కామన్‌వెల్త్‌లోకి తిరిగొచ్చిన క్రికెట్.. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్

ABN , First Publish Date - 2022-02-02T02:07:52+05:30 IST

24 సంవత్సరాల తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లోకి క్రికెట్ తిరిగి వచ్చేసింది. ఈసారి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా

కామన్‌వెల్త్‌లోకి తిరిగొచ్చిన క్రికెట్.. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్

న్యూఢిల్లీ: 24 సంవత్సరాల తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లోకి క్రికెట్ తిరిగి వచ్చేసింది. ఈసారి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. మొత్తం 72 దేశాలకు చెందిన 4,500 అథ్లెట్స్ పాల్గొంటారు. 11 రోజులపాటు గేమ్స్ జరుగుతాయి.


సుదీర్ఘ కాలం తర్వాత క్రికెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం మహిళా జట్లే పోటీపడతాయి. ఈ లీగ్ కమ్ నాకౌట్ విమెన్స్ టోర్నమెంట్‌‌లో తొలి మ్యాచ్.. 2020 విమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనలిస్టులైన ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జులై 29న జరుగుతుంది. కాంస్య, బంగారు పతకాల మ్యాచ్‌లు మాత్రం ఆగస్టు 7న జరుగుతాయి.


కామన్‌వెల్త్ గేమ్స్ కోసం ఆస్ట్రేలియా, బార్బడోస్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే అర్హత సాధించగా తాజాగా శ్రీలంక జట్టు కూడా అర్హత సాధించింది. దీంతో టోర్నీలో పాల్గొనబోయే జట్ల సంఖ్య 8కి పెరిగింది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ, కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) సంయుక్తంగా ప్రకటించాయి.


కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించడం ఇది రెండోసారి మాత్రమే. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన పురుషుల టోర్నీలో షాన్ పొలాక్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌లో స్టీవ్ వా సారథ్యంలోని ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించి బంగారు పతకం గెలుచుకుంది. ఆ గేమ్స్‌లో సచిన్ టెండూల్కర్, జాక్విస్ కలిస్, మహేల జయవర్దనే తదితర దిగ్గజ క్రికెటర్లు ఆడారు. 


ఇక, తాజా విషయానికి వస్తే మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో బార్బడోస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇండియా జట్లు ఉండగా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి.


కామన్‌వెల్త్ గేమ్స్‌కు శ్రీలంక జట్టు అర్హత సాధించినందుకు ఐసీసీ, సీడీఎప్, కామన్‌వెల్త్ గేమ్స్ అభినందనలు తెలిపాయి. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డిస్ మాట్లాడుతూ.. కామెన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళా క్రికెట్ అరంగేట్రం చారిత్రక క్షణమన్నారు.  


 


Updated Date - 2022-02-02T02:07:52+05:30 IST