4వ స్థానానికి చేరిన భారత్‌

ABN , First Publish Date - 2020-06-12T07:34:53+05:30 IST

కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచదేశాల్లో నాలుగో స్థానానికి చేరింది. ఒకేరోజు రికార్డు స్థాయి కేసులు, మరణాలను నమోదు చేసుకుని.. బ్రిటన్‌ (2.90 లక్షలు), స్పెయిన్‌(2.89లక్షలు)ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో 9,996 కేసులు నమోదయ్యాయి...

4వ స్థానానికి చేరిన భారత్‌

  • రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు
  • దేశంలో 9996 కేసులు.. 357 మంది మృతి
  • బ్రిటన్‌, స్పెయిన్‌ను దాటిన భారత్‌
  • 2.95 లక్షలకు చేరిన పాజిటివ్‌లు 
  • కోలుకున్న వారు 1.41 లక్షల మంది.. లక్షకు చేరువలో మహారాష్ట్ర

న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచదేశాల్లో నాలుగో స్థానానికి చేరింది. ఒకేరోజు రికార్డు స్థాయి కేసులు, మరణాలను నమోదు చేసుకుని.. బ్రిటన్‌ (2.90 లక్షలు), స్పెయిన్‌(2.89లక్షలు)ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో 9,996 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,95,772కు చేరుకుంది. వైరస్‌ బారిన పడిన వారిలో 357 మంది మరణించగా.. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 8,102కు చేరింది. వరసగా రెండో రోజు కూడా యాక్టివ్‌ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. మొత్తం 1.41 లక్షల మంది కోలుకున్నారు. రికవరీల్లో రాజస్థాన్‌ 74 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. 69 శాతంతో మధ్యప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా 49.21శాతం రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇక మహారాష్ట్రలో వైరస్‌ ఉధృతి తగ్గడం లేదు.


రాష్ట్రంలో ఒక్క రోజులోనే 152 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 97,648కి చేరింది. దేశం మొత్తంలో 8,102 మంది చనిపోగా ఒక్క మహారాష్ట్రలోనే 3,590 మంది మరణించారు. తమిళనాడులో గురువారం 1,875  కేసు లు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 38,716కు చేరుకుంది. అటు కర్ణాటకలోనూ 204 కొత్త కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతిచెందారు.  


  1. ఢిల్లీలోని రైల్‌భవన్‌లో మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.  
  2. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో 28 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి వైరస్‌ సోకింది. 
  3. చెన్నైలోని శిశు సంరక్షణ కేంద్రంలో 35 మందికి కరోనా సోకడంపై సుప్రీం నివేదిక కోరింది.


5 లక్షలు దాటేసిన రష్యా

మాస్కో: ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్‌ దెబ్బకు రష్యా విలవిల్లాడుతోంది. తాజాగా దేశంలో పాజిటివ్‌ల సంఖ్య 5 లక్షల మార్కుని దాటేసినట్టు అధికారులు వెల్లడించారు. 24 గంటల్లో 8,799 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో దేశంలో మొత్తం కేసులు 5,02,436కి చేరుకున్నాయి. వారిలో ఇప్పటి వరకు 6,532 మంది మృతిచెందారు. రోజూ ఇక్కడ 9 వేల కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వం మాస్కోతో సహా అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తూ వస్తోంది. 


మృతదేహాల నిర్వహణపై ‘సుప్రీం’ సీరియస్‌
ఆస్పత్రుల్లో కరోనాతో మరణించిన వారి మృతదేహాల నిర్వహణ, రోగులతో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉంటోందని మీడియాలో వచ్చిన కథనానికి సుప్రీంకోర్టు స్పందించింది. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం పరిశీలించిన సీజేఐ ఎస్‌ఏ బోబ్డే.. కేసును సుమోటోగా తీసుకుని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌కి అప్పగించారు. ఈ కేసు శుక్రవారం విచారణకు రానుందపి అపెక్స్‌ కోర్టు అధికారి తెలిపారు.

Updated Date - 2020-06-12T07:34:53+05:30 IST