దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ జూమ్..!

ABN , First Publish Date - 2020-04-07T17:53:49+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లలో ఇవాళ మళ్లీ లాభాల సందడి కనిపిస్తోంది. ఉదయం ట్రేడింగ్ మొదలైన దగ్గర్నుంచే పాజిటివ్‌గా కనిపించిన సూచీలు ఇవాళ

దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ జూమ్..!

ముంబై: భారత స్టాక్ మార్కెట్లలో ఇవాళ మళ్లీ లాభాల సందడి కనిపిస్తోంది. ఉదయం ట్రేడింగ్ మొదలైన దగ్గర్నుంచే పాజిటివ్‌గా కనిపించిన సూచీలు ఇవాళ ఏకంగా 5 శాతానికి పైగా లాభాలతో దూసుకెళ్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్రస్తుతం 1,498.16 పాయింట్ల (5.43 శాతం) లాభంతో 29089.11 వద్ద ట్రేడవుతుండగా... నిఫ్టీ సైతం అంతే జోరు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 456.40 పాయింట్ల (5.65 శాతం) లాభంతో 8540.20 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ స్టాక్‌మర్కెట్లు లాభాల్లో దూసుకెళ్తుండడం భారత స్టాక్‌మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపిస్తున్నట్టు ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి.


ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 ప్రభావం తగ్గుముఖం పడుతుందన్న ఆశలు ఇన్వెస్టర్లకు సరికొత్త బూస్ట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఫ్రాన్స్, ఇటలీ సహా ప్రధాన యూరోపియన్ దేశాల్లో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టడంతో యూరోపియన్ మార్కెట్లు సైతం లాభాల  బాటపట్టాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు సైతం కొద్దిమేర కోలుకున్నాయి. జపాన్ మార్కెట్ నిక్కీ 2.3 శాతం లాభాల్లో కొనసాగుతుండగా.. దక్షిణ కొరియా కోస్పి సైతం 1 శాతం మేర లాభపడింది. అమెరికా మార్కెట్లు సైతం దాదాపు 7 శాతం మేర లాభాలు నమోదు చేశాయి.

Updated Date - 2020-04-07T17:53:49+05:30 IST