బ్యాట్స్‌మెన్‌దే భారం!

ABN , First Publish Date - 2022-01-13T09:02:06+05:30 IST

బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌.. చెలరేగిపోతున్న పేసర్లు.. అయినా సఫారీలు దీటుగా పోరాడడంతో .. సిరీస్‌ నిర్ణాయక మూడో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది

బ్యాట్స్‌మెన్‌దే భారం!

బుమ్రా పాంచ్‌ పటాకా!

దక్షిణాఫ్రికా 210 ఆలౌట్‌   

కోహ్లీసేనకు స్వల్ప ఆధిక్యం

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 57/2


బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌.. చెలరేగిపోతున్న పేసర్లు.. అయినా సఫారీలు దీటుగా పోరాడడంతో .. సిరీస్‌ నిర్ణాయక మూడో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. బుమ్రా ‘పాంచ్‌’తో పంజా విసిరినా.. టీమిండియా 13 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. పీటర్సన్‌ అర్ధ శతకంతో జట్టుకు అండగా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో స్పల్ప స్కోరుకే ఓపెనర్లను కోల్పోయిన భారత్‌ను పోటీలో నిలిపే భారం.. కోహ్లీ, పుజార భుజస్కందాలపైనే..!


కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో ఆఖరి, మూడో టెస్ట్‌లో బుమ్రా (5/42) ఐదు వికెట్లతో చెలరేగినా.. టీమిండియా 13 పరుగుల స్వల్ప ఆధిక్యానికే పరిమితమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 17/1తో రెండు రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా 210 పరుగులకు ఆలౌటైంది. పీటర్సన్‌ (72) అర్ధ శతకంతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. షమి, ఉమేష్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్‌.. బుధవారం ఆటముగిసే సమయానికి 2 వికెట్లకు 57 పరుగులు చేసింది. పుజార (9), కోహ్లీ (14) క్రీజులో ఉన్నారు. మొత్తంగా టీమిండియా 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. 


ఓపెనర్లు విఫలం :

మూడో సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తడబడుతూ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు రాహుల్‌ (10), మయాంక్‌ (7) మళ్లీ విఫలమయ్యారు. మయాంక్‌ను రబాడ అవుట్‌ చేయగా.. రాహుల్‌ను జెన్సెన్‌ వెనక్కి పంపాడు. కానీ, పుజార, కోహ్లీ మూడో వికెట్‌కు అజేయంగా 33 పరుగులు జోడించి ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 


మెరుగ్గానే సఫారీలు :

తొలి సెషన్‌ తొలి బంతికే ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (8)ను బుమ్రా బౌల్డ్‌ చేయడంతో.. ఇక టీమిండియాకు తిరుగులేదనిపించింది. కానీ, క్యాచ్‌లను అందుకోలేకపోవడంతోపాటు పీటర్సన్‌ ముందుండి నడిపించడంతో లంచ్‌ సమయానికి దక్షిణాఫ్రికా మెరుగ్గానే కనిపించింది. నైట్‌ వాచ్‌మన్‌ కేశవ్‌-పీటర్సన్‌ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కేశవ్‌.. తొలి 45 నిమిషాలు ఎంతో అనుభజ్ఞుడిలా ఆడుతూ ఆకట్టుకున్నాడు. అయితే, కేశవ్‌ను ఉమేష్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుస్సెన్‌తో కలసి పీటర్సన్‌ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. శార్దూల్‌ బౌలింగ్‌లో పీటర్సన్‌ ఇచ్చిన క్యాచ్‌లను ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న కోహ్లీ అందుకోలేక పోయాడు. పీటర్సన్‌ అవకాశం దొరికినప్పుడల్లా షాట్లు ఆడగా.. మరోవైపు డుస్సెన్‌ కూడా రాణించడంతో లంచ్‌ సమయానికి దక్షిణాఫ్రికా 100/3తో నిలిచింది. 


