బీజేపీ విధానాల వల్లే భారత్‌లో ఆర్థిక సంక్షోభం: కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-08-13T05:01:56+05:30 IST

దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది...

బీజేపీ విధానాల వల్లే భారత్‌లో ఆర్థిక సంక్షోభం: కాంగ్రెస్

న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కేంద్రం విధానాల వల్లే దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందంటూ ఆరోపించింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామంటూ బీజేపీ ప్రభుత్వం చేసిన హామీ కూడా ‘‘బూటకమే’’నంటూ ఆరోపించింది. ఇవాళ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ... ‘‘ఒక ప్రణాళిక అంటూ లేకుండా అమలుచేసిన లాక్‌డౌన్‌తో పాటు బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి..’’ అని పేర్కొంది. దీనికి ‘‘ఆర్థిక సంక్షోభంలో భారత్’’ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనుద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘మోదీ ఉంటే.. ఏదైనా సాధ్యమే..’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కారణంగా దేశ జీడీపీ స్వాతంత్ర్యానంతర చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయిని తాకొచ్చంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను రాహుల్ తన ట్వీట్‌కి జతచేశారు.

Updated Date - 2020-08-13T05:01:56+05:30 IST