Womens World Cup: వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం

ABN , First Publish Date - 2022-03-12T19:11:20+05:30 IST

మహిళల వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో ఇండియా జట్టు వెస్టిండీస్ జట్టు ,,,

Womens World Cup: వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం

హామిల్టన్ : మహిళల వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో ఇండియా జట్టు వెస్టిండీస్ జట్టు మీద 155 పరుగుల భారీవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ కు ఇది రెండవ విజయం. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన భారత జట్టు, కేవలం 40.3 ఓవర్లలో వెస్టిండీస్ జట్టుని 162 పరుగులకే ఆలౌట్ చేసి, 155 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 


స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ వరల్డ్ కప్ పోటీల్లో భారీ స్కోరు సాధించింది. స్మృతి మందాన 119 బంతుల్లో 13 బౌండరీలు, రెండు సిక్సర్లతో 123 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలవగా,  హర్మన్ ప్రీత్ కౌర్ 107 బంతుల్లో 10 బౌండరీలు రెండు సిక్సర్లతో 109 పరుగులు చేసింది. 318 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు, భారత బౌలర్ల ధాటికి 162 కే ఆలౌట్ అయ్యింది.


భారీ స్కోర్..

కాగా.. టీమిండియా బ్యాటర్లు స్మృతి మంధాన(123), హర్మన్‌ప్రీత్ కౌర్(109) శతకాలతో చెలరేగడంతో మిథాలీసేన 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన టీమిండియా.. ప్రత్యర్థి విండీస్ ముందు 318 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టుకు ప్రారంభంలోనే భారీ దెబ్బ తగిలింది. 78 పరుగులకే కీలకమైన 3 వికెట్లు పారేసుకుంది. ఓపెనర్ యస్తీక భాటియా(21 బంతుల్లో 31 పరుగులు) కొద్దిపేపు బ్యాట్ ఝలిపించిన.. ఆ తర్వాత ఆమెతో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్(05), దీప్తిశర్మ(15) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత జట్టు 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


‘శతక’బాదిన స్మృతి..!

దీప్తిశర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన భారత ఇన్నింగ్స్‌ను నిర్మించింది. ఈ ద్వయం మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. ఈ క్రమంలో 108 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో స్మృతి మంధాన శతకం నమోదు చేసింది. అనంతరం కొద్దిసేపటికే 123 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగింది. దీంతో ఈ జోడీ 184 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రీచా ఘోష్ మరోసారి నిరాశపరిచింది. కేవలం 5 పరుగులే చేసి పెవిలియన్ చేరింది. మరోవైపు దూసుకుడుగా ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ 100 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ బాదింది. చివరికి 109 పరుగుల వద్ద హర్మన్ కూడా ఔటైంది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. కరేబియన్ బౌలర్లలో అనీషా మహ్మద్ 2 వికెట్లు తీయగా.. షమిలియా, హేలీ, షకేరా, దిండ్రా, అల్లేన్ తలో వికెట్ పడగొట్టారు.


విండీస్ బ్యాటింగ్ ఇలా..

ఇదిలా ఉంటే.. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన విండిస్ మొదట బాగా ఆడినప్పటికీ ఆ తర్వాత చేతులెత్తేసింది. ఓపెనర్లుగా దిగిన డియాండ్రా 46 బంతుల్లో 62 పరుగులు చేయగా.. హేలీ మ్యాథ్యూస్ 36 బంతుల్లో 43 పరుగులతో బౌండరీనే లక్ష్యంగా దంచికొట్టి శుభారంభం చేశారు. అయితే వారిని నిలువరించడానికి భారత బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయి వరుసగా పెవిలియన్‌కు పంపడంతో కట్టడి చేసినట్లయ్యింది. అలా ఓపెనర్లే కాదు.. వచ్చినవాళ్లంతా వచ్చినట్లే వెనుదిరగాల్సివచ్చింది. 100 పరుగుల తర్వాత విండీస్ పని దాదాపు అయిపోయింది. మధ్యలో షమేన్, చెడియాన్ ఇద్దరూ కాసేపు వికెట్లు పడకుండా ఆడి 162 పరుగుల వరకూ తీసుకెళ్లారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కూడా పెవిలియన్‌కు వెళ్లారు. ఇలా అందరూ ఆలౌట్ అవ్వడంతో విండీస్‌పై టీమిండియా 155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో స్నేహ్ రాణా 3, మేఘ్నా 2 వికెట్లు,  రాజేశ్వరి, పూజూ, ఝలన్ గోస్వామి తలో వికెట్ తీసి విండీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు.

Updated Date - 2022-03-12T19:11:20+05:30 IST