భారత్ చమక్

ABN , First Publish Date - 2021-09-06T08:19:11+05:30 IST

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పారాలింపియన్లు అత్యధిక పతకాలు గెలుచుకొని మనందరి హృదయాలను పరవశింపజేశారు.

భారత్ చమక్

భారత్‌ ప్యారాలింపిక్స్‌

టోక్యో పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మన క్రీడాకారులు

గత 11 పోటీల్లో గెలిచినవి 12.. ఈసారి అద్భుత ప్రదర్శనతో 19

చివరి రోజు బ్యాడ్మింటన్‌లో కృష్ణకు స్వర్ణం, కలెక్టర్‌ సుహాస్‌కు రజతం


టోక్యో పారాలింపిక్స్‌ను భారత్‌ ఘనంగా ముగించింది. మన క్రీడాకారులు ఆదివారం మరో 2 పతకాలను సాధించారు. బ్యాడ్మింటన్‌లో రాజస్థాన్‌ షట్లర్‌ కృష్ణ నాగర్‌ స్వర్ణంతో సత్తా చాటితే.. ఐఏఎస్‌ అధికారి సుహాస్‌ యతిరాజ్‌ రజతంతో మురిపించాడు. దీంతో భారత్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలను సాధించి రికార్డులకెక్కింది. 


 ఈ విజయం మనకు ప్రత్యేకం

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పారాలింపియన్లు అత్యధిక పతకాలు గెలుచుకొని మనందరి హృదయాలను పరవశింపజేశారు. అందుకే ఈ క్రీడలు మనకు ఎప్పటికీ ప్రత్యేకమైనవి. టోక్యో పారాలింపిక్స్‌ ప్రతి భారతీయుని మదిలో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఈ విజయం భవిష్యత్‌లో క్రీడల్లో భాగస్వామ్యం పెరిగేందుకు దోహదం చేస్తుంది. పారాలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందంలోని ప్రతి సభ్యుడు ఓ చాంపియన్‌, భావితరాల్లో ప్రేరణ కల్పించే ఒక వనరు.

- ప్రధాని నరేంద్ర మోదీ

కల నిజమాయె..

నా కల నిజమైంది. తల్లిదండ్రులు, బంధువులు, భగవంతుడు, నా కోచ్‌లకు కృతజ్ఞతలు. పారాలింపిక్స్‌లో కనబరిచిన అద్భుత ప్రదర్శనను రాబోయే క్రీడల్లో కూడా భారత్‌ కొనసాగిస్తుందని ఆశిస్తున్నా.

-కృష్ణ నాగర్‌




పారాలింపియన్లకు ప్రధాని ఆతిథ్యం

టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఇటీవల ఒలింపిక్స్‌లో పోటీపడ్డ అథ్లెట్లకు ఆతిథ్యమిచ్చినట్టుగానే.. టోక్యో నుంచి రాగానే పారా అథ్లెట్లందరితో ప్రధాని భేటీ అవుతారని ఠాకూర్‌ తెలిపారు. 


 భారత పతక విజేతలు

స్వర్ణాలు (5)

అవని లేఖార (షూటింగ్‌)

మనీశ్‌ నర్వాల్‌ (షూటింగ్‌)

సుమిత్‌ అంటిల్‌ (జావెలిన్‌ త్రో)

ప్రమోద్‌ భగత్‌ (బ్యాడ్మింటన్‌)

 కృష్ణ నాగర్‌ (బ్యాడ్మింటన్‌)


రజతాలు (8)

భవినా పటేల్‌ (టేబుల్‌ టెన్నిస్‌)

యోగేశ్‌ కథునియా (డిస్కస్‌ త్రో)

జఝారియా (జావెలిన్‌ త్రో)

నిషద్‌ కుమార్‌ (హైజంప్‌)

మరియప్పన్‌  (హైజంప్‌)

ప్రవీణ్‌ కుమార్‌ (హైజంప్‌)

సింగ్‌రాజ్‌ అధాన (షూటింగ్‌)

సుహాస్‌ యతిరాజ్‌ (బ్యాడ్మింటన్‌)


