ఆఫ్ఘన్ నుంచి అత్యధికులను రప్పించాం : భారత్

ABN , First Publish Date - 2021-08-27T23:10:40+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి తిరిగి భారత దేశానికి రావాలనుకున్న

ఆఫ్ఘన్ నుంచి అత్యధికులను రప్పించాం : భారత్

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి తిరిగి భారత దేశానికి రావాలనుకున్న భారతీయుల్లో అత్యధికులను రప్పించామని భారత ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఆరు విమానాల్లో దాదాపు 550 మందిని కాబూల్, దుషాంబే నగరాల నుంచి భారత దేశానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వీరిలో 260 మందికి పైగా భారతీయులు ఉన్నారని చెప్పారు. భారతీయులను ఇతర సంస్థల ద్వారా తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. అమెరికా, తజకిస్థాన్ వంటి దేశాలను నిరంతరం సంప్రదిస్తున్నట్లు తెలిపారు. 


కొందరు ఆఫ్ఘన్లను, ఇతర దేశాల వారిని కూడా ఆఫ్ఘనిస్థాన్ నుంచి తీసుకురాగలిగినట్లు తెలిపారు. ప్రధానంగా భారతీయులను తీసుకురావడంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. మనకు అండగా నిలిచిన ఆఫ్ఘన్లకు మనం కూడా అండదండలు అందిస్తామన్నారు. మరికొందరు భారతీయులు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉండి ఉండవచ్చునని, అయితే ఎందరు ఉన్నారో కచ్చితమైన సమాచారం లేదని తెలిపారు. 


ప్రస్తుతం భారతీయులను రప్పించడానికే ప్రాధాన్యమిస్తున్నామని, ఆఫ్ఘనిస్థాన్‌‌లో తాలిబన్ల పరిపాలనను గుర్తించాలా? వద్దా? అనేది తదుపరి పరిశీలించవలసిన అంశమని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయన్నారు. ప్రజల రక్షణ, భద్రత మాత్రమే ఇప్పుడు ప్రధానమైనవని చెప్పారు. ఆ దేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేదన్నారు. ప్రభుత్వ గుర్తింపుపై ముందుగానే ఆలోచిస్తున్నామని తాను భావిస్తున్నానన్నారు. 


ఇదిలావుండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్‌లో సుమారు 20 మంది భారతీయులు ఇప్పటికీ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కొందరు భారతీయులు తిరిగి స్వదేశానికి రావాలనుకోవడం లేదని తెలుస్తోంది. గురువారం ఓ సైనిక విమానంలో దాదాపు 180 మందిని కాబూల్ నుంచి తీసుకొచ్చారు. 


Updated Date - 2021-08-27T23:10:40+05:30 IST