గ్లోబల్ సెమీకండక్టర్ సప్లయ్ చైన్‌లో కీలక భాగస్వామిగా భారత్ : మోదీ ఆకాంక్ష

ABN , First Publish Date - 2022-04-29T19:07:49+05:30 IST

అంతర్జాతీయ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో కీలక భాగస్వాముల్లో

గ్లోబల్ సెమీకండక్టర్ సప్లయ్ చైన్‌లో కీలక భాగస్వామిగా భారత్ : మోదీ ఆకాంక్ష

న్యూఢిల్లీ : అంతర్జాతీయ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో కీలక భాగస్వాముల్లో ఒకటిగా భారత దేశం ఎదగడం కోసం సమష్టి లక్ష్యంతో కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేటి ప్రపంచంలో సెమీకండకర్ల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. సెమికాన్ ఇండియా సదస్సు, 2022ను శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 


కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వేలు, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సును బెంగళూరులో నిర్వహించారు. ఈ సదస్సు స్టీరింగ్ ప్యానెల్‌లో స్టార్టప్స్ ఆంత్రపెన్యూవర్స్, విద్యావేత్తలు, గ్లోబల్ ఇండస్ట్రీ లీడర్స్ ఉన్నారు. 


ఈ సదస్సులో మోదీ మాట్లాడుతూ, ఇటీవల ప్రకటించిన సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ గురించి వివరించారు. 10 బిలియన్ డాలర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సెమీకండక్లర్లు, మాన్యుఫ్యాక్చరింగ్, డిజైన్ ఇకోసిస్టమ్స్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఆర్థిక మద్దతు ఇవ్వడం కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సెమీకండక్లర్ టెక్నాలజీ కోసం ఆకర్షణీయ గమ్యస్థానంగా భారత దేశం ఉండటానికి ఆరు కారణాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ సాంకేతిక పరిజ్ఞాపం, అత్యధిక నాణ్యత, సమున్నత విశ్వసనీయత సిద్ధాంతం ఆధారంగా కృషి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 


130 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయులను అనుసంధానం చేయడానికి డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భారత దేశం నిర్మిస్తోందన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల విప్లవం, కలుపుగోలు ఆర్థిక వ్యవస్థలో మన దేశం ముందడుగు వేసిందన్నారు. 


క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్, 5జీ సామర్థ్యాభివృద్ధిలో పెట్టుబడులు, ఆరు లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు, తద్వారా భారత దేశం తదుపరి సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి భారత దేశం నాయకత్వం వహించడానికి బాటలు వేస్తున్నట్లు తెలిపారు. 


ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్ కంపెనీలకు అనుకూల పరిస్థితులతో మన దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా వృద్ధి చెందబోతోందన్నారు. మన దేశ సొంత వినియోగం కోసమే 2026నాటికి 80 బిలియన్ డాలర్ల విలువైన సెమీకండక్లర్లు అవసరమవుతాయని, ఇది 2030 నాటికి 110 బిలియన్ డాలర్లుకు చేరుతుందని చెప్పారు. 


వ్యాపారాన్ని సులువుగా చేయడం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)ను మరింత మెరుగుపరిచేందుకు విస్తృత స్థాయిలో సంస్కరణలను అమలు చేస్తున్నామని తెలిపారు. సెమీకండక్లర్లను డిజైన్ చేసే ప్రతిభావంతులు మన దేశంలో అసాధారణ స్థాయిలో ఉన్నారన్నారు. అగ్ర శ్రేణిలో ఉన్న 25 సెమీకండక్లర్ డిజైన్ కంపెనీల డిజైన్ లేదా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాలు మన దేశంలోనే ఉన్నాయని చెప్పారు. 


Updated Date - 2022-04-29T19:07:49+05:30 IST