కివీస్‌దే జోరు

ABN , First Publish Date - 2021-11-27T09:02:36+05:30 IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు భారత్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్లు విల్‌ యంగ్‌ (180 బంతుల్లో 12 ఫోర్లతో 75 బ్యాటింగ్‌), టామ్‌ లాథమ్‌ (165 బంతుల్లో 4 ఫోర్లతో 50 బ్యాటింగ్‌) అజేయ..

కివీస్‌దే జోరు

  • యంగ్‌, లాథమ్‌ హాఫ్‌ సెంచరీలు
  • తొలి ఇన్నింగ్స్‌ 129/0
  • భారత్‌ 345 ఆలౌట్‌
  • శ్రేయాస్‌ సెంచరీ
  • సౌథీకి ఐదు వికెట్లు


ఆశించినట్టుగానే శ్రేయాస్‌ అయ్యర్‌ అరంగేట్ర శతకంతో ఈ టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు. కానీ రెండో రోజు ఆటలో భారత్‌కు లభించిన ఊరట అదొక్కటే. పేసర్‌ సౌథీ వ్యూహాత్మక బంతులకు మిగిలిన వికెట్లను టపటపా కోల్పోగా... ఆ తర్వాత కివీస్‌ ఓపెనర్లు లాథమ్‌, యంగ్‌ ఈ ఫార్మాట్‌లో ఎలా బ్యాటింగ్‌ చేయాలో చూపించారు. ఓపిక.. సంయమనంతో క్రీజులో నిలిస్తే పరుగులు అవే వస్తాయని ఇద్దరూ అర్ధశతకాలతో రుజువు చేశారు. దీంతో టీమిండియా బౌలర్లకు నిరాశే ఎదురైంది.


కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు భారత్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్లు విల్‌ యంగ్‌ (180 బంతుల్లో 12 ఫోర్లతో 75 బ్యాటింగ్‌), టామ్‌ లాథమ్‌ (165 బంతుల్లో 4 ఫోర్లతో 50 బ్యాటింగ్‌) అజేయ ఆటతీరుతో టీమిండియాను పరీక్షించారు. ఈ జోడీని విడదీసేందుకు స్పిన్‌ త్రయం ఎన్ని వ్యూహాలు రచించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కివీస్‌ రెండో రోజు శుక్రవారం ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 57 ఓవర్లలో 129 పరుగులు చేసింది. అయితే భారత్‌కన్నా ఇంకా 216 పరుగులు వెనుకంజలోనే ఉంది. వెలుతురు మందగించడంతో మరో మూడు ఓవర్లుండగానే ఆటను నిలిపేశారు. అంతకుముందు శ్రేయాస్‌ అయ్యర్‌ (171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105) అరంగేట్ర శతకంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 111.1 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌటైంది. చివర్లో అశ్విన్‌ (38) ఫర్వాలేదనిపించాడు. పేసర్‌ సౌథీ తొలి రోజు ఒక్క వికెట్‌ మాత్రమే తీసినా, రెండోరోజు తొలి సెషన్‌లోనే నాలుగు వికెట్లతో  బెంబేలెత్తించాడు. స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అయితే ఆట చివర్లో పిచ్‌పై కాస్త ఎక్కువ పగుళ్లు కనిపించడంతో మూడో రోజు భారత స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది.


అటు అయ్యర్‌.. ఇటు సౌథీ: 258/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ నుంచి భారీ స్కోరు ఆశించినా సాధ్యం కాలేదు. తొలి సెషన్‌లోనే జట్టు పతనం ఖాయమైంది. దీంతో భారత్‌ అదనంగా 87 పరుగులు మాత్రమే నమోదు చేయగలిగింది. ఆరంభంలో శ్రేయా్‌స-జడేజా జోడీని విడదీసేందుకు సౌథీ తగిన వ్యూహంతో బరిలోకి దిగాడు. ముఖ్యంగా జడేజాకు ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతులు విసిరి ఊరించేలా చేశాడు. చివరకు 50 పరుగుల వద్దే అతడు దొరికిపోయాడు. ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి వికెట్లను గిరాటేయడంతో అసహనంతో జడ్డూ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత సాహా (1) కూడా నిరాశపరచగా.. శ్రేయాస్‌ మాత్రం ఈ ఇన్నింగ్స్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. తొలి టెస్టులోనే శతకం పూర్తి చేసుకుని సత్తా నిరూపించుకున్నాడు. అటు అశ్విన్‌ వరుస ఫోర్లతో స్కోరు 300 దాటింది. అయితే సౌథీ మరోసారి చెలరేగి ఈసారి అయ్యర్‌ వికెట్‌ సాధించడంతో భారత్‌ కోలుకోలేకపోయింది. లెంగ్త్‌ బాల్‌ను డ్రైవ్‌ చేసి కవర్‌లో యంగ్‌కు దొరికిపోయాడు. తర్వాతి ఓవర్‌లోనే అక్షర్‌ (3)ను కూడా అవుట్‌ చేయడంతో సౌథీ ఐదు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇక లంచ్‌ బ్రేక్‌ తర్వాత మూడు ఓవర్లలోనే అశ్విన్‌, ఇషాంత్‌ (0) అవుట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.


