Advertisement
Advertisement
Abn logo
Advertisement

చివరి బంతి వరకు ఉత్కంఠ.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు

కాన్పూరు: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగి డ్రా అయింది. మ్యాచ్ చూస్తున్న సగటు ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌‌లో విజయం చివరి బంతి వరకు భారత్‌వైపే మొగ్గినప్పటికీ కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (18), అజాజ్ పటేల్ (2) భారత జట్టు విజయాన్ని అడ్డుకున్నారు. 


ఇద్దరూ ఎలాంటి తొట్రుపాటు లేకుండా భారత బౌలర్లను ఎదుర్కొని వికెట్ల ముందు పాతుకుపోయారు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరిద్దరూ పది ఓవర్లపాటు బౌలర్లకు చిక్కుకుండా ఆడి జట్టును ఓటమి నుంచి కాపాడారు. 


అంతకుముందు ఈ ఉదయం ఓవర్‌నైట్ స్కోరు 4/1తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ తొలుత నిలకడగానే ఆడినప్పటికీ ఆ తర్వాత మాత్రం వడివడిగా వికెట్లు కోల్పోయింది. అశ్విన్, రవీంద్ర జడేజా విజృంభణతో విజయం భారత్ వైపు మొగ్గింది. బౌలర్ల జోరు చూసి భారత్‌దే విజయమని అందరూ భావించారు. అయితే, చివర్లో రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి భారత విజయాన్ని అడ్డుకున్నారు. 


కివీస్ బ్యాటర్లలో టామ్ లాథమ్ 52, విలియమ్ సోమర్‌విల్లే 36, కెప్టెన్ విలియమ్సన్ 24, రచిన్ రవీంద్ర 18 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3, అక్షర్ పటేల్ 1, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో డిసెంబరు 3న ప్రారంభమవుతుంది.

Advertisement
Advertisement