ఇక ‘అంతర్జాతీయ’ వినోదం

ABN , First Publish Date - 2020-11-27T09:31:10+05:30 IST

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. టీమిండియా ఆటగాళ్లను బ్లూ జెర్సీల్లో చూసి దాదాపు తొమ్మిది నెలలు కావొస్తోంది. మధ్యలో

ఇక ‘అంతర్జాతీయ’ వినోదం

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. టీమిండియా ఆటగాళ్లను బ్లూ జెర్సీల్లో చూసి దాదాపు తొమ్మిది నెలలు కావొస్తోంది. మధ్యలో ఐపీఎల్‌లో వారి విన్యాసాలు చూసినా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో చెలరేగితే ఆ మజానే వేరు. ఇప్పుడా సమయం రానే వచ్చింది. ఇక విరాట్‌ కోహ్లీ, ఆరోన్‌ ఫించ్‌ ఆర్‌సీబీ సహచరులు ఎంతమాత్రం కాదు. సై అంటే సై అంటూ తమ జాతీయ జట్ల తరఫున అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు.. ఈసారి స్టేడియంలో ప్రేక్షకులను కూడా చూడబోతుండడం ‘సరికొత్త’ అనుభూతినివ్వనుంది.


నేటి నుంచి ఆసీస్ తో భారత్ వన్డే సిరీస్


సిడ్నీ: సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో పూర్తి స్థాయి సిరీస్‌లో భాగంగా   శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీ్‌సకు తెర లేవనుంది. సిడ్నీ క్రికెట్‌ మైదానం (ఎస్‌సీజీ)లో తొలి మ్యాచ్‌ జరగనుంది. దీంతో సూపర్‌ స్టార్లతో కూడిన భారత్‌-ఆస్ట్రేలియా మధ్య పోరు అభిమానులను అలరించడం ఖాయమే. అయితే స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో లేకపోవడం భారత్‌ అవకాశాలపై ప్రభావం చూపవచ్చు. ఎస్‌సీజీలో ఇరు జట్ల మధ్య 17 మ్యాచ్‌లు జరిగితే ఆసీస్‌ 14-2తో ఆధిక్యంలో ఉంది. అలాగే కెప్టెన్‌ కోహ్లీ ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడగా అత్యధిక స్కోరు 21 మాత్రమే.


కూర్పు ఎలా..: రోహిత్‌ స్థానంలో ధవన్‌తో కలిసి ఓపెనర్‌గా ఎవరు ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ ఓపెనర్‌గా వచ్చి భారీగా పరుగులు సాధించాడు. ఈ స్థానంలో అతడిని పరీక్షిస్తారా.. లేక మిడిలార్డర్‌ను అతడితో బలోపేతం చేయాలనుకుంటే మయాంక్‌ ప్రత్యామ్నాయం కాగలడు. కోహ్లీ, శ్రేయా్‌సల ఫామ్‌ అత్యంత కీలకం. ఇక 2019, జూలై నుంచి హార్దిక్‌ పాండ్యా వన్డే ఫార్మాట్‌లో ఆడలేదు. ప్రస్తుతం బౌలింగ్‌కు కూడా దూరమైన తను బ్యాటింగ్‌లో ఏమేరకు మెరుపులు మెరిపిస్తాడో చూడాల్సిందే. బౌలింగ్‌లో బుమ్రా, షమిలతో పాటు మూడో సీమర్‌గా సైనీ.. శార్దూల్‌ ఠాకూర్‌ల మధ్య పోటీ ఉంది.  ఏకైక లెగ్‌ స్పిన్నర్‌గా కుల్దీప్‌ కన్నా చాహల్‌ వైపే మొగ్గవచ్చు.


జోష్‌లో ఆసీస్‌: భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. టాపార్డర్‌లో వార్నర్‌, ఫించ్‌, స్మిత్‌ బౌలర్లపై ఎదురుదాడికి సిద్ధంగా ఉంటారు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీ్‌సకు స్మిత్‌ కాంకషన్‌ కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు భారత్‌పై సత్తా చూపాలనుకుంటున్నాడు. అటు మిడిలార్డర్‌లో లబుషేన్‌, స్టొయినిస్‌, క్యారీ, మ్యాక్స్‌వెల్‌ కీలకం కానున్నారు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే కమిన్స్‌, స్టార్క్‌, హాజెల్‌వుడ్‌, జంపాలతో కోహ్లీ సేనకు తిప్పలు తప్పేట్టు లేదు.


జట్లు (అంచనా)

భారత్‌: ధవన్‌, మయాంక్‌, కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయాస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, శార్దూల్‌/సైనీ, చాహల్‌, షమి, బుమ్రా.

ఆస్ట్రేలియా: వార్నర్‌, ఫించ్‌ (కెప్టెన్‌), స్మిత్‌, లబుషేన్‌, స్టొయినిస్‌, క్యారీ, మ్యాక్స్‌వెల్‌, కమిన్స్‌, స్టార్క్‌, జంపా, హాజెల్‌వుడ్‌.


పిచ్‌

ఎస్‌సీజీలో జరిగిన చివరి ఏడు వన్డేలో ఆరింట్లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టే నెగ్గింది. సగటు స్కోరు ఏకంగా 312గా ఉండడం విశేషం.

Updated Date - 2020-11-27T09:31:10+05:30 IST