కాంస్యాలు (6)

సుందర్‌సింగ్‌ (జావెలిన్‌ త్రో)

సింగ్‌రాజ్‌ అధాన (షూటింగ్‌)

శరద్‌ కుమార్‌ (హైజంప్‌)

అవని లేఖార (షూటింగ్‌)

హర్విందర్‌ సింగ్‌ (ఆర్చరీ)

మనోజ్‌ సర్కార్‌ (బ్యాడ్మింటన్‌)


మొత్తం పతకాలు 19

8 చివరిరోజు రెండు పతకాలు

8 కృష్ణకు స్వర్ణం, సుహాస్‌కు రజతం

8 19 పతకాలతో పారాలింపిక్స్‌కు ఘన వీడ్కోలు


పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షట్లర్లు అంతే అమోఘంగా క్రీడలకు ముగింపు ఇచ్చారు. ఆదివారం, చివరిరోజు పురుషుల సింగిల్స్‌లో కృష్ణ నాగర్‌, సుహాస్‌ యతిరాజ్‌ స్వర్ణ, రజత పతకాలతో మెరిశారు.  మొత్తంగా ఈ క్రీడల్లో అంచనాలను మించి 19 పతకాలు సాధించిన భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు.


సంకల్పంలో ‘వామనుడు’

నవ్విన నాప చేనే పండింది. మరుగుజ్జు రూపం కారణంగా స్కూల్లో ఎగతాళికి గురైన కృష్ణ నాగర్‌.. ఇప్పుడు దేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. తన వయసు పిల్లలతో పోల్చితే చాలా తక్కువ ఎత్తు ఉండడంతో ఎంతో మానసిక వేదనకు గురైన నాగర్‌.. స్కూల్లో చదివేటప్పుడు మిగతా పిల్లలు అతడిని చూసి ఎప్పుడూ ఎగతాళి చేయడడంతో మరింత వేదనకు గురయ్యాడు. ఎముకల్లో ఎదుగుదల లేకపోవడంతో కృష్ణ ఎత్తు పెరగలేదు. అయితే, హేళనను తట్టుకోలేక హైట్‌ పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని.. అప్పుడు తీవ్ర నొప్పిని కూడా అనుభవించానని నాగర్‌ గుర్తు చేసుకున్నాడు. ‘నాకు రెండేళ్ల వయసులోనే ఈ లోపం బయటపడింది. డాక్టర్లను సంప్రదిస్తే ఎముకల్లో లోపం ఉందని చెప్పారు. ఆ వయసు పిల్లలతో పోల్చితే పెరుగుదల తక్కువగానే ఉంటుందని స్పష్టం చేశార’ని కృష్ణ చెప్పాడు. టీనేజ్‌లో యాదృచ్ఛికంగా బ్యాడ్మింటన్‌ ఆడి ఆ క్రీడపట్ల ఆసక్తి పెంచుకున్న కృష్ణ.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. తనను గేలి చేసిన వారే విస్తుపోయేలా బ్యాడ్మింటన్‌లో ఎదిగాడు. జైపూర్‌ కాలేజీలో చేరినప్పుడు కోచ్‌ పారా బ్యాడ్మింటన్‌ గురించి చెప్పి ప్రోత్సహించడంతో నాగర్‌ కెరీర్‌ స్పీడందుకుంది. ఇప్పుడు పారాలింపిక్స్‌లో స్వర్ణంతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. సంకల్ప బలం ఉంటే.. సాధించలేనిది ఏదీ లేదనే దానికి నిలువెత్తు కటౌట్‌గా నిలిచాడు. 


