పాక్ నుంచి మిడతల నివారణకు డ్రోన్లు, స్ప్రేయర్లు

ABN , First Publish Date - 2020-05-22T12:09:19+05:30 IST

పాకిస్థాన్ దేశం నుంచి భారత సరిహద్దుల్లోని పొలాల్లోకి మిడతల దండు రాకుండా అడ్డుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది....

పాక్ నుంచి మిడతల నివారణకు డ్రోన్లు, స్ప్రేయర్లు

న్యూఢిల్లీ : పాకిస్థాన్ దేశం నుంచి భారత సరిహద్దుల్లోని పొలాల్లోకి మిడతల దండు రాకుండా అడ్డుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మిడతల నివారణకు యూకే నుంచి ప్రత్యేక డ్రోన్లు, ఉపగ్రహ ఉత్పన్న సాధనాలు, ప్రత్యేక ఫైర్ టెండర్లు, స్ప్రేయర్లను దిగుమతి చేసుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. పాక్ నుంచి వచ్చే మిడతల దండు వల్ల భారత సరిహద్దుల్లోని పంటలకు ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి చేసిన హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్రం దీనికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. పాక్ నుంచి వచ్చే మిడతలు రోజుకు 150 కిలోమీటర్ల వరకు ఎగురుతాయని, అవి ఒక చదరపు కిలోమీటరు సమూహం ఒకే రోజులో 35వేలమంది ఆహారాన్ని తినగలవని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. తూర్పు ఆఫ్రికాలో తుపాన్ల వల్ల మిడతల సంతానోత్పత్తి పెరిగిందని, దీనివల్ల భారతదేశం, చైనా, పాకిస్థాన్ దేశాల్లో పంటలకు ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.దీంతో పాకిస్థాన్ ఇప్పటికే వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మిడతల దాడుల వల్ల రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 3 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లనుంది. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్, జైసల్మేర్ జిల్లాల్లో కీటకాల ఉద్ధృతిని వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు గుర్తించారు. మిడతల నివారణపై దృష్టి సారించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పురుగుమందుల కంపెనీల ప్రతినిధులతోనూ సంప్రదింపులు జరిపారు. లాక్ డౌన్ అమలులో ఉన్నా మిడతల నియంత్రణ కార్యాలయాలతో కలిసి 50 స్ప్రేయింగ్ పరికరాలు, వాహనాలతో మిడతలను నివారించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. 

Updated Date - 2020-05-22T12:09:19+05:30 IST