గెలిచి..నిలుస్తారా?

ABN , First Publish Date - 2022-09-23T09:50:03+05:30 IST

మూడు టీ20ల సిరీ్‌సలో చావోరేవో మ్యాచ్‌కు భారత్‌ సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఓటమి కారణంగా నాగ్‌పూర్‌లో నేడు (శుక్రవారం) జరిగే రెండో టీ20లో రోహిత్‌..

గెలిచి..నిలుస్తారా?

ఒత్తిడంతా భారత్‌పైనే..

ఆసీస్‌తో నేడు రెండో టీ20

జట్టులోకి బుమ్రా!

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో...


నాగ్‌పూర్‌: మూడు టీ20ల సిరీ్‌సలో చావోరేవో మ్యాచ్‌కు భారత్‌ సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఓటమి కారణంగా నాగ్‌పూర్‌లో నేడు (శుక్రవారం) జరిగే రెండో టీ20లో రోహిత్‌ సేన కచ్చితంగా గెలవాల్సిందే. లేనిపక్షంలో సిరీ్‌సను కోల్పోవాల్సి ఉంటుంది. ఆసియాకప్‌ పరాభవంలో ఉన్న భారత జట్టు ఇప్పుడు వరుసగా మరో మ్యాచ్‌ కూడా ఓడితే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం అడుగంటుతుంది. అందుకే శక్తిసామర్థ్యాల మేరకు రాణించాలనే కసితో ఆటగాళ్లున్నారు. అయితే తొలిసారిగా ఆసీ్‌సపై అత్యధిక స్కోరు (208) నమోదు చేసినా కూడా కాపాడుకోలేకపోవడం జట్టు బౌలింగ్‌ బలహీనతను చాటినట్టయ్యింది.


చివరి నాలుగు ఓవర్లలో ఆసీ్‌సకు 55 పరుగులు అవసరం కాగా మరో నాలుగు బంతులుండగానే ఛేదనను ముగించడం.. భారత జట్టు డెత్‌ బౌలింగ్‌ వైఫల్యాన్ని బహిర్గతం చేసింది. ముందుగా ఈ విభాగం లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. అటు జోష్‌లో ఉన్న ఆసీస్‌ జట్టు మరో విజయంతో సగర్వంగా సిరీ్‌సను పట్టేయాలనుకుంటోంది. 


బుమ్రా రాకతో పటిష్టం:

వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ డెత్‌ ఓవర్లలో ఎప్పటిలాగే విఫలమవడం ఫలితాన్ని మార్చేసింది. తన టీ20 చరిత్రలోనే అత్యధికంగా 50+ పరుగులిచ్చుకున్నాడు. ఇక హర్షల్‌ పటేల్‌ గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చినా ప్రభావం చూపలేకపోయాడు. అక్షర్‌ మినహా అంతా ఓవర్‌కు పదికి పైగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకరం. మంచు ప్రభావంతో పాటు, పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించిందని సర్దిచెప్పుకొన్నా.. టీ20 మెగా టోర్నీకి ముందు భారత బౌలింగ్‌ను సరిదిద్దుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పేసర్‌ బుమ్రా ఆగమనం జట్టుకు ఉపశమనం కలిగించేదే. కానీ ఈ ఏడాది జట్టు ఆడిన 27 టీ20ల్లో బుమ్రా మూడింట్లో మాత్రమే బరిలోకి దిగాడు.


ఇక గాయం నుంచి కోలుకున్నా తొలి మ్యాచ్‌కు అతడిని దూరంగా ఉంచడం పలు సందేహాలకు దారి తీసింది. అయితే జూలై 14 నుంచి ఆటకు దూరంగా ఉన్న బుమ్రాతో నేరుగా మ్యాచ్‌ను ఆడించడం సరికాదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావించింది. ఒకవేళ బుమ్రా ఆడితే పేసర్‌ ఉమేశ్‌పై వేటు ఖాయమే. అలాగే 49 పరుగులిచ్చిన హర్షల్‌ స్థానంలో దీపక్‌ చాహర్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. ఇదిలావుండగా బ్యాటింగ్‌లో మాత్రం జట్టు అదరగొట్టింది. ముఖ్యంగా రాహుల్‌ ఆటతీరు కోచ్‌, కెప్టెన్‌లకు సంతృప్తిని కలిగించింది. సూర్యకుమార్‌, హార్దిక్‌ తమదైన శైలిలో ఆడగా.. కోహ్లీ తన ఫామ్‌ను చాటుకోవాల్సి ఉంది. 


అదే జోరుతో ముందుకు..:

కెరీర్‌లో తొలిసారిగా ఓపెనింగ్‌ చేసిన కామెరూన్‌ గ్రీన్‌ తానెదుర్కొన్న మొదటి నాలుగు బంతులను ఫోర్లుగా మలిచి సత్తా చాటుకున్నాడు. అతడి దూకుడుకు బౌలర్లు బిత్తరపోవాల్సి వచ్చింది. అయితే ఆసీస్‌ టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో అతడు లేకపోవడం గమనార్హం. మరోవైపు టిమ్‌ డేవిడ్‌, మాథ్యూ వేడ్‌ల ఫినిషింగ్‌ టచ్‌తో మ్యాచ్‌ మలుపు తిరిగింది. స్టీవ్‌ స్మిత్‌ కూడా పదును చూపించాడు. కానీ ఫించ్‌ ఫామ్‌లేమి మాత్రం జట్టుకు ఇబ్బందిగా మా రింది. తన చివరి 9 టీ20 మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే 20+ స్కోరు దాటాడు. స్లాగ్‌ ఓవర్లలో పేసర్‌ నాథన్‌ ఎల్లిస్‌ చక్కటి పేస్‌తో ఇబ్బందిపెడుతున్నాడు. 


జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌, హర్షల్‌/దీపక్‌, చాహల్‌/అశ్విన్‌, బుమ్రా.


ఆసీస్‌:

ఫించ్‌ (కెప్టెన్‌), గ్రీన్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఇన్‌గ్లి్‌స, డేవిడ్‌, వేడ్‌, కమిన్స్‌, ఎల్లిస్‌, జంపా, హాజెల్‌వుడ్‌. 


పిచ్‌, వాతావరణం

వర్షం కారణంగా గురువారం ప్రాక్టీస్‌ రద్దయింది. మ్యాచ్‌ రోజు కూడా చిరుజల్లులకు ఆస్కారం ఉంది. అలాగే ఇక్కడి వికెట్‌ బౌలర్లకు అనుకూలిస్తుంది. ఈ స్టేడియంలో జరిగిన చివరి (బంగ్లాదేశ్‌తో) టీ20 మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ ఏడు రన్స్‌కు ఆరు వికెట్లు తీయడం విశేషం.

Updated Date - 2022-09-23T09:50:03+05:30 IST