ప్రజలతో స్నేహమే ఆఫ్ఘన్‌‌లో భారత్ పెట్టుబడి : జైశంకర్

ABN , First Publish Date - 2021-08-27T00:11:12+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ ప్రజలతో స్నేహం వల్ల మాత్రమే ఆ దేశంలో

ప్రజలతో స్నేహమే ఆఫ్ఘన్‌‌లో  భారత్ పెట్టుబడి : జైశంకర్

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్ ప్రజలతో స్నేహమే ఆ దేశంలో భారత్ పెట్టుబడి అని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చెప్పారు. ఈ పెట్టుబడికి సంపూర్ణ ప్రతిఫలం దక్కుతుందని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో జైశంకర్ ఈ వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో 31 పార్టీలకు చెందిన 37 మంది నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల అఖిల పక్ష సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. 


మూడున్నర గంటలపాటు 26 మంది నేతల ప్రసంగాలను విన్న తర్వాత జైశంకర్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం స్థిరత్వం లేదన్నారు. అదేవిధంగా ఆ దేశంలోని కొత్త పాలకుల విషయంలో అంతర్జాతీయ సమాజంలో కూడా స్పష్టత లేదన్నారు. అందుకే భారత దేశం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోందని చెప్పారు. దోహా ప్రక్రియ ప్రతిష్టంభనలో పడిందన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌పై ఏమైనా ఆంక్షల విధింపుపై ఏకాభిప్రాయం లేదన్నారు. యావత్తు దేశంలోనూ శాంతిభద్రతల పరిస్థితులు విషమంగా ఉన్నాయని చెప్పారు. అమెరికా దళాలు ఆఫ్ఘన్ నుంచి వెళ్ళిపోయే వరకు తుది నిర్ణయం ఉండబోదన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిపూర్ణంగా అర్థం చేసుకోకుండా, ఇప్పట్లో విధానపరమైన నిర్ణయం తీసుకోవడం దుడుకుతనం అవుతుందన్నారు. 


ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయులను రప్పించేందుకు ‘ఆపరేషన్ దేవి శక్తి’ని భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 565 మందిని రప్పించింది. భారత వాయు సేన, ఎయిరిండియా విమానాల్లో వీరిని రప్పించింది. మన పొరుగు దేశాల వారికి కూడా సహాయపడేందుకు ముందుకు వచ్చింది. 


Updated Date - 2021-08-27T00:11:12+05:30 IST