మతపరమైన మూక హత్యల ముప్పు భారత్‌కు అధికం : అమెరికా సీనియర్ అధికారి

ABN , First Publish Date - 2022-07-01T22:58:14+05:30 IST

ఉదయ్‌పూర్ టైలర్ హత్య ఉదంతం నేపథ్యంలో అమెరికా సీనియర్ అధికారి ఒకరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మతపరమైన సామూహిక హత్యల ముప్పు భారత్‌కు అధికంగా పొంచివుందని అంతర్జాతీయ

మతపరమైన మూక హత్యల ముప్పు భారత్‌కు అధికం : అమెరికా సీనియర్ అధికారి

న్యూఢిల్లీ : ఉదయ్‌పూర్ టైలర్ హత్య ఉదంతం నేపథ్యంలో అమెరికా(America) సీనియర్ అధికారి ఒకరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మతపరమైన మూక హత్యల(mass killings) ముప్పు భారత్‌(India)కు అధికంగా పొంచివుందని అంతర్జాతీయ మతస్వేచ్ఛకి బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్న అమెరికా అధికారి రషాద్ హుసేన్(Rashad Hussain) హెచ్చరించారు. సామూహిక హత్యల ముప్పు కలిగివున్న దేశాలపై జర్మనీలోని హోలోకౌస్ట్ మ్యూజియం రూపొందించిన ‘ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్(Early Warning Project)’ నివేదికలో భారత్ 2వ స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. 2021 లేదా 2022లో మూకుమ్ముడి హత్యలకు ఇండియాలో 14.4 శాతం అవకాశాలున్నాయి. 15.2 శాతం ముప్పు అవకాశమున్న పాకిస్థాన్(Pakistan) ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉందని రిపోర్ట్ పేర్కొంది. 


భారత్‌లో మైనారిటీ మతస్థుల హక్కులకు ప్రమాదకరంగా పరిణమించిన పలు అంశాలు ఇందుకు కారణమవుతున్నాయని హుసేన్ పేర్కొన్నారు. ఈ అంశాలపై భారత్‌తో అమెరికా ప్రత్యక్షంగా మాట్లాడి, తన ఆందోళనను వెలిబుచ్చిందని ఆయన ప్రస్తావించారు. ‘‘ చర్చిలపై దాడులు, హిజాబ్‌పై నిషేధం, గృహాల ధ్వంసాలు, అమానవీయ వ్యాఖ్యలు చూశాం. ఒక మంత్రి ముస్లింలను చీడపురుగులతో పోల్చారు ’’ అని హుసేన్ అన్నారు. కాగా సెప్టెంబర్ 2018లో బీజేపీ అగ్రనేత, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith shah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశీ వలసదారులను చీడపురుగులతో పోల్చారు. భారత్‌లో ఎలక్టోరల్ జాబితా నుంచి వీరిని తొలగిస్తామని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా 2021లో అంతర్జాతీయ మతస్వేచ్ఛపై జూన్‌లో అమెరికా విడుదల చేసిన రిపోర్ట్ కూడా భారత్‌లో మతపరమైన దాడులు అధికంగా ఉన్నాయని పేర్కొంది. హత్యలు, దాడులు, బెదిరింపుల సహా మైనారిటీలపై దాడులు ఏడాదంతా కొనసాగాయని పేర్కొంది. గోవధపై అప్రమత్తత, ముస్లింలకు చెందిన ప్రార్థనా స్థలాలు, ఆస్తులపై దాడులు, పలు రాష్ట్రాల్లో మతమార్పిడులపై దాడులు జరిగాయని పేర్కొంది.


ఈ ఏడాది యాంటీ క్రిస్టియన్ దాడులు 200 పైగానే..

ఈ ఏడాది మే నాటికి భారత్‌లో 207 క్రిస్టియన్ వ్యతిరేక దాడులు నమోదయ్యాయని యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం అనే ఎన్‌జీవో పేర్కొంది. కాగా 2021లో ఈ సంఖ్య 505గా ఉందని ప్రస్తావించింది. ఇందులో 100 ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే రికార్డయ్యాయని ప్రస్తావించింది. 2022కి సంబంధించిన ఘటనల్లో ఉత్తరప్రదేశ్ ఘటన సంఖ్య 48గా ఉందని ప్రస్తావించింది. 44 దాడులతో చత్తీస్‌గఢ్‌ రెండో స్థానంలో ఉంది.

Updated Date - 2022-07-01T22:58:14+05:30 IST