CWG Vs Asian Games: భారత్‌కు ఎందులో.. ఎన్ని పతకాలు!

ABN , First Publish Date - 2022-07-27T01:08:34+05:30 IST

మరో రెండు రోజుల్లో కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. క్రీడల్లో ఇటీవల భారత్ మునుపెన్నడూ లేనంతగా

CWG Vs Asian Games: భారత్‌కు ఎందులో.. ఎన్ని పతకాలు!

న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. క్రీడల్లో ఇటీవల భారత్ మునుపెన్నడూ లేనంతగా పురోగతి సాధిస్తోంది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ మధ్య కొంత వ్యత్యాసం ఉంది. కొన్ని అంశాలలో ఇవి పరిమిత ఫీల్డ్ ఈవెంట్‌లు. కాబట్టి ఈ రెండు ఈవెంట్లలో ఒకే క్రీడలో భారత పతకాలు గణనీయంగా మారే అవకాశం ఉంది. కొన్నిఈవెంట్లలో కొన్ని దేశాలు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కామన్వెల్త్‌లో కొన్ని అంశాల్లో భారత్‌కు చెప్పుకోదగ్గ పతకాలు రాగా, ఏషియాడ్‌లో కొన్ని ఈవెంట్లలో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో  ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ల ప్రదర్శన గురించి తెలుసుకుందాం.


అథ్లెటిక్స్: ఆసియా గేమ్స్‌లో పతకాలు.. సీడబ్ల్యూజీలో నిరాశ 

ఏషియన్ సర్క్యూట్‌లో చైనా, జపాన్ అథ్లెట్లతో భారత క్రీడాకారులు పోటీపడి బాగా రాణించారు. ఏషియన్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు ఇప్పటి వరకు 254 పతకాలు సాధించారు. గత ఎడిషన్ అయిన 2018 జకార్తా గేమ్స్‌లో 38 శాతం మంది పతకాలు అందుకున్నారు. అయితే, కామన్వెల్త్‌కు వచ్చేసరికి ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ అథ్లెట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 28 మెడల్స్ మాత్రమే సాధించింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పతకం సాధిస్తాడని భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నప్పటికీ.. గాయం కారణంగా సీడబ్ల్యూజీ నుంచి తప్పుకోవడం అభిమానులను నిరాశ పరిచింది.  


బాకింగ్స్: రెండింట్లోనూ అంతంత మాత్రమే 

బాక్సింగ్ విషయంలో కామన్వెల్త్, ఆసియా క్రీడలు రెండింటిలోనూ భారత్‌కు పెద్దగా కలిసి రావడం లేదు. సీడబ్ల్యూజీలో 37 పతకాలతో పదో స్థానంలో నిలవగా, 57 పతకాలతో ఆసియా గేమ్స్‌లో 8వ స్థానంలో ఉంది. ఆసియా గేమ్స్‌లో భారత్ సాధించిన విజయాలలో ఎక్కువ శాతం 1980, 1990లలో వచ్చినవే. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు 8 బంగారు పతకాలు సాధించారు. 60 స్వర్ణ పతకాలతో ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. ఆసియా గేమ్స్‌లో భారత్ 9 పతకాలు సాధించింది. 2018 ఎడిషన్‌లో ఇండియన్ బాక్సర్లు రెండు పతకాలు మాత్రమే సాధించారు. అమిత్ పంగల్ గోల్డ్ సాధించగా, వికాస్ కృషన్ యాదవ్ కాంస్య పతకం అందుకున్నాడు. 


అదే ఏడాది జరిగిన సీడబ్ల్యూజీ గేమ్స్‌లో మన బాక్సర్లు 9 పతకాలతో దేశంలో అడుగుపెట్టారు. అందులో మూడు పసిడి, మూడు కాంస్య పతకాలున్నాయి. అలాగే రెండు పతకాలను మహిళా బాక్సర్లు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు ఇంగ్లండ్, కెనడా, స్కాట్లాండ్, నార్తరన్ ఐర్లాండ్ క్రీడాకారులతో పోటీపడాల్సి వస్తుండగా, ఆసియా గేమ్స్‌లో దక్షిణ కొరియా, థాయిలాండ్, ఉజ్బెకిస్థాన్, కజక్‌స్థాన్ బాక్సర్లతో పోటీపడుతున్నారు. 


