Abn logo
Aug 4 2020 @ 21:32PM

పాకిస్థాన్ కొత్త మ్యాప్ హాస్యాస్పదం : భారత్

న్యూఢిల్లీ : ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని మంత్రివర్గం మంగళవారం పాకిస్థాన్ కొత్త మ్యాప్‌ను ఆమోదించడం హాస్యాస్పదమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత దేశంలోని భూభాగాలను తమవిగా చెప్పుకుంటూ చేస్తున్న ప్రకటనలకు చట్టబద్ధత, అంతర్జాతీయ విశ్వసనీయత లేవని ప్రకటించింది. 


అంతకుముందు ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, తన మంత్రివర్గం పాకిస్థాన్ నూతన మ్యాప్‌ను ఆమోదించిందని తెలిపారు.  ప్రపంచం ముందు నూతన పాకిస్థానీ మ్యాప్‌ను పెడుతున్నామన్నారు. దీనిని పాకిస్థాన్ మంత్రివర్గం, ప్రతిపక్షాలు, కశ్మీరీ నాయకత్వం బలపరుస్తున్నట్లు తెలిపారు. 


జమ్మూ-కశ్మీరు, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లోని జునాగఢ్, మనవడర్‌లతోపాటు సర్ క్రీక్ కూడా పాకిస్థాన్ దేశంలోనివేనని ఈ కొత్త మ్యాప్ పేర్కొంది. ఇది పాకిస్థాన్, కశ్మీరీ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని ఇమ్రాన్ తెలిపారు.


ఈ నేపథ్యంలో భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ విడుదల చేసిన ప్రకటనలో, ‘‘భారత దేశపు రాష్ట్రం గుజరాత్‌లోని భూభాగాలు, మా కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీరు, లడఖ్‌ తమవేనని అసమంజసంగా ప్రకటించుకోవడం, ఇది రాజకీయ ప్రహసనంతో కూడిన విన్యాసం. ఈ హాస్యాస్పద ప్రకటనలకు చట్టబద్ధమైన చెట్లుబాటు కానీ, అంతర్జాతీయ విశ్వసనీయత కానీ లేవు’’ అని పేర్కొన్నారు. 


‘‘నిజానికి, ఈ కొత్త ప్రయత్నం కేవలం పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది. క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహాయంతో భౌగోళిక విస్తరణ పట్ల తహతహను ధ్రువీకరిస్తోంది’’ అని పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement