భారత్‌, పాకిస్థాన్‌ శాంతి బాట!

ABN , First Publish Date - 2021-02-26T09:13:49+05:30 IST

ఉప్పూ నిప్పుగా ఉన్న భారత్‌-పాకిస్థాన్‌ దేశాలు శాంతి బాట పట్టాయి! ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించుతూ అనూహ్యంగా కీలక ముందడుగు వేశాయి.

భారత్‌, పాకిస్థాన్‌ శాంతి బాట!

సయోధ్య దిశగా భారత్‌-పాక్‌ అనూహ్యంగా చర్చలు

ఎల్‌వోసీ వద్ద కాల్పుల విరమణ

ఇతర పాత ఒప్పందాలూ అంతే పక్కాగా అమలు

ఇరుదేశాల డీజీఎంవోల భేటీ

సంయుక్త ప్రకటన విడుదల

అజిత్‌ దోభాల్‌ చొరవతోనే పాక్‌ ఎన్‌ఎస్‌ఏతో తెరవెనుక చర్చ

స్వాగతించిన జమ్మూ కశ్మీర్‌ పార్టీలు, హురియత్‌ సంస్థ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఉప్పూ నిప్పుగా ఉన్న భారత్‌-పాకిస్థాన్‌ దేశాలు శాంతి బాట పట్టాయి! ఇరు దేశాల మధ్య సంబంధాల్లో  నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించుతూ అనూహ్యంగా కీలక ముందడుగు వేశాయి. పరస్పరం సంబంధాలను మెరుగుపరుచుకునేందుకుగాను చర్చలకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ మధ్య చర్చల ప్రక్రియ మొదలైంది. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) గుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించడం సహా ఇతర అంశాల్లో పాత ఒప్పందాలన్నీ కఠినంగా అమలు చేయాలని పరస్పరం నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం ఇరు దేశాల డైరెక్టర్‌ జనరల్స్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవోలు) మధ్య హాట్‌లైన్‌ అనుసంధానంగా జరిగిన సమావేశంలో నిర్ణయించారు. పూర్తి స్నేహపూర్వక, సహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చల్లో  ఇరు దేశాల మధ్య మునుపటి అన్ని ఒప్పందాలను సమీక్షించారు. అనంతరం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు.


‘హింసాత్మక చర్యలకు దారితీసి.. శాంతికి విఘాతం కలిగిస్తూ వస్తున్న ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను, ఆందోళనలను  పరస్పర ప్రయోజనార్థం, సుస్థిర శాంతి కోసం పరిష్కరించుకోవాలని డీజీఎంవోలు నిర్ణయించడం జరిగింది. నియంత్రణ రేఖ గుండా కాల్పుల విరమణ సహా ఇరు దేశాల మధ్య జరిగిన అన్ని అంగీకారాలు, ఒప్పందాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాం. ఇది ఫిబ్రవరి 24-25 నుంచే అమల్లోకి వస్తుంది’ అని సంయుక్త ప్రకటనలో  స్పష్టం చేశారు. 2003లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా కొన్నేళ్లుగా పలుమార్లు ఉల్లంఘనలు జరిగాయి. గత మూడేళ్లలో పాకిస్థాన్‌ 10,752 మార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఇటీవల లోక్‌సభలో హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు. పాక్‌ కాల్పుల కారణంగా 70 మంది భద్రతా సిబ్బంది, మరో 70 మంది పౌరులు మృతిచెందినట్లు ఆయన పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో కాల్పుల వి రమణ ఒప్పందాన్ని  బుధవారం రాత్రి నుంచే కఠినంగా అమలుచేయాలని డీజీఎంవోలు నిర్ణయించారు. కాగా సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా జరిగిన ఈ చర్చల్లో ప్రధానంగా ఇరు దేశాల మధ్య అపోహలు నెలకొనకుండా ఇలాంటి సమావేశాలు సమయానుకూలంగా జరిగేందుకు వీలుగా హాట్‌లైన్‌ అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని.. కాల్పుల విరమణ ఉల్లంఘన, కాల్పులు, చొరబాట్లు తదితర సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే విషయాలపై చర్చల్లో ప్రధానంగా డీజీఎంవోలు దృష్టిపెట్టారు. కాగా నియంత్రణ రేఖ గుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కఠినంగా అమలు చేసేందుకు భారత్‌-పాకిస్థాన్‌ నిర్ణయించడాన్ని జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ (జేకేఎన్‌సీ), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ), వేర్పాటు వాద సంస్థ హురియత్‌ కాన్ఫరెన్స్‌ స్వాగతించాయి. ఇరు దేశాలు సంయుక్తంగా వెలువరించిన ఈ ప్రకటన ఆచరణలో పక్కాగా అమలు కాగలదన్న విశ్వాసాన్ని జేకేఎన్‌సీ వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ నిర్ణయంతో సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయని, వారు కూడా అందరిలాగా సాధారణ జీవనానికి అలవాటు పడగలరన్న విశ్వాసాన్ని పీడీపీ వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రజలకు కాల్పుల విరమణ నిర్ణయం గొప్ప ఊరట అని హురియత్‌ నేత మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  


అజిత్‌ దోభాల్‌ మంత్రాంగంతోనే 

ఇరుదేశాల డీజీఎంవోలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం వెనుక భారత భద్రత సలహాదారు అజిత్‌ దోభాల్‌ అన్నీ తానై వ్యవహించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు కొన్ని నెలల ముందే ఆయన, పాక్‌ జాతీయ భద్రత సలహాదారు ముయీద్‌ డబ్ల్యూ యూసు్‌ఫతో రహస్యంగా చర్చలు జరిపారు. ఈ మేరకు ఓ మూడో దేశం వేదికగా దోభాల్‌-యూసుఫ్‌ మధ్య ప్రత్యక్ష సమావేశం కూడా జరిగిందని సమాచారం. ఈ తెర వెనుక చర్యల వివరాలను హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు దోభాల్‌ ఎప్పటికప్పుడు చేరవేసినట్లు చెబుతున్నారు.

Updated Date - 2021-02-26T09:13:49+05:30 IST