అఫ్ఘాన్‌కు 2,500 టన్నుల గోధుమలు పంపిన భారత్

ABN , First Publish Date - 2022-02-22T23:42:41+05:30 IST

తీవ్ర ఆర్థికమాంద్యంతో పాటు ఆహార కొరతను ఎదుర్కొంటున్న అఫ్ఘాన్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. అఫ్ఘాన్‌ల ఆకలి తీర్చేందుకు 50,000 టన్నుల గోధుమలు పంపుతామని భారత్..

అఫ్ఘాన్‌కు 2,500 టన్నుల గోధుమలు పంపిన భారత్

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థికమాంద్యంతో పాటు ఆహార కొరతను ఎదుర్కొంటున్న అఫ్ఘాన్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. అఫ్ఘాన్‌ల ఆకలి తీర్చేందుకు 50,000 టన్నుల గోధుమలు పంపుతామని భారత్ పేర్కొన్నట్లుగానే మంగళవారం మొదటి విడత కింద 2,500 టన్నుల గోధుమలను పంపించారు. గోధుమలతో లోడ్ అయిన అఫ్ఘాన్‌కు చెందిన 50 ట్రక్కులను పంజాబ్‌లోని అట్టారా సరిహద్దు వద్ద విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వి శ్రింగ్లా జెండా ఊపి ప్రారంభించారు. ఇవి పాకిస్తాన్ మీదుగా అఫ్ఘాన్‌లోని జలానాబాద్‌కు వెళ్తాయి. ట్రక్కులను ప్రారంభించిన కార్యక్రమంలో భారత్‌లోని అఫ్ఘాన్ అంబాసిడర్ ఫరీద్ మముంద్రయా సైతం పాల్గొన్నారు.


ఈ సందర్భంగా భారత విదేశాంగ కార్యదర్శి శ్రింగ్లా మాట్లాడుతూ ‘‘అఫ్ఘాన్‌ను మా మానవ దాతృత్వాన్ని చాటుకుంటున్నాం. 50,000 టన్నుల గోధుమలు పంపిస్తామని ముందుగా చెప్పాం. ఇందులో భాగంగా ఈరోజు 2,500 టన్నుల గోధుమలను అఫ్ఘాన్‌కు పంపాము. ప్రపంచ వ్యాప్తంగా ఆహార పంపిణీకి ఇది తోడ్పాటును అందిస్తుంది. మరో 2-3 నెలల్లో మిగతా మొత్తం గోధుమల్ని అఫ్ఘాన్‌కు పంపిస్తాం’’ అని అన్నారు. ఇక భారత్‌లోని అఫ్ఘాన్ అంబాసిడర్ ఫరీద్ మముంద్రయా మాట్లాడుతూ ‘‘అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అఫ్ఘాన్‌కు సాయం అందించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. భారత్ పంపిస్తున్న గోధుమలు అఫ్ఘాన్‌ ప్రజలకు నెల రోజుల్లో పంచిపెడతాం. అప్ఘాన్‌కు భారత్ పెద్దన్నలాగా అండగా నిలిచింది’’ అని అన్నారు.

Updated Date - 2022-02-22T23:42:41+05:30 IST