Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

భారత్‌ నిరసన

twitter-iconwatsapp-iconfb-icon

ఉక్రెయిన్‌పై దాదాపు నెలన్నరగా రష్యా విరుచుకుపడుతున్న స్థితిలో, తొలిసారిగా కాస్తంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం భారత్‌కు ఎదురైంది. బుచా నగరంలో రష్యా సైనికులు సృష్టించిన ఘోరకలిని పాశ్చాత్యదేశాలు తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో, ఈ విషాదంపై స్వతంత్రదర్యాప్తు సాగాలన్న డిమాండ్‌కు భారతదేశం సైతం మద్దతు ప్రకటించింది. భద్రతామండలిలో జాగ్రత్తగా పేర్చినమాటల మధ్యన భారత్ ఈ ఘోరాన్ని ఖండించింది. పార్లమెంటులో విదేశాంగమంత్రి జయశంకర్ కూడా బుచా మారణకాండను తప్పుపడుతూ, యుద్ధం విషయంలో భారత వైఖరిని సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. 


ఉక్రెయిన్ అధ్యక్షుడు వలోదిమిర్ జెలెన్ స్కీ మంగళవారం భద్రతామండలిని ఉద్దేశించి చేసిన ప్రసంగం గతానికి భిన్నమైనది. పాశ్చాత్యదేశాల స్క్రీన్లమీద అడపాదడపా ప్రత్యక్షమవుతూ రష్యాకు వ్యతిరేకంగా వాటి మద్దతు కూడగట్టడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, ఉక్రెయిన్ రాజధాని కివ్ సరిహద్దుల్లోని బుచా నగరంలో జరిగిన భయంకరమైన ఊచకోత వెలుగులోకి వచ్చిన తరువాత ఆయన ప్రసంగానికి ప్రపంచం మరింత శ్రద్ధతో చెవొగ్గింది. విధ్వంసంపై ఆయన చెబుతున్న మాటలకు, లెక్కలకు విలువచేకూరింది. 


ఉక్రెయిన్ రాజధానిని స్వాధీనం చేసుకోవడం అనుకున్నంత సులభం కాకపోవడంతో రష్యా అక్కడనుంచి వెనక్కుతగ్గి వేరేప్రాంతాలమీదకు దృష్టిమరలించి ఉండవచ్చు. ఏ కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అది ఖాళీచేసిన ప్రాంతాల్లో మిగతా ప్రపంచం దాని అమానుషత్వాన్ని చూడగలిగింది. బుచా ఘోరకలి చెచెన్యా, సిరియాలను గుర్తుకుతెచ్చింది. వందలాదిమంది అమాయకులను ఊచకోతకోయడం, ఆస్పత్రులు, ఆహార గిడ్డంగులన్న తేడాలేకుండా అన్నింటినీ నేలమట్టం చేయడం రష్యాకు అలవాటేనని పాశ్చాత్యమీడియా విరుచుకుపడుతున్నది. ఈ భూమిమీద అత్యంత సర్వనాశనమైన నగరం చెచెన్యా రాజధాని గ్రోజ్నీ అని ఐక్యరాజ్యసమితి అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. సిరియాలో అసద్ అధికారాన్ని కాపాడడానికి రసాయనిక ఆయుధాలను సైతం రష్యా ప్రయోగించిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు బూచా ఊచకోతల విషయంలో కూడా రష్యా ఏదో దబాయిస్తున్నది కానీ, అంతర్జాతీయ మీడియా వెలుగులోకి తెస్తున్న సాక్ష్యాలు పూర్తిగా కొట్టిపారేయలేనివి. రష్యా దమనకాండ గురించి ఇప్పటివరకూ ఉక్రెయిన్ చేస్తున్న వాదనలకు ఈ ఘటనతో మరింత విశ్వసనీయత ఏర్పడింది.  


ఊచకోతలు, రక్తపాతం సమస్యకు పరిష్కారం కాదనీ, చర్చలు మాత్రమే హింసకు ముగింపు పలుకుతాయని జయశంకర్ పార్లమెంటులో చేసిన ప్రకటన సముచితమైనది. బుచా ఊచకోతలను ఖండించడం, తీవ్రమైన అంశంగా వ్యాఖ్యానించి స్వతంత్రదర్యాప్తుకు మద్దతు ప్రకటించడంద్వారా భారతదేశం పాశ్చాత్యదేశాల ఆగ్రహాన్ని కాస్తంత ఉపశమింపచేయగలిగింది. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలను గౌరవించాలన్న వ్యాఖ్య కూడా రష్యాకు హితవే అనుకోవాలి. యుద్ధం వద్దనీ, అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమనీ రష్యాకు తెలియచేసినట్టు కూడా జయశంకర్ చెబుతున్నారు. యుద్ధంలో ఎవరిపక్షమూ వహించబోమనీ, మాది శాంతిమార్గమనీ పైకి చెబుతూవస్తున్న భారతదేశం మానసికంగా, వాస్తవికంగా ఎటువున్నదో అందరికీ తెలిసిందే. అమెరికా దాని మిత్రదేశాల నాయకులు తమ వరుసపర్యటనల్లో భారత్ ను తమ దారికి తెచ్చుకొనే ప్రయత్నం చేశారు. రష్యా ఎల్లప్పటికీ మీ పక్షాన ఉంటుందనీ, కష్టకాలంలో ఆదుకుంటుందనీ భ్రమపడకండి, అది చివరికి చైనా మాట విని మీ కొంపముంచుతుంది అని అమెరికా నర్మగర్భంగా హెచ్చరికలు చేసిన వెంటనే రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లెవరోవ్ భారత్ లో వాలిపోయి, మరింత నమ్మకాన్నిచ్చి మరీవెళ్ళారు. యుద్ధసమయంలో తమకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియచేయడం ఆయన పర్యటన ప్రధాన లక్ష్యం. కానీ, అమెరికా సహా పశ్చిమదేశాల ఒత్తిడిని తట్టుకుంటూ అంతర్జాతీయ వేదికలమీద రష్యా పక్షాన నిలుస్తున్న భారతదేశానికి బుచా ఊచకోత విషమపరీక్ష. ఈ సందర్భంగా భారత్ తీసుకున్న వైఖరి యూటర్న్ కాదు కానీ, రష్యా త్వరితంగా ఈ యుద్ధానికి స్వస్తిచెప్పనిపక్షంలో అది మరింత ప్రమాదంలోపడటంతో పాటు, మిత్రదేశాలను మరిన్ని కష్టాల్లోకి నెట్టేయడం ఖాయం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.