టోక్యో: పారా విశ్వకీడల్లో చివరిరోజు నాలుగు పతకాలకు గురిపెట్టిన భారత షట్లర్లు రెండిటిని అందుకున్నారు. పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌-6 ఫైనల్లో 22 ఏళ్ల రెండోసీడ్‌ కృష్ణ నాగర్‌ 21-17, 16-21, 21-17తో  చు మన్‌ కీ (హాంకాంగ్‌)పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు..ఈ క్రీడల్లో నాగర్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకపోవడం విశేషం. కృష్ణ పతకంతో ఈ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌ ఖాతాలో రెండో పసిడి పతకం చేరింది. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-3లో వరల్డ్‌ చాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఇక నోయిడా జిల్లా మెజిస్ట్రేట్‌, ఐఏఎస్‌ అధికారి సుహాస్‌ యతిరాజ్‌ రజతంతో క్రీడలను సగర్వంగా ముగించాడు. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-4 హోరాహోరీ తుది పోరులో 38 ఏళ్ల సుహాస్‌ 21-15, 17-21, 15-21తో ప్రపంచ చాంపియన్‌ లుకాస్‌ మజూర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓటమితో రెండో స్థానంలో నిలిచాడు. ఎస్‌ఎల్‌-3 ఎస్‌యూ-5 మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్లేఆ్‌ఫలో ప్రమోద్‌ భగత్‌/పాలక్‌ కోహ్లీ ద్వయం 21-23, 19-21తో జపాన్‌ జంట ఫ్యుజీహారా/సుగీనో చేతిలో ఓటమితో త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. పురుషుల ఎస్‌ఎల్‌-4 సింగిల్స్‌ ప్లేఆ్‌ఫలోనూ రెండోసీడ్‌ తరుణ్‌ థిల్లాన్‌ 17-21, 11-21  ఫ్రెడీ సెటియవాన్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయి కొద్దిలో కాంస్య పతకం మిస్సయ్యాడు. 


లేఖార విఫలం..:

మిక్స్‌డ్‌ 50 మీ. రైఫిల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో టీనేజ్‌ షూటర్‌ అవని లేఖార ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది. 612 పాయింట్లతో ఆమె క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 28వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో పోటీపడిన మరో భారత షూటర్‌ సిద్ధార్థబాబు 617.2 పాయింట్లతో క్వాలిఫికేషన్‌లో 9వ స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన చావో డాంగ్‌ (617.4) కంటే కేవలం .2పాయింట్ల తేడాతో ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాన్ని సిద్దార్థ కోల్పోయాడు. దీపక్‌ (602.2) 46వ స్థానం దక్కించుకున్నాడు. ఇక షూటింగ్‌లో 5 పతకాలు నెగ్గిన భారత్‌ ఈ క్రీడలను చిరస్మరణీయం చేసుకుంది. ఇందులో 2 స్వర్ణాలు, ఓ రజతం, 2 కాంస్యాలు ఉన్నాయి.


పారిస్‌లో కలుద్దాం..


ముగిసిన టోక్యో క్రీడలు

ఎనిమిదేళ్ల కిందట ఒలింపిక్స్‌, పారా ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు పొందిన టోక్యో..ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకుల మధ్య ఒలింపిక్స్‌ను దిగ్విజయంగా నిర్వహించింది. ఇక 13 రోజులపాటు జరిగిన పారాలింపిక్స్‌కు ఆదివారం ఘనమైన ముగింపు ఇచ్చింది. దాదాపు రెండు వారాలు హోరాహోరీగా తలపడిన అథ్లెట్లు ‘బైబై టోక్యో.. పారి్‌సలో తిరిగి కలుద్దాం’ అంటూ బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు తీసుకున్నారు. నేషనల్‌ స్టేడియంలో కన్నులపండువగా జరిగిన ముగింపు ఉత్సవానికి జపాన్‌ యువరాజు అకిషినో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘పారాలింపిక్స్‌తో ప్రపంచం స్ఫూర్తి పొందింది. భిన్నమైన వైకల్యాలు కలిగిన వారు ఇక్కడ రాణిస్తారు’ అన్న సందేశంతో ముగింపు కార్యక్రమాలను రూపొందించారు. పలువురు నటులతోపాటు దివ్యాంగ బాలబాలికలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగింపోత్సవంలో ఏస్‌ షూటర్‌ అవని లేఖార భారత్‌ పతాకధారిగా వ్యవహరించింది. అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్‌, టోక్యో క్రీడల నిర్వాహక కమిటీ చీఫ్‌ సీకో హషిమోటో ప్రసంగించారు. పారాలింపిక్‌ గీతాన్ని వీనుల విందుగా వినిపిస్తుండగా పతకాన్ని అవనతం చేసి తదుపరి 2024 క్రీడలకు ఆతిథ్యమిచ్చే పారిస్‌ నిర్వాహకులకు అప్పగించారు. రికార్డుస్థాయిలో 4045 మంది అథ్లెట్లు బరిలో దిగిన ఈ పారాలింపిక్స్‌లో 207 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. బ్రిటన్‌ (124), అమెరికా (104)  తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. 