ఓపెనర్లు అద్భుతం: తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌ ఓపెనర్లు లాథమ్‌-యంగ్‌ల నుంచి అనూహ్య పోరాటం ఎదురైంది. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత పరుగులపై దృష్టి సారించింది. అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌ను వీరు ఎదుర్కొన్న తీరు అబ్బురపరిచింది. ఓపెనర్లను విడదీసేందుకు స్పిన్‌ త్రయం కూడా చెమటోడ్చింది. స్వీప్‌ షాట్లతో అడపాదడపా బౌండరీలు సాధిస్తూ వీరు స్కోరును పెంచారు. బంతి తక్కువ ఎత్తులో వచ్చినప్పటికీ నిలకడగా టర్న్‌ కాలేకపోయింది. లెఫ్ట్‌ హ్యాండర్‌ లాథమ్‌ను అవుట్‌ చేసేందుకు జడేజా, అక్షర్‌ ఓవర్‌ ది వికెట్‌ బౌలింగ్‌ చేసినా ఫలితం లేకపోయింది. అటు భారత పేసర్లు కూడా సౌథీ, జేమిసన్‌ మాదిరి స్వింగ్‌ను రాబట్టలేకపోయారు. ముఖ్యంగా భారత్‌లో తొలి టెస్టు ఆడుతున్న యంగ్‌ చక్కటి ఫుట్‌వర్క్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో టీ బ్రేక్‌ సమయానికి కివీస్‌ 72 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఆఖరి సెషన్‌లోనూ భారత్‌ సాధించిందేమీ లేదు. ఈ రెండు సెషన్లలో లాథమ్‌, యంగ్‌ల ఎల్బీ కోసం భారత్‌ తమ రివ్యూలను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తొలి వికెట్‌కు ఓపెనర్లు అజేయంగా 129 పరుగులు జోడిస్తూ రెండో రోజును ముగించారు.


1980 తర్వాత కాన్పూర్‌ టెస్టులో ఐదు వికెట్లు తీసిన తొలి విదేశీ పేసర్‌ టిమ్‌ సౌథీ


16 భారత్‌ తరఫున అరంగేట్ర టెస్టులో శతకం బాదిన 16వ బ్యాటర్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌. అలాగే స్వదేశంలో ఈ ఫీట్‌ సాధించిన పదో క్రికెటర్‌.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) బ్లండెల్‌ (బి) జేమిసన్‌ 13; గిల్‌ (బి) జేమిసన్‌ 52; పుజార (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 26; రహానె (బి) జేమిసన్‌ 35; శ్రేయాస్‌ (సి) యంగ్‌ (బి) సౌథీ 105; జడేజా (బి) సౌథీ 50; సాహా (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 1; అశ్విన్‌ (బి) ఎజాజ్‌ 38; అక్షర్‌ (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 3; ఉమేశ్‌ (నాటౌట్‌) 10; ఇషాంత్‌ (ఎల్బీ) ఎజాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 111.1 ఓవర్లలో 345 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-21, 2-82, 3-106, 4-145, 5-266, 6-288, 7-305, 8-313, 9-339, 10-345. బౌలింగ్‌: సౌథీ 27.4-6-69-5; జేమిసన్‌ 23.2-6-91-3; ఎజాజ్‌ పటేల్‌ 29.1-7-90-2; సోమర్‌విల్లే 24-2-60-0; రచిన్‌ రవీంద్ర 7-1-28-0.

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బ్యాటింగ్‌) 50; యంగ్‌ (బ్యాటింగ్‌) 75; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 57 ఓవర్లలో 129/0;బౌలింగ్‌: ఇషాంత్‌ 6-3-10-0; ఉమేశ్‌ 10-3-26-0; అశ్విన్‌ 17-5-38-0; జడేజా 14-4-28-0; అక్షర్‌ 10-1-26-0.


మోకాళ్లపై ఫీల్డింగ్‌

రెండో రోజు ఆటలో కివీస్‌ ఓపెనర్లను అవుట్‌ చేసేందుకు భారత్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. స్పిన్‌ బౌలింగ్‌లో తక్కువ ఎత్తులో వచ్చే క్యాచ్‌లను వెంటనే అందుకునేందుకు గల్లీలో మయాంక్‌ మోకాళ్లపై కూర్చుని ఫీల్డింగ్‌ చేయడం ఆశ్చర్యపరిచింది. అయితే దీనిపై అంపైర్‌ నితిన్‌ మీనన్‌ అభ్యంతరం చెప్పినట్టు కనిపించింది. కానీ అశ్విన్‌ గట్టిగానే వాదిస్తూ అతడిని అంగీకరించేలా చేశాడు. దీంతో కొన్ని ఓవర్లపాటు మయాంక్‌ అదే తీరున ఫీల్డింగ్‌ కొనసాగించాడు.

Updated Date - 2021-11-27T09:02:36+05:30 IST