337.. ఊదేశారు

ABN , First Publish Date - 2021-03-27T10:39:22+05:30 IST

భారత్‌ స్కోరు 336. ఈ స్కోరు చూస్తే ఈ మ్యాచే కాదు.. సిరీస్‌ కూడా టీమిండియాదే అనిపించడం సహజం.

337.. ఊదేశారు

భారత్‌ స్కోరు 336. ఈ స్కోరు చూస్తే ఈ మ్యాచే కాదు.. సిరీస్‌ కూడా టీమిండియాదే అనిపించడం సహజం. కానీ ఇంగ్లండ్‌ టాపార్డర్‌ జేసన్‌ రాయ్‌, బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌  బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడ్డారు. తొలి రెండు వికెట్లకు సెంచరీ భాగస్వామ్యాలు ఏర్పడ్డాయి. స్టోక్స్‌ అయితే ఆకాశమే హద్దుగా 10 సిక్సర్లతో హోరెత్తించాడు. 31-35 ఓవర్ల మధ్యలో ఏకంగా 87 రన్స్‌ రావడంతో మరో 39 బంతులుండగానే ఇంతటి భారీ ఛేదన పూర్తయింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో రాహుల్‌ శతకం.. కోహ్లీ, పంత్‌ హాఫ్‌ సెంచరీలు సాధించినా బౌలర్లు తేలిపోయారు.

ఇంగ్లండ్‌ తరఫున వన్డేల్లో ఎక్కువ (13) శతక భాగస్వామ్యాలు అందించిన జోడీగా రాయ్‌-బెయిర్‌స్టో.

మూడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లీ. రికీ పాంటింగ్‌ (12,662) ముందున్నాడు.

 ఓ వన్డే మ్యాచ్‌ ఒకే ఓవర్లో ఎక్కువ పరుగులిచ్చిన (28) మూడో భారత బౌలర్‌గా క్రునాల్‌.



పుణె: సిరీ్‌సలో ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జూలు విదిల్చింది. బెయిర్‌స్టో (112 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 124) సెంచరీ సాధించగా.. బెన్‌ స్టోక్స్‌ (52 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 99) ఎంసీఏ మైదానంలో విధ్వంసమే సృష్టించాడు. దీంతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమం కాగా ఆదివారం నిర్ణాయక ఆఖరి మ్యాచ్‌ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగుల స్కోరు చేసింది. రాహుల్‌ (114 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 108) సెంచరీ సాఽధించగా.. రిషభ్‌ పంత్‌ (40 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 77), కోహ్లీ (66) హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశారు. హార్దిక్‌ (16 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 35) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. టోప్లే, టామ్‌ కర్రాన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్‌ 43.3 ఓవర్లలో 4 వికెట్లకు 337 పరుగులు చేసి గెలిచింది. రాయ్‌ (55) రాణించాడు. ప్రసిద్ధ్‌కు రెండు వికెట్లు లభించాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బెయిర్‌స్టో నిలిచాడు. శ్రేయాస్‌ స్థానంలో పంత్‌ భారత జట్టులోకి వచ్చాడు.



ఆరంభం అదిరేలా..:

భారత్‌ ఆటకు భిన్నంగా ఇం గ్లండ్‌ ఆది నుంచే వేగం చూపింది. ఎప్పటిలాగే ఓపెనర్లు రాయ్‌-బెయిర్‌స్టో అదరగొడుతూ తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఓ సిక్సర్‌తో 48 బం తుల్లో రాయ్‌ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే 17వ ఓవర్‌లో రోహిత్‌ సూపర్‌ త్రోతో రాయ్‌ రనౌటయ్యాడు.


వామ్మో స్టోక్స్‌..:

బెయిర్‌స్టోకు జత కట్టిన స్టోక్స్‌.. ఇ న్నింగ్స్‌ను విధ్వంసకరంగా మార్చాడు. మధ్య ఓవర్లలో ఆచితూచి ఆడినా 31వ ఓవర్‌ నుంచి ఇంగ్లండ్‌ ఆటతీరు మారింది. కుల్దీప్‌ వేసిన ఆ ఓవర్‌లో బెయిర్‌స్టో ఓ సిక్సర్‌తో శతకం పూర్తి చేశాడు. అటు స్టోక్స్‌ అదే ఓవర్‌లో 6,4 బాదగా 17 పరుగులు వచ్చాయి. అలాగే తన మరుసటి ఓవర్‌లోనూ 6,6,6 బాదిన స్టోక్స్‌ ఈసారి 20 పరుగులు రాబట్టాడు. ఇక క్రునాల్‌ను 6,4,6,6తో... ప్రసిద్ధ్‌ను 6,4,4తో ఆడుకోవడంతో పరుగుల వరద పారింది. కానీ 36వ ఓవర్‌లో భువీ బంతిని పుల్‌ షాట్‌ ఆడి కీపర్‌ పంత్‌కు చిక్కడంతో ఒక్క రన్‌తో స్టోక్స్‌ సెంచరీ కోల్పోయాడు. 40 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన అతడు మిగతా 49 రన్స్‌ను 12 బంతుల్లోనే రాబట్టడం విశేషం. తర్వాతి ఓవర్‌లో బెయిర్‌స్టో, బట్లర్‌ (0)ను ప్రసిద్ధ్‌ అవుట్‌ చేసినా ఇంగ్లండ్‌ ఎలాంటి తడబాటు లేకుండా 44వ ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించింది.


