లిదండ్రులకు పాలుపోలేదు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన సచిన్ నలవాడే.. క్రికెటర్ కావాలన్న తన కుమారుడి కలలను నిజం చేసేందుకు, అతడి ప్రాణాలు నిలుపుకునేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. మెడికల్ బిల్స్ కోసం చివరికి తన ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్‌ను కూడా వాడేశాడు. కుమారుడిని ఉత్సాహ పరిచేందుకు అతడి 11వ బర్త్‌డే నాడు ఫ్యాన్సీ క్రికెట్ బ్యాట్‌ను కూడా కొనుగోలు చేసి ఇచ్చాడు. 


మరోవైపు, ‘గివ్ ఇండియా’ ద్వారా వరద్ పరిస్థితి గురించి తెలుసుకున్న కేఎల్ రాహుల్ వెంటనే తన బృందం ద్వారా గివ్ ఇండియాతో సంప్రదింపులు జరిపి బాలుడి శస్త్రచికిత్స అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగా రూ.31 లక్షలు అందించాడు.


అనంతరం బాలుడికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనిపై రాహుల్ మాట్లాడుతూ.. వరద్ వీలైనంత త్వరగా లేచి తిరగాలని ఆకాంక్షించాడు. అతడు తన కలలను సాకారం చేసుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు. సాయం అందించి తమ కుమారుడి ప్రాణాలు నిలిపిన కేఎల్ రాహుల్‌కి వరద్ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.  

Updated Date - 2022-02-23T02:46:42+05:30 IST