భారత్‌కు జీవనోపాధి సంక్షోభ ముప్పు

ABN , First Publish Date - 2021-05-12T06:21:05+05:30 IST

భారత్‌ తీవ్రమైన జీవనోపాధి సంక్షోభం ఎదుర్కొనబోతోందని ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ హెచ్చరించారు. కరోనా రెండో దశ తీవ్రత కారణంగా శ్రామిక వర్గాల బతుకుతెరువు భారమవుతోందన్నారు...

భారత్‌కు జీవనోపాధి సంక్షోభ ముప్పు

  • ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ: భారత్‌ తీవ్రమైన జీవనోపాధి సంక్షోభం ఎదుర్కొనబోతోందని ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ హెచ్చరించారు. కరోనా రెండో దశ తీవ్రత కారణంగా శ్రామిక వర్గాల బతుకుతెరువు భారమవుతోందన్నారు. 2024-25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం అసాధ్యమని, ఏ విధంగా చూసినా పనికిరాని లక్ష్యమని, భారత ఉన్నత వర్గాల సూపర్‌ పవర్‌ ఆశయాలకు తోడ్పడటమే దాని ఉద్దేశమని ఆయన అభిప్రాయపడ్డారు. బెల్జియం సంతతికి చెందిన భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త జీన్‌ డ్రెజ్‌ యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయ సలహా మండలి (ఎన్‌ఏసీ) సభ్యుడిగా పనిచేశారు. పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించిన మరిన్ని ముఖ్యాంశాలు.. 


  1. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పోలిస్తే, స్థానిక లాక్‌డౌన్‌లతో ఆర్థిక నష్టం తక్కువే. కార్మిక వర్గానికి గత ఏడాది కంటే గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత సంక్షోభం దీర్ఘకాలం పాటు, బహుశా ఏళ్ల తరబడి కొనసాగవచ్చు. 
  2. చాలా మంది తమ పొదుపు సొమ్మును ఖర్చు చేయడం లేదా పెద్ద ఎత్తున అప్పులు చేయడం తప్పనిసరి అయింది. గత ఏడాదిలో జీవనావసరాలకు అప్పులు చేసినవారు ఈ ఏడాది మళ్లీ అప్పు చేయగల స్థితిలో లేరు. 
  3. గత ఏడాది ప్రకటించిన ఊరట చర్యల వంటివి ఈ ఏడాది అమలు చేయాలి. మరింత విస్తృత చర్యలు అవసరం. మే, జూన్‌లో ఉచిత రేషన్‌ అందించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దాన్ని మరిన్ని నెలలు విస్తరించాలి. సమగ్ర నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలి. 
  4. చాలాకాలంగా వైద్య, ప్రజా ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన భారత్‌, ప్రస్తుతం అందుకు మూల్యం చెల్లిస్తోంది. నాణ్యమైన జీవనానికి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది మరేదీ లేదు. కానీ, భారత ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ఏటా ఖర్చు చేసున్న మొత్తం జీడీపీలో ఒక శాతం కన్నా తక్కువే. 

Updated Date - 2021-05-12T06:21:05+05:30 IST