వెల్‌డన్‌.. కలెక్టర్‌

పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన గౌతమ్‌ బుద్ధ నగర్‌ (నొయిడా) కలెక్టర్‌ సుహాస్‌ యతిరాజ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనడమే కాకుండా మెగా ఈవెంట్‌లో పతకం నెగ్గిన ఏకైక ఐఏఎస్‌ అధికారిగా 38 ఏళ్ల సుహాస్‌.. చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. అఖిల భారత సర్వీసుల అధికారుల నుంచి యతిరాజ్‌కు శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. దేశం అతడిని చూసి గర్విస్తోందని ఐఏఎ్‌సల సంఘం ట్వీట్‌ చేసింది. ‘ఛీర్‌ ఫర్‌ సుహాస్‌’ హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. కర్ణాటకకు చెందిన యతిరాజ్‌ యూపీ కేడర్‌ అధికారిగా పని చేస్తున్నాడు. కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడంలో అతను విలువైన సేవలందించాడు. పగలు వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే.. రాత్రిళ్లు ప్రాక్టీస్‌ చేసేవాడు. ఐపీఎ్‌సల సంఘం కూడా సుహా్‌సకు అభినందనలు తెలిపింది. ‘యతిరాజ్‌ హృదయాలను గెలిచాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తుది వరకు పోరాడి ఓడాడు. కాంస్య పోరులో తరుణ్‌ పరాజయం పాలయ్యాడ’ని హోం మినిస్ట్రీ ఇంటర్‌ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ కార్యదర్శి సంజీవ్‌ గుప్తా ట్వీట్‌ చేశారు. సుహాస్‌ సహ ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు కూడా అతడి ప్రతిభను కొనియాడారు. 


సంతోషంగా ఉంది..

జీవితంలో ఎప్పుడూ ఇంత సంతోషంగా, ఇంత నిరాశగా లేను. రజతం గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. అదే సమయంలో త్రుటిలో స్వర్ణం చేజారినందుకు నిరాశగానూ ఉంది. 

-సుహాస్‌ యతిరాజ్‌

మధురం..‘టోక్యో ప్రయాణం’

1968 నుంచి పారాలింపిక్స్‌లో తలపడుతున్న భారత్‌  టోక్యో క్రీడల్లో 19 పతకాలతో చరిత్ర సృష్టించింది. ఐదు స్వర్ణ, ఎనిమిది రజత, ఆరు కాంస్యాలతో పతక పట్టికలో అత్యుత్తమంగా 24వ స్థానంలో నిలిచింది. 54 మంది అథ్లెట్లతో బరిలో దిగిన మన జట్టులో 17 మంది పతకాలు గెలుచుకోవడం ఈసారి క్రీడల్లో విశేషం. రియో గేమ్స్‌లో సాధించిన 12 పతకాలే భారత్‌కు ఇప్పటివరకు అత్యధికం. 

లేఖార, సింగ్‌రాజ్‌ రెండేసి..

పోటీపడ్డ తొలి పారాలింపిక్స్‌లోనే అవని లేఖార, సింగ్‌రాజ్‌ అదాని రెండేసి పతకాలతో సూపర్‌ అనిపించారు. 19 ఏళ్ల లేఖార పారాలింపిక్స్‌లో స్వర్ణం (10 మీ. ఎయిర్‌ రైఫిల్‌) అందుకున్న తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. అనంతరం 50 మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో కాంస్యంతో రెండో పతకం తన ఖాతాలో వేసుకొని దిగ్గజ షూటర్‌గా కితాబు అందుకుంది. అదానా..10 మీ. ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్యం, 50 మీ. పిస్టల్‌లో రజతంతో 39 ఏళ్ల లేటు వయస్సులో భళా అనిపించాడు. దాంతో ఒకే ఒలింపిక్స్‌లో ఇద్దరు భారత క్రీడాకారులు రెండు పతకాలు సాధించడం కూడా రికార్డే. హర్విందర్‌ సింగ్‌ కాంస్యంతో పారాలింపిక్స్‌ ఆర్చరీలో భారత్‌కు పతక బోణీ చేశాడు. భవినాబెన్‌ పటేల్‌ (రజతం) పారాలింపిక్స్‌ టీటీలో భారత్‌కు మొదటి పతకం అందించి ఆనందోత్సాహాలు నింపింది. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ను తొలిసారి ప్రవేశపెట్టగా ప్రమోద్‌ భగత్‌, కృష్ణ నాగర్‌ రెండు స్వర్ణాలతో ఈ క్రీడలో తిరుగులేని ముద్ర వేశారు. 19 ఏళ్ల వరల్డ్‌ చాంపియన్‌ మనీశ్‌ నర్వాల్‌ ఒలింపిక్‌ విజేతగానూ నిలిచి భారత షూటింగ్‌ యవనికపై దూసుకొచ్చిన మరో స్టార్‌గా ప్రశంసలు అందుకున్నాడు. ఇక దేవేంద్ర జఝారియా (జావెలిన్‌ త్రో), మరియప్పన్‌ తంగవేలు (హైజంప్‌) ఈసారి రజత పతకాలతో తమ దిగ్గజ హోదాను సుస్థిరం చేసుకున్నారు.


సగం పతకాలు ట్రాక్‌,ఫీల్డ్‌లోనే..

భారత్‌ ఈసారి నెగ్గిన మొత్తం పతకాల్లో దాదాపు సగం (ఎనిమిది) ట్రాక్‌, ఫీల్డ్‌లో రావడం గమనార్హం. జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌ తన వరల్డ్‌ రికార్డును ఏకంగా ఐదుసార్లు బద్దలుగొట్టి స్వర్ణ పతకంతో సంచలనం రేపాడు. మరో నీరజ్‌ చోప్రాగా పొగడ్తలు అందుకున్నాడు. 18 ఏళ్ల ప్రవీణ్‌ కుమార్‌ తొలి ఒలింపిక్స్‌లోనే హైజం్‌పలో ఆసియా రికార్డుతో రజతం కైవసం చేసుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్‌లో తలపడిన భారత జట్టులో పతకం నెగ్గిన పిన్నవయస్సు అథ్లెట్‌గా ప్రవీణ్‌ రికార్డు నెలకొల్పాడు. జఝారియా తర్వాతి స్థానంలో నిలిచి కాంస్యం చేజిక్కించుకున్న జావెలిన్‌ త్రోయర్‌ సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ భవిష్యత్‌ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. గతనెల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అత్యధికంగా ఏడు పతకాలు సాధిస్తే..దివ్యాంగ అథ్లెట్లు వారికి మించి సత్తా చాటి ‘టోక్యో ప్రయాణా’న్ని మధురాతి మధురం చేసుకున్నారు. ఈక్రమంలో..పట్టుదల, గుండె ధైర్యం ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని నిరూపించారు. అంతేకాదు కొవిడ్‌-19పై ఎలా పోరాడాలో యావత్‌ ప్రపంచానికీ తెలియజెప్పారు. మొత్తంగా.. ‘ఒలింపిక్స్‌ద్వారా హీరోలు తయారైతే..పారాలింపిక్స్‌నుంచి హీరోలే వచ్చారు’ అనేలా మన దివ్యాంగ అథ్లెట్లు సత్తా చాటారు. 

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Updated Date - 2021-09-06T08:19:11+05:30 IST