ఖగోళ అధ్యయనాల కోసం ప్రపంచంలో తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ భారత్‌లో!

ABN , First Publish Date - 2022-06-04T21:48:29+05:30 IST

భారత దేశపు తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్‌ ఉత్తరాఖండ్‌లోని దేవస్థల్

ఖగోళ అధ్యయనాల కోసం ప్రపంచంలో తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ భారత్‌లో!

న్యూఢిల్లీ : భారత దేశపు తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్‌ ఉత్తరాఖండ్‌లోని దేవస్థల్ అబ్జర్వేటరీలో ఏర్పాటైంది. ప్రపంచంలో ఖగోళ అధ్యయనాల కోసం ఏర్పాటైన మొదటి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఇదే. అంతేకాకుండా ఆసియాలో అతి పెద్ద అంతర్జాతీయ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఇది. దీనిని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ARIES)కు చెందిన దేవస్థల్ అబ్జర్వేటరీ క్యాంపస్‌లో 2,450 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. 


ప్రపంచపు అంచునగల ఖగోళ అంశాలు, గెలాక్సీలను పరిశీలించేందుకు ఈ టెలిస్కోప్‌ను ఉపయోగిస్తారు. సంప్రదాయ టెలిస్కోపు (దుర్భిణి)లలో వక్రతల ఉపరితలంగల ఒకటి లేదా అంత కన్నా ఎక్కువ పాలిష్డ్ గ్లాస్ మిర్రర్స్ ఉంటాయి. నిర్దిష్ట రాత్రి వేళల్లో ప్రత్యేక ఖగోళ అంశాలను పరిశీలించేందుకు వీటిని వాడతారు. అయితే లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపులు రిఫ్లెక్టివ్ లిక్విడ్స్‌తో తయారవుతాయి. దేవస్థల్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్‌ (ILMT)లో మెర్క్యురీ (పాదరసం) వాడతారు. ఇది నక్షత్రాలు, గెలాక్సీలు, సోపర్‌నోవా పేలుళ్ళు, ఆస్టరాయిడ్స్, స్పేస్ డెబ్రిస్ వంటివాటిని పరిశీలించడానికి ఉపయోగిస్తారు. 


Liquid mirror telescope ఎలా పని చేస్తుంది?

ఓ కంటెయినర్‌లో 50 లీటర్ల పాదరసాన్ని నింపుతారు. ఐఎల్ఎంటీ నిలువు అక్షం వెంబడి ఈ కంటెయినర్ నిర్దిష్ట వేగంతో తిరుగుతుంది. వృత్తాకారంలో తిరగడం వల్ల ఈ కంటెయినర్లోని మెర్క్యురీ వ్యాపించి, అదే కంటెయినర్లో ఓ పలుచని పొరను ఏర్పరుస్తుంది. పారాబొలోయిడ్ ఆకారంలో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏర్పడి, మిర్రర్‌గా పని చేస్తుంది. నాలుగు మీటర్ల వ్యాసంతో కాంతిని ఫోకస్ చేయడానికి, సేకరించడానికి అనుకూలంగా ఉంటుంది. 


బెల్జియం, కెనడా, పోలండ్, ఉజ్బెకిస్థాన్ సహకారంతో ఈ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్‌ను భారత దేశం (India) ఏర్పాటు చేసింది. ఇది ఒక రాత్రికి దాదాపు 10 నుంచి 15 GB డేటాను సృష్టించగలదు. ఇది అక్టోబరు 2022 నుంచి ఐదేళ్ళపాటు పని చేస్తుంది. 


Updated Date - 2022-06-04T21:48:29+05:30 IST