సత్తాచాటిన షమి:

లంచ్‌ బ్రేక్‌ తర్వాత షమి.. ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు. క్రీజులో పాతుకొనే ప్రయత్నం చేస్తున్న డుస్సెన్‌ను ఉమేష్‌ క్యాచ్‌ అవుట్‌ చేయడంతో.. నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ, పీటర్సన్‌, బవుమా (28) కలసి స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో పీటర్సన్‌ అర్ధ శతకం పూర్తి చేశాడు. కానీ, 56వ ఓవర్‌లో షమి.. బవుమా, వెర్రెన్‌ (0)ను అవుట్‌ చేసి గట్టిదెబ్బకొట్టాడు. బవుమా బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో.. స్లిప్స్‌లో కోహ్లీ మంచి క్యాచ్‌ అందుకొన్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. భారీ షాట్‌ ఆడే క్రమంలో వెర్రెన్‌ డకౌటయ్యాడు. జెన్సెన్‌ను బుమ్రా బౌల్డ్‌ చేయడంతో.. సౌతాఫ్రికా 176/7తో టీకి వెళ్లింది. ఇక, ఆఖరి సెషన్‌ ఆరంభంలోనే కీలకమైన పీటర్సను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. అయితే, రబాడ (15), ఒలివియెర్‌ (10 నాటౌట్‌),  ఎన్‌గిడి (3) బౌలర్లను విసిగిస్తూ టీమ్‌ స్కోరును 200 పరుగుల మార్క్‌ దాటించారు. రబాడను శార్దూల్‌ వెనక్కిపంపగా.. ఎన్‌గిడిని బుమ్రా తన ఐదో వికెట్‌గా అవుట్‌ చేశాడు. 


100

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లు అందుకొన్న కోహ్లీ.. టెస్టుల్లో 100 క్యాచ్‌ల మైలురాయిని చేరుకొన్న ఆరో భారత ఫీల్డర్‌గా నిలిచాడు. ద్రవిడ్‌ (209), లక్ష్మణ్‌ (135), సచిన్‌ (115), గవాస్కర్‌ (108), అజరుద్దీన్‌ (105)..విరాట్‌ కంటే ముందున్నారు. 


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 223 ఆలౌట్‌

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి) పుజార (బి) బుమ్రా 3, మార్‌క్రమ్‌ (బి) బుమ్రా 8, కేశవ్‌ (బి) ఉమేష్‌ 25, పీటర్సన్‌ (సి) పుజార (బి) బుమ్రా 72, డుస్సెన్‌ (సి) కోహ్లీ (బి) ఉమేష్‌ 21, బవుమా (సి) కోహ్లీ (బి) షమి 28, వెర్రెన్‌ (సి) పంత్‌ (బి) షమి 0, జెన్సన్‌ (బి) బుమ్రా 7, రబాడ (సి) బుమ్రా (బి) శార్దూల్‌ 15, ఒలివియెర్‌ (నాటౌట్‌) 10, ఎన్‌గిడి (సి) అశ్విన్‌ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 76.3 ఓవర్లలో 210 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-10, 2-17, 3-45, 4-112, 5-159, 6-159, 7-176, 8-179, 9-200; బౌలింగ్‌: బుమ్రా 23.3-8-42-5, ఉమేష్‌ యాదవ్‌ 16-3-64-2, మహ్మద్‌ షమి 16-4-39-2, శార్దూల్‌ ఠాకూర్‌ 12-2-37-1, అశ్విన్‌ 9-3-15-0.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌:

రాహుల్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) జాన్సెన్‌ 10, మయాంక్‌ అగర్వాల్‌ (సి) ఎల్గర్‌ (బి) రబాడ 7, పుజార (బ్యాటింగ్‌) 9, విరాట్‌ కోహ్లీ (బ్యాటింగ్‌) 14; ఎక్స్‌ట్రాలు: 17;  మొత్తం: 17 ఓవర్లలో 57/2; వికెట్ల పతనం: 1-20, 2-24; బౌలింగ్‌: రబాడ 6-1-25-1, ఒలివియెర్‌ 2-0-13-0, జాన్సెన్‌ 5-3-7-1, ఎన్‌గిడి 3-3-0-0, కేశవ్‌ 1-1-0-0.  

Updated Date - 2022-01-13T09:02:06+05:30 IST