వామప్‌ లేకుండా..సిద్ధమేనా?

ABN , First Publish Date - 2020-05-30T09:12:55+05:30 IST

కొవిడ్‌-19 వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ఇంకా పంజా విసురుతూనే ఉంది. ఈనేపథ్యంలో అటు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది...

వామప్‌ లేకుండా..సిద్ధమేనా?

కరోనాతో క్రీడలన్నీ అటకెక్కిన వేళ.. సూపర్‌ స్టార్లతో కూడిన భారత్‌-ఆస్ట్రేలియా మధ్య పూర్తి స్థాయి క్రికెట్‌ సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల కావడం సగటు అభిమానికి సంతోషం కలిగించింది. టీ20 ప్రపంచకప్‌, ఐపీఎల్‌పై ఇంకా స్పష్టత రాకపోయినా ఈ ఏడాది చివర్లో స్మిత్‌, కోహ్లీ బ్యాటింగ్‌ విన్యాసాలు చూడబోతున్నామన్న ఆనందం వ్యక్తమవుతోంది. కానీ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించిన నాలుగు టెస్టుల సిరీ్‌సలో కనీసం ఒక్క వామప్‌ మ్యాచ్‌ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. 


గతంలో కెప్టెన్‌ విరాట్‌ అభ్యంతరం

ఆసీ్‌సతో భారత్‌ టెస్టు సిరీస్‌ 


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

కొవిడ్‌-19 వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ఇంకా పంజా విసురుతూనే ఉంది. ఈనేపథ్యంలో అటు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. టీ20 ప్రపంచకప్‌ కూడా అక్కడే జరగాల్సి ఉన్నా సీఏ మాత్రం భారత్‌తో సిరీ్‌సకే ఎక్కువ  ప్రాధాన్యతనిస్తోంది. ఎందుకంటే ఈ పూర్తిస్థాయి సిరీస్‌ వారికి కాసుల పంట పండిస్తుంది. అందుకే మూడు ఫార్మాట్లలో సిరీస్‌ షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. దీంతో తమ దేశంలో క్రికెట్‌ పునరుద్ధరణ కూడా జరిగినట్టవుతుందని సీఏ ఆలోచన. అయితే అంతకన్నా ముందు ఆగస్టు 9 నుంచి ఆసీస్‌ జట్టు జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ ఆడుతుంది. కానీ దీనివల్ల వారికి ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. ఆ తర్వాత అక్టోబరు 11 నుంచి భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌ మొదలవుతుంది. ఈ సిరీస్‌ ముగిసిన మర్నాడే టీ20 ప్రపంచక్‌పకు తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


విరాట్‌ కోహ్లీ సేన టీ20 సిరీస్‌ ఆడాక.. ఒకవేళ పొట్టి ప్రపంచకప్‌ జరిగితే నవంబరు 15 తర్వాత భారత్‌కు వస్తుంది. ఆ తర్వాత డిసెంబరు 3 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే నాలుగు టెస్టుల కోసం తిరిగి కంగారూ గడ్డపై అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఈక్రమంలో 11 నుంచి 15 వరకు అడిలైడ్‌లో భారత జట్టు డే అండ్‌ నైట్‌ టెస్టును కూడా ఆడాలి. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. అత్యంత ఆసక్తిదాయకంగా సాగే ఈ సిరీస్‌ కోసం కనీసం ఒక్క ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను కూడా సీఏ కేటాయించలేదు. ఎలాంటి సన్నద్ధత లేకుండా ఆసీస్‌ గడ్డపై ఎదురయ్యే కఠిన సవాల్‌ను ఎదుర్కోవడం టీమిండియాకు ఇబ్బందే. ఇక గులాబీ టెస్టు విషయానికి వస్తే ఈ సమస్య మరింత ఎక్కువ కానుంది. ఈ సందర్భంగా ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆస్ట్రేలియాలో డే/నైట్‌ టెస్టులు ఆడేందుకు భారత జట్టు సిద్ధమేనా? అని గతేడాది కెప్టెన్‌ కోహ్లీని మీడియా సమావేశంలో ప్రశ్నిస్తే.. ‘వేదిక ఎక్కడైనా కానివ్వండి.. మేం పూర్తిగా సిద్ధమయ్యేందుకు కచ్చితంగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఉండాల్సిందే’ అని స్పష్టం చేశాడు. ఇక 2017-18 ఆసీస్‌ టూర్‌కు వెళ్లినప్పుడైతే అడిలైడ్‌లో పింక్‌ టెస్టు ఆడేందుకు భారత జట్టు ససేమిరా అంది. టూర్‌ మ్యాచ్‌ లేకుండా నేరుగా ఆడమంటే ఎలా కుదురుతుందని కోహ్లీ సూటిగానే అడిగాడు. మరి.. తాజా షెడ్యూల్‌లోనూ వామప్‌ మ్యాచ్‌ లేకపోయినా కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి ఆమోదముద్ర వేసినట్టేనా..? లేకపోతే ఎలాగూ ఈ సిరీస్‌ జరిగేది సందేహంగానే ఉన్న నేపథ్యంలో అనవసర రగడ ఎందుకనుకుంటున్నారా?

Updated Date - 2020-05-30T09:12:55+05:30 IST