బీజింగ్ : గాల్వన్ లోయలో ఘర్షణకు కారణం భారత దేశమేనని చైనా ఆరోపించింది. సరిహద్దులకు సంబంధించిన ఒప్పందాలన్నిటినీ భారత్ తుంగలో తొక్కిందని, తమ భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించిందని మండిపడింది. గత ఏడాది జూన్‌లో గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే.
చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భారత సైన్యాన్ని థియేటర్ కమాండ్స్‌గా పునర్వ్యవస్థీకరించడం, చైనా-భారత్ సరిహద్దుల నిర్వహణపై దాని ప్రభావంపై అడిగిన ప్రశ్నకు ఝావో లిజియాన్ బదులిస్తూ, వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కొనసాగించడంపై చైనా, భారత్ మధ్య కుదిరిన అన్ని ఒప్పందాలు, అగ్రిమెంట్లు సరిహద్దు ప్రాంతాల్లో సుస్థిరతను బలపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషించాయన్నారు.
అన్ని ఒప్పందాలను, అగ్రిమెంట్లను భారత్ ఉల్లంఘించిందని; చైనా భూభాగాన్ని భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని, ఎల్ఏసీని చట్టవిరుద్ధంగా అతిక్రమించిందని, అందుకే గత సంవత్సరం గాల్వన్ లోయ సంఘటన జరిగిందని చెప్పారు. అన్ని అగ్రