భారతదేశం నైసర్గిక స్వరూపం

ABN , First Publish Date - 2022-10-06T19:35:03+05:30 IST

సీఎస్‌ఓ అంచనాల ప్రకారం దేశంలోని నైసర్గిక స్వరూపాన్ని కింది శాతాలతో తెలుసుకోవచ్చు. అవి...

భారతదేశం నైసర్గిక స్వరూపం

సీఎస్‌ఓ అంచనాల ప్రకారం దేశంలోని నైసర్గిక స్వరూపాన్ని కింది శాతాలతో తెలుసుకోవచ్చు. అవి... 

1) పర్వతాలు- 10.7% 

2) కొండలు- 18.6% 

3) పీఠభూములు- 27.7% 

4) మైదానాలు- 43% 


ఇవి సగటున సముద్ర మట్టానికి 2135 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.

భారతదేశాన్ని నైసర్గిక స్వరూపం రీత్యా స్థూలంగా నాలుగు భాగాలు విభజించవచ్చు. అవి- 1) ఉత్తర ఉన్నత ప్రాంతాలు 2) ఉత్తర మైదానాలు 3) ద్వీపకల్ప పీఠభూమి 4) తీర మైదానాలు.


ఉత్తర ఉన్నత ప్రాంతాలు (హిమాలయాలు)

  • భూ విజ్ఞాన శాస్త్రానికి చెందిన పలకల విరూపకారక సిద్ధాంతం ప్రకారం.. హిమాలయాలు, గంగా-సింధు మైదానం ఆక్రమించి ఉన్న ప్రస్తుత భూభాగంలో మధ్య మహాయుగ కాలంలో ‘టెథిస్‌’ సముద్రం ఉండేది.
  • ఈ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూ భాగాన్ని ‘అంగారా’ లేదా లారెన్షియా భూమి అని, దక్షిణంగా ఉన్న భూ భాగాన్ని(నేటి ద్వీపకల్ప భాగం) ‘గోం డ్వానా’ అని పిలిచేవారు. కొన్ని మిలియన్‌ సంవత్సరాల తరవాత సంపీడన  బలాల వల్ల ‘టెథిస్‌’ సముద్రంలో నిక్షేపితమైన అవక్షేపాలు ముడుతలు పడి ప్రస్తుతం ఉన్న హిమాలయ పర్వత శ్రేణులు 
  • ఏర్పడ్డాయి.
  • ప్రపంచంలోని ముడుత పర్వతాల్లో హిమాలయాలు అన్నింటికంటే చివరిగా ఏర్పడ్డాయి. కాబట్టి వీటిని ‘అతి తరుణ(నవీన) ముడుత పర్వతాలు’ అంటారు. ఇవి అవక్షేప శిలలు ముడుతలు పడటం వల్ల ’టెర్షియరీ మహాయుగం’లో(ఆరు కోట్ల సంవత్సరాల క్రితం/ 60 మిలియన్‌ సంవత్సరాల క్రితం) ఏర్పడ్డాయి. ఇవి అవిచ్ఛిన్న సమాంతర శ్రేణులుగా వ్యాపించి ఉన్నాయి.
  • హిమాలయాలు జమ్మూ-కశ్మీర్‌ నుంచి అరుణాచల్‌  ప్రదేశ్‌ వరకు భారతదేశ ఉత్తర సరిహద్దులుగా ఉన్నాయి. - సుమారు 2400 కి.మీ. పొడవున సింధునది, సాంగ్‌పో-బ్రహ్మపుత్ర నదుల గార్జిల మధ్య   ‘వాయువ్య - ఆగ్నేయ’ దిశగా వ్యాపించాయి.
  • వీటి విస్తీర్ణం సుమారు అయిదు లక్షల చ.కి.మీ., కశ్మీర్‌లో 400 కి.మీ., అరుణాచల్‌ప్రదేశ్‌లో 150 కి.మీ. వెడల్పుతో విస్తరించి ఉన్నాయి.
  • పూర్వ మహాయుగంలో ఇక్కడ ఉన్న సముద్రం పేరు టెథిస్‌
  • ప్రస్తుతం ఈ మహాసముద్రం ఉన్న ప్రాంతంలో గల భూస్వరూపాలను హిమాలయాలు అంటారు. 
  • వీటిలో బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు నిక్షేపాలు, ఆంటిమోని, బిస్మత్‌ లాంటి ఖనిజ నిల్వలు అధికంగా ఉంటాయి.
  • ఇవి చాపం వలె అర్ధచంద్రాకారం, కొడవలి ఆకారంలో విస్తరించి ఉన్నాయి.
  • ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పర్వతశ్రేణి.

నోట్‌: ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వతశ్రేణి- ఆండీస్‌ పర్వతశ్రేణి(దక్షిణ అమెరికా ఖండం)


హిమాద్రి/ అత్యున్నత హిమాలయాలు

  • వీటికి హిమాద్రి, అత్యున్నత, లోపలి హిమాలయాలనే పేర్లున్నాయి. ఇవి శ్రేణులన్నింటిలో అత్యున్నత, అతి ఉత్కృష్ట, అవిచ్ఛిన్నమైనవి.
  • ఇవి గ్రానైట్‌, షిస్ట్‌, నీస్‌ వంటి స్ఫటికాకార రూపాంతర శిలలతో ఏర్పడ్డాయి. ఇక్కడ ప్రపంచంలో అతి ఎత్తయిన శిఖరాలున్నాయి.
  • 365 రోజులూ మంచుతో కప్పబడి, అవిచ్ఛిన్నంగా పెట్టని గోడ వలె, అత్యంత దుర్భేధ్యంగా విస్తరించి ఉన్నాయి.
  • ఇవి ఉత్తరం వైపు మెట్ల వాలును, దక్షిణం వైపున నిట్రవాలును కలిగి ఉన్నాయి.
  • శృంగాకార, కొనిఫెరస్‌ అడవులను కలిగి ఉన్నాయి.
  • హిమాద్రి శ్రేణి ఒలిగోసిన్‌ యుగంలో(35 నుంచి 21 మిలియన్‌ సంవత్సరాల క్రితం) ఏర్పడింది.
  • వీటి సగటు ఎత్తు 6,100 మీ. సగటు వెడల్పు 25 కి.మీ.
  • హిమాలయాలు అరుణాచల్‌ప్రదేశ్‌ వద్ద వంపు తిరిగి పాట్కాయ్‌ బమ్‌ శ్రేణిగా పిలుస్తున్నారు.
  • మయన్మార్‌లో అరకాన్‌ యోమా పర్వతాలు అని పిలుస్తారు.
  • ఈ హిమాద్రి శ్రేణి ఎత్తయిన శిఖరాలకు ప్రసిద్ధి.

1. ఎవరెస్ట్‌- 8848 మీ.(నేపాల్‌)

2. కాంచనగంగ- 8598 మీ.(సిక్కిం)

3. లోథ్‌సే- 8516 మీ.(నేపాల్‌)

4. మకాలు- 8463 మీ.(నేపాల్‌)

5. ధవళగిరి- 8167 మీ.(నేపాల్‌)

6. అన్నపూర్ణ- 8078 మీ.

7. నందాదేవి(ఉత్తరాఖండ్‌)- 7817 మీ.

8. నంగప్రభాత్‌(జమ్మూకాశ్మీర్‌)- 8126 మీ.

9. నామ్చాబర్వా(అరుణాచల్‌ప్రదేశ్‌)- 7754 మీ.


ఎవరెస్ట్‌ శిఖరం 8848.86 మీ.

దీని పూర్వనామం: పీక్‌-XV

దీనిని కనుగొన్న వ్యక్తి: జార్జ్‌ ఎవరెస్ట్‌

నేపాల్‌లో దీని పేరు: సాగరమాత

టిబెట్‌లో దీని పేరు: జోంగ్‌ మా/ చెమోలుంగ్మా

చైనాలో దీని పేరు- ఖెమోలుంగ్మా

నోట్‌: బ్రిటిష్‌ వారు మన దేశాన్నంతటినీ సర్వే చేసి పటాలు తయారుచేయడానికి ‘భారత సర్వేక్షణ శాఖ’ను 1767లో డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేశారు.