ఆదుకున్న కోహ్లీ-రాహుల్‌:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. 37 పరుగులకే ఓపెనర్లు ధవన్‌ (4), రోహిత్‌ (25) అవుటవడంతో టీమిండియా ఈసారి తడబడినట్టు కనిపించింది. ఈ దశలో కెప్టెన్‌ కోహ్లీ, రాహుల్‌ సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 35 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ క్యాచ్‌ను బట్లర్‌ అందుకోలేకపోయాడు. అయితే 62 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన కోహ్లీని 32వ ఓవర్‌లో రషీద్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అప్పటికే మూడో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం లభించింది.


పంత్‌-హార్దిక్‌ జోరు:

కోహ్లీ నిష్క్రమణ తర్వాత రాహుల్‌కు రిషభ్‌ పంత్‌ జత కలిశాడు. 40వ ఓవర్‌లో పంత్‌ను ఎల్బీగా ప్రకటించినా రివ్యూ ద్వారా బతికిపోయాడు. మొత్తంగా పంత్‌ 28 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు 108 బంతుల్లో రాహుల్‌ కెరీర్‌లో ఐదో శతకాన్ని పూర్తి చేసినా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ ధనాధన్‌ ఆటతో చెలరేగాడు. అటు పంత్‌ జోరుకు 47వ ఓవర్‌లో టామ్‌ కర్రాన్‌ బ్రేక్‌ వేశాడు. ఇక చివరి ఓవర్‌లో హార్దిక్‌ అవుటైనా అప్పటికే జట్టు పటిష్ఠ స్కోరుకు చేరుకుంది. చివరి 10 ఓవర్లలోనే భారత్‌ 126 పరుగులు సాధించడం విశేషం.


స్టోక్స్‌కు హెచ్చరిక

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ బంతికి ఉమ్మిని పూయడంతో అంపైర్‌ హెచ్చరించాల్సి వచ్చింది. భారత్‌ ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో అతడు అప్రయత్నంగా చేసిన ఈ పనిని అంపైర్‌ వీరేందర్‌ శర్మ గమనించాడు. వెంటనే రూల్‌ ప్రకారం బంతిని శానిటైజ్‌ చేశారు. అలాగే తాత్కాలిక కెప్టెన్‌ బట్లర్‌కు అంపైర్‌ ఈ విషయాన్ని తెలుపుతూ మరోసారి ఉమ్మి పూస్తే ఐదు పెనాల్టీ పరుగులు విధించాల్సి ఉంటుందని గుర్తుచేశాడు.


విమర్శకులకు జవాబిది..

శతకం పూర్తవగానే రాహుల్‌ తన రెండు చెవులను మూసినట్టు పోజిచ్చాడు. ఇది చర్చనీయాంశం కావడంతో మ్యాచ్‌ తర్వాత వివరణ ఇచ్చాడు. ‘అది ఎవరినీ కించపరిచినట్టు కాదు. అనవసరమైన మాటలు ఇక చాలించండి అని సూచించడమే. బయట కొంత మంది మనల్ని కిందికి లాగేందుకు ఎదురుచూస్తుంటారు. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రాహుల్‌ తెలిపాడు.


స్కోరుబోర్డు


భారత్‌: రోహిత్‌ (సి) రషీద్‌ (బి) సామ్‌ కర్రాన్‌ 25; ధవన్‌ (సి) స్టోక్స్‌ (బి) టోప్లే 4; కోహ్లీ (సి) బట్లర్‌ (బి) రషీద్‌ 66; రాహుల్‌ (సి) టోప్లే (బి) టామ్‌ కర్రాన్‌ 108; పంత్‌ (సి) రాయ్‌ (బి) టామ్‌ కర్రాన్‌ 77; హార్దిక్‌ (సి) రాయ్‌ (బి) టోప్లే 35; క్రునాల్‌ (నాటౌట్‌) 12; శార్దూల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 50 ఓవర్లలో 336/6. వికెట్ల పతనం: 1-9, 2-37, 3-158, 4-271, 5-308, 6-334. బౌలింగ్‌: సామ్‌ కర్రాన్‌ 7-0-47-1; టోప్లే 8-0-50-2; టామ్‌ కర్రాన్‌ 10-0-83-2; స్టోక్స్‌ 5-0-42-0; మొయిన్‌ 10-0-47-0; రషీద్‌ 10-0-65-1.


ఇంగ్లండ్‌: రాయ్‌ (రనౌట్‌) 55; బెయిర్‌స్టో (సి) కోహ్లీ (బి) ప్రసిద్ధ్‌ 124; స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) భువనేశ్వర్‌ 99; మలాన్‌ (నాటౌట్‌) 16; బట్లర్‌ (బి) ప్రసిద్ధ్‌ 0; లివింగ్‌స్టోన్‌ (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 43.3 ఓవర్లలో 337/4. వికెట్ల పతనం: 1-110, 2-285, 3-287, 4-287. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10-0-63-1; ప్రసిద్ధ్‌ కృష్ణ 10-0-58-2; శార్దూల్‌ 7.3-0-54-0; కుల్దీప్‌ 10-0-84-0; క్రునాల్‌ 6-0-72-0.

Updated Date - 2021-03-27T10:39:22+05:30 IST