జిమ్నాస్టిక్స్‌: తప్పని నిరాశ

అటు ఆసియా క్రీడలు, ఇటు కామన్వెల్త్ రెండింటిలోనూ జిమ్నాస్టిక్స్‌లో భారత్ ప్రదర్శన పేలవంగానే ఉంది. ఇప్పుడిప్పుడే అందులో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. న్యూఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆశిష్ కుమార్ ఒక రజతం, కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఆ తర్వాత గ్లాస్గోలో 2014 ఎడిషన్‌లో దీపా కర్మాకర్ కాంస్యం సాధించింది. అప్పటి నుంచి కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో భారత జిమ్నాస్ట్‌లు ఒక్క పతకం కూడా గెలవలేదు. కర్మాకర్ 2014లో ఆసియా క్రీడల్లో వాల్ట్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. 2018 గేమ్స్‌లో పాల్గొనలేదు. 


ఇప్పుడు బర్మింగ్‌హామ్‌లో జరగనున్న సీడబ్ల్యూజీలో జిమ్నాస్టిక్స్‌లో ఇంగ్లండ్, కెనడా ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంది. భారత్ తరపున రెండుసార్లు ఆసియా చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత 27 ఏళ్ల ప్రణతి నాయక్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె 2014 సీడబ్ల్యూజీలో 20వ స్థానంలో, వ్యక్తిగత విభాగంలో 2018 ఎడిషన్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 


హాకీ: పతకం కోసం ఎదురుచూపులు  

ఆసియా గేమ్స్‌లో భారత పరుషుల జట్టుకు నిరాశే ఎదురవుతోంది. నిజానికి ఇతర దేశాలతో పోలిస్తే భారత హాకీకి బలమైన చరిత్రే ఉంది. మంచి అనుభవం ఉన్నప్పటికీ దానిని మైదానంలో చూపించడంలో భారత ఆటగాళ్లు  తరచూ విఫలమవుతున్నారు. కీలక సమయాల్లో చిన్నచిన్న పొరపాట్లు జట్టు కొంప ముంచుతున్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లోనూ భారత్ బంగారు పతకం కోసం తపిస్తోంది. ఇక్కడ ఆస్ట్రేలియా ప్రధాన ప్రత్యర్థిగా మారుతోంది. ప్రతీ ఎడిషన్‌లోనే ఆస్ట్రేలియా నుంచే భారత్‌కు చేదు అనుభవం ఎదురవుతోంది. ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ కారణంగా సీడబ్ల్యూజీలో ఎప్పుడూ తీవ్ర పోటీ ఉంటోంది. దీనికి తోడు పాకిస్థాన్, మలేషియా, కెనడా, దక్షిణాఫ్రికాలకు కూడా షాకిచ్చే సామర్థ్యం ఉంది. 


ఈ విషయంలో భారత మహిళా జట్టు కొంత మెరుగైన ప్రదర్శనే కనిపిస్తోందని చెప్పొచ్చు. 2002 సీడబ్ల్యూజీలో స్వర్ణ పతకాన్ని త్రుటిలో కోల్పోయింది. గత ఎడిషన్‌లో 20 సంవత్సరాల తర్వాత భారత మహిళలు తొలిసారి ఆసియా క్రీడల ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే, జపాన్ చేతిలో కొద్దిలో ఓడిపోయారు. 


వెయిట్‌లిఫ్టింగ్: సీడబ్ల్యూజీకి ఏషియాడ్‌కు మధ్య చాలా దూరం 

వెయిట్‌లిఫ్టింగ్ పతకాల విషయంలో సిడబ్ల్యూజీ, ఏషియాడ్‌ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కామన్వెల్త్‌ ఆల్‌టైం పతకాల జాబితాలో ఆస్ట్రేలియా 159 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ 43 స్వర్ణాలతో 125 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఆసియా క్రీడల్లో ఐదు రజతాలు, 9 కాంస్యాలతో 14 పతకాలు మాత్రమే సాధించింది. చివరిసారి 1998లో ఆసియా క్రీడల్లో మహిళల 63 కేజీల విభాగంలో కరణం మల్లీశ్వరి రజతం సాధించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తం తొమ్మిది పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో ఐదు స్వర్ణ పతకాలున్నాయి.


