Abn logo
Nov 21 2020 @ 22:19PM

పాకిస్తాన్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. నగ్రోటా ఘటనపై వార్నింగ్..

Kaakateeya

న్యూఢిల్లీ: పాకిస్తాన్ హై కమిషన్‌కు భారత్ ఇవాళ సమన్లు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రయత్నించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అలాంటి ఉగ్రసంస్థలకు కొమ్ముకాయడం మానుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు ఇవాళ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నగ్రోటా ఘటన అనంతరం పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు బయటపడడం... జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు జైషే ఉగ్రమూక కుట్ర పన్నినట్టు వెలుగు చూసిన నేపథ్యంలో భారత్ ఈ మేరకు స్పందించింది.


‘‘పాకిస్తాన్ హైకమిషన్ దౌత్య వ్యవహారాల చీఫ్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఉగ్రదాడులకు కుట్ర పన్నడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే ఈ కుట్రకు చెక్ పెట్టగలిగాం...’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఉగ్రవాదాన్ని అంతమొందించి దేశ భద్రత కోసం అవసరమైన ఎలాంటి చర్యలకైనా భారత్ కట్టుబడి ఉంటుందని స్పష్టంచేసింది. ఉగ్రవాదులు, ముష్కర మూకలకు పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయమివ్వడం మానుకోవాలనీ.. ఇతర దేశాలపై దాడులకు తెగబడేందుకు ఉగ్రవాదులు ఏర్పాటుచేసుకున్న స్థావరాలను వెంటనే ధ్వంసం చేయాలని భారత్ హెచ్చరించింది. గురువారం ఉదయం నగ్రోటాలో ఓ ట్రక్కులో నక్కిన నలుగురు జైషే ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement