తాలిబన్ ప్రభుత్వం గురించి తెలియదు : భారత్

ABN , First Publish Date - 2021-09-03T00:49:12+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో ఎటువంటి ప్రభుత్వం ఏర్పడబోతున్నదీ తెలియదని

తాలిబన్ ప్రభుత్వం గురించి తెలియదు : భారత్

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో ఎటువంటి ప్రభుత్వం ఏర్పడబోతున్నదీ తెలియదని భారత్ పేర్కొంది. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వ స్వభావానికి సంబంధించిన వివరాలేవీ తెలియవని తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియాతో మాట్లాడుతూ, తాలిబన్ల ప్రతినిధితో భారత్ సమావేశం గురించి తాజా వివరాలేవీ లేవని చెప్పారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పడబోయే ప్రభుత్వ స్వభావం లేదా వివరాలు భారత్‌కు తెలియవని అరిందమ్ బాగ్చీ చెప్పారు. తాలిబన్లతో సమావేశం గురించి తాజా వివరాలేవీ  లేవన్నారు. దోహాలో తాలిబన్ నేతతో భారత రాయబారి చర్చల నేపథ్యంలో తదుపరి పరిణామాల గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు బాగ్చీ బదులిస్తూ, తాలిబన్లతో తదుపరి సమావేశాల గురించి ఔను, కాదు అని చెప్పే విషయం కాదన్నారు. ఆఫ్ఘనిస్థాన్ గడ్డ ఏ విధంగానూ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడకూడదనేదే భారత్ లక్ష్యమని చెప్పారు. ఏదైనా తాలిబన్ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా గుర్తించడం గురించి చెప్పడం త్వరపడటం అవుతుందన్నారు. 


ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు జరగడం లేదని, మరిన్ని వైమానిక సేవలను ఎప్పటి నుంచి ప్రారంభించగలమో తెలియదని చెప్పారు. దీనిపై ప్రత్యేక ఆఫ్ఘన్ సెల్ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఇంకా ఎందరు భారతీయులు ఉన్నారో కచ్చితంగా చెప్పలేమన్నారు. భారత దేశానికి తిరిగి రావడానికి ఇష్టపడినవారిలో అత్యధికులు వచ్చేశారన్నారు.


తాలిబన్లతో అధికారికంగా తొలిసారి మంగళవారం భారత్ మాట్లాడింది. తాలిబన్ రాజకీయ వ్యవహారాల చీఫ్ షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్‌తో ఖతార్‌కు భారత దేశ రాయబారి దీపక్ మిట్టల్ దోహాలోని ఇండియన్ మిషన్‌లో మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని భారతీయుల భద్రతపై, ముఖ్యంగా మైనారిటీల రక్షణపై వీరు మాట్లాడారు. భారత దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా ఆఫ్ఘన్ గడ్డను ఉపయోగించుకోరాదని మిట్టల్ కోరారు. 


Updated Date - 2021-09-03T00:49:12+05:30 IST