సీడబ్ల్యూజీకి, ఏషియాడ్‌కు మధ్య పతకాల విషయంలో అంత తేడా ఎందుకంటే.. చైనా, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్, ఉత్తర కొరియా, కజకిస్థాన్, చైనీస్ తైపీ వంటి పవర్‌హౌస్‌లు ప్రపంచ ఛాంపియన్‌లను కలిగి ఉన్నాయి. దీంతో ఆసియా క్రీడలలో అవి ఆధిపత్యం చలాయిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత మీరాబాయి చాను మినహా వచ్చే ఏడాది ఆసియా క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు ఆధిపత్యం చలాయిస్తారని భావిస్తున్నారు. 


టేబుల్ టెన్నిస్: అంతంత మాత్రంగానే..

 టేబుల్ టెన్నిస్‌లో చైనా క్రీడాకారులు అత్యంత ప్రబలమైన శక్తిగా ఉన్నారు. 2002లో కామన్వెల్త్‌లో ఈ క్రీడను ప్రవేశపెట్టినప్పటి నుంచి టేబుల్ టెన్నిస్‌లో భారత్ 20 పతకాలను గెలుచుకుంది. అయితే  ఆసియా క్రీడలలో మాత్రం రెండు కాంస్యాలు మాత్రమే లభించాయి. ఆసియా గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్ పతకాల పట్టికలో భారత్ 11వ స్థానంలో ఉండగా, కామన్వెల్త్‌లో సింగపూర్ (50), ఇంగ్లండ్ (20) తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.


గోల్డ్ కోస్ట్ 2018 కామన్వెల్త్‌లో ఎనిమిది పతకాలతో భారతదేశం  అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. మణికా బాత్రా మహిళల సింగిల్స్‌లో స్వర్ణం, మహిళల డబుల్స్‌లో మౌమా దాస్‌తో కలిసి రజతం, మిక్స్‌డ్ డబుల్స్‌లో జి సత్యన్‌తో కలిసి కాంస్యం సాధించి షోలో స్టార్‌గా నిలిచింది. టీం ఈవెంట్‌లో పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణం సాధించాయి. 


రెజ్లింగ్: కామన్వెల్త్‌లో లీడర్లుగా 

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 43 స్వర్ణాలు సహా మొత్తం 102 పతకాలను గెలుచుకుని కెనడా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఆసియా క్రీడల విషయానికి వస్తే పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. 11 స్వర్ణాలు సహా మొత్తంగా 59 పతకాలు మాత్రమే భారత్ సొంతమయ్యాయి.   


స్క్వాష్: ఏషియాడ్ కంటే కామన్వెల్త్ బెటర్ 

కామన్వెల్త్ క్రీడలతో పోలిస్తే ఆసియా క్రీడల్లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసిన అతికొద్ది క్రీడల్లో స్క్వాష్ ఒకటి. ఆసియా క్రీడల్లో భారత్ ఒక స్వర్ణం, 3 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 13 పతకాలు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోషల్ ఇప్పటివరకు ఒక రజతం, మూడు కాంస్య పతకాలు సాధించాడు. 2014 ఇంచియాన్ గేమ్స్‌లో పురుషుల జట్టు  ఏకైక స్వర్ణాన్ని గెలుచుకుంది.


కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఒక స్వర్ణం, రెండు రజతాలతో మూడు పతకాలు మాత్రమే గెలుచుకుంది. మహిళల డబుల్స్ జంట దీపికా పల్లికల్, జోష్న చినప్ప 2014లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించించారు. 2018లో రజతంతో సరిపెట్టుకున్నారు. 

Updated Date - 2022-07-27T01:08:34+05:30 IST