  • భారతదేశపు మొట్టమొదటి పటాలను సర్వే ఆధారంగా తయారుచేసిన వ్యక్తి: జేమ్స్‌ రన్నేల్‌(మొదటి సర్వేయర్‌ జనరల్‌ ఇండియా)
  • 1802లో భారతదేశంలో ‘ద గ్రేట్‌ ఇండియన్‌ సర్వే’ చెన్నైలో ‘విలియం లాంబ్టన్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
  • ఇది భారతదేశం మొత్తం సర్వే చేయడానికి ప్రారంభించారు.
  • 1802 నుంచి 1830 వరకు విలియం లాంబ్టన్‌ సర్వేయర్‌ జనరల్‌గా పనిచేశారు.
  • 1830 నుంచి 1843 వరకు సర్వేయర్‌ జనరల్‌గా జార్జ్‌ ఎవరెస్ట్‌ పనిచేశారు. ఈ సమయంలోనే హిమాలయాలను అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ఆప్ఘనిస్థాన్‌ వరకు సర్వే చేశారు. ఈ సర్వేలోనే హిమాలయాల్లోని ఒక్కొక్క శిఖరం ఎత్తును కొలుస్తూ అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ఆప్ఘనిస్థాన్‌ వరకు వాటికి పీక్‌-1, పీక్‌-2, పీక్‌-3 అనే పేరు ఇస్తూ వచ్చారు. ఇలానే ఎవరెస్ట్‌కి ‘పీక్‌-XV' అనే పేరు పెట్టారు.
  • 1843 నుంచి 1856 వరకు ‘ఆండ్రూ స్కౌట్‌’ సర్వేయర్‌ జనరల్‌గా పనిచేశారు. 
  • 1853లో సర్వే పూర్తయింది.
  • 1956లో ఆండ్రూ స్కౌట్‌ ఈ సర్వే రిపోర్టును విడుదల చేశారు.
  • ఈ సర్వేలోనే ప్రపంచంలో ఎత్తయిన శిఖరంగా పీక్‌-గీగ’ గుర్తించారు.
  • అప్పటి దీని ఎత్తు: 29002 అడుగులు (8839 మీ.)
  • 1865లో జార్జ్‌ ఎవరెస్ట్‌ జ్ఞాపకార్థం పీక్‌-XV కు ‘ఎవరెస్ట్‌’ అని నామకరణం చేశారు.

నోట్‌: 1856 కంటే ముందు, పీక్‌-XV కంటే ముందు ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంగా ‘కాంచనగంగ’ను పరిగణించేవారు. 


  • 1955లో భారతదేశం ఎవరెస్ట్‌ ఎత్తును మరలా సర్వే చేసి దీని ఎత్తును 29028 అడుగులు(8848మీ.)గా పేర్కొంది. ప్రపంచం మొత్తం దీనిని ఎవరెస్ట్‌ ఎత్తుగా ఇప్పటివరకు గుర్తించింది.
  • 2015లో నేపాల్‌లో వచ్చిన తీవ్రమైన భూకంపం కారణంగా ఈ ఎత్తులో ఏమైనా మార్పు వచ్చిందేమో చూద్దామని చైనా, నేపాల్‌ ఏడాదికి పైగా సర్వే చేసి శిఖరం ఎత్తు 8848.86 మీ.(29,032 అడుగులు)కు చేరుకుందని సంయుక్తంగా ప్రకటించాయి. 


నోట్‌ 

భూ ఉపరితలంపై ఎత్తయిన శిఖరం: ఎవరెస్ట్‌


హిమాలయాల ప్రాముఖ్యం

1. నైరుతి రుతుపవనాలు భారతదేశాన్ని దాటి వెళ్లకుండా అడ్డుకుని అధిక వర్షాన్ని ఇచ్చేలా చేస్తున్నాయి.

2. శీతాకాలంలో మధ్యఆసియా నుంచి వీచే అతి శీతల గాలులు దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయి.

3. భారతదేశ ఉత్తర సరిహద్దుగా ఉండి శత్రువుల నుంచి రక్షణనిస్తున్నాయి.

4. అనే జీవనదులకు పుట్టినిల్లుగా ఉండి ఉత్తర భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.

5. ఇవి పర్యాటకానికి ప్రసిద్ధి పొంది జమ్మూ-కాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం రాష్ట్రాల ఆర్థికవ్యవస్థకు మూలాధారంగా ఉన్నాయి.

6. దేశంలో అత్యధిక జలవిద్యుత్‌ శక్తిని కలిగి భారతదేశ విద్యుత్‌ అవసరాలను తీరుస్తున్నాయి.

7. కలపను అధికంగా అందిస్తూ దేశ కలప అవసరాలను తీరుస్తున్నాయి.

హిమాలయాలను నాలుగు రకాలుగా విభజించవచ్చు అవి: 

1) హిమాద్రి 2) హిమాచల్‌ 

3) శివాలిక్‌ 4) ట్రాన్స్‌ హిమాలయాలు

హిమాలయాల విస్తరణ: రాష్ట్రాలపరంగా జమ్మూకాశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు, నదులపరంగా సింధు నుంచి బ్రహ్మపుత్ర నది వరకు, శిఖరాల పరంగా నంగపర్బత్‌ నుంచి నామ్చాబర్వా వరకు విస్తరించి ఉన్నాయి.


-వి.వెంకట్‌రెడ్డి

సీనియర్ ఫ్యాకల్టీ



Updated Date - 2022-10-06T19:35:03+05:30 IST