శతకంతో ఆదుకున్న విహారి

ABN , First Publish Date - 2020-02-15T09:30:54+05:30 IST

బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో టీమిండియా ఇబ్బందుల్లో పడినా.. హనుమ విహారి (182 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 101 రిటైర్డ్‌ అవుట్‌), చటేశ్వర్‌ పుజార...

శతకంతో ఆదుకున్న విహారి

రాణించిన పుజార

భారత్‌ 263 ఆలౌట్‌

కివీస్‌ లెవెన్‌తో వామప్‌ మ్యాచ్‌

హామిల్టన్‌: బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో టీమిండియా ఇబ్బందుల్లో పడినా.. హనుమ విహారి (182 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 101 రిటైర్డ్‌ అవుట్‌), చటేశ్వర్‌ పుజార (93) ఆదుకోవడంతో  న్యూజిలాండ్‌ లెవన్‌తో వామప్‌ మ్యాచ్‌లో భారత్‌ తడబడి నిలబడింది. టీమిండియా ఓపెనింగ్‌  స్థానం కోసం పోటీపడుతున్న ముగ్గురు కుర్రాళ్లు... మయాంక్‌ అగర్వాల్‌ (1), పృథ్వీ షా (0), శుభ్‌మన్‌ గిల్‌ (0) అధికంగా బౌన్స్‌ అయ్యే బంతులను ఎదుర్కోలేక పెవిలియన్‌ చేరడం ఆందోళనకు గురి చేసే అంశం. విరాట్‌ కోహ్లీ నెట్‌ సెషన్‌కే పరిమితం కావడంతో గురువారం మొదలైన వామప్‌ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. కుగెలిన్‌ (3/40) టాపార్డర్‌ పనిపట్టగా.. స్పిన్నర్‌ ఇష్‌ సోధీ (3/72) మిడిల్‌ ఓవర్లలో వికెట్లు పడగొట్టాడు. పిచ్‌ను అర్ధం చేసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడిన భారత బ్యాట్స్‌మన్‌ ఏడుగురు సింగిల్స్‌ డిజిట్‌కే పెవిలియన్‌ చేరగా.. వారిలో నలుగురు డకౌట్‌  కావడం గమనార్హం..! పుజార-హనుమ ఐదో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యం జత చేయకపోతే టీమిండియా పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. 


ఆరంభంలోనే టప..టపా..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే కుగెలిన్‌.. బౌన్సీ బంతితో ఓపెనర్‌ పృథ్వీ షాను అవుట్‌ చేసి షాకిచ్చాడు. ఫామ్‌లో లేని అగర్వాల్‌.. కుగెలిన్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచిచ్చాడు. భారత్‌-ఎ తరఫున డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన గిల్‌.. తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. కుగెలిన్‌ డెలివరీని డిఫెన్స్‌ ఆడేందుకు ప్రయత్నించిన గిల్‌.. గల్లీలో సీఫెర్ట్‌ చక్కని క్యాచ్‌ అందుకోవడంతో వెనుదిరిగాడు. దీంతో 5/3తో భారత్‌ వణికిపోయింది. రహానె (18) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయాడు. ఈ దశలో వన్‌డౌన్‌లో వచ్చిన పుజారకు తోడైన విహారి పరిస్థితిని చక్కదిద్దాడు. బంతి కొంత పాతబడడంతో రెండు, మూడు సెషన్లలో ఆట కొంత సులువైంది. స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో పుజార, విహారి బ్యాట్‌లను ఝళిపించారు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ రవీంద్ర బౌలింగ్‌ విహారి మూడు సిక్సర్లు బాదాడు. అయితే, ఆఖరి సెషన్‌లో గిబ్సన్‌ (2/26) బౌలింగ్‌లో హుక్‌ చేసే క్రమంలో పుజార అవుటయ్యాడు. సెంచరీ చేసిన విహారి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగడంతో.. టీమిండియా పతనం వేగంగా జరిగిపోయింది. రిషభ్‌ పంత్‌ (7).. షాట్‌ సెలెక్షన్‌లో మరోసారి తన బలహీనతను ప్రదర్శించాడు. సాహా (0), అశ్విన్‌ (0) డకౌట్‌లు కాగా.. జడేజా (8) ఆశించిన మేరకు రాణించలేక పోయాడు. 


ఆ ఇద్దరి ప్రతిభకు ఆకాశమే హద్దు

పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌లకు అపార ప్రతిభ ఉందని జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వారిద్దరి నైపుణ్యానికి ఆకాశమే హద్దని కొనియాడాడు. రెగ్యులర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గాయంతో టెస్టు సిరీ్‌సకు దూరం కావడంతో మయాంక్‌తో ఓపెనింగ్‌ చేసేందుకు షా, గిల్‌ పోటీపడుతున్నారు. ‘ఈ ఇద్దరిలోనూ నైపుణ్యానికి కొదవ లేదు. తుది జట్టులో చోటెవరికి దక్కుతుందనే  విషయం వదిలేస్తే వారు ప్రస్తుతం జట్టుతోపాటే ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి. గిల్‌, షా ఒకే వాతావరణం నుంచి వచ్చారు. కొత్త బంతిని ఎదుర్కోవడానికి ఇష్టపడతారు’ అని రవిశాస్త్రి తెలిపాడు.


స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) రవీంద్ర (బి) కుగెలిన్‌ 0, మయాంక్‌ అగర్వాల్‌ (సి) క్లీవర్‌ (బి) కుగెలిన్‌ 1, పుజార (సి) క్లీవర్‌ (బి) గిబ్సన్‌ 93, శుభ్‌మన్‌ గిల్‌ (సి) సీఫెర్ట్‌ (బి) కుగెలిన్‌ 0, రహానె (సి) టామ్‌ బ్రూస్‌ (బి) నీషమ్‌ 18, హనుమ విహారి (రిటైర్డ్‌ హర్ట్‌) 101, రిషభ్‌ పంత్‌ (సి) కుగెలిన్‌ (బి) సోధీ 7, సాహా (సి) క్లీవర్‌ (బి) గిబ్సన్‌ 0, అశ్విన్‌ (ఎల్బీ) సోధీ 0, ఉమేష్‌ యాదవ్‌ (నాటౌట్‌) 9, జడేజా (సి) ఫిన్‌ అలెన్‌ (బి) సోధీ 8; ఎక్స్‌ట్రాలు: 26; మొత్తం 78.5 ఓవర్లలో 263 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-5, 3-5, 4-38, 5-233, 6-245, 7-246, 8-246, 9-250; బౌలింగ్‌: స్కాట్‌ కుగెలిన్‌ 14-2-40-3, బ్లెయిర్‌ టిక్నర్‌ 15-3-37-0, డేరిల్‌ మిచెల్‌ 7-1-15-0, నీషమ్‌ 13-3-29-1, జేక్‌ గిబ్సన్‌ 10-1-26-2, ఇష్‌ సోధీ 14.5-0-72-3, రచిన్‌ రవీంద్ర 5-1-30-0. 

Updated Date - 2020-02-15T09:30:54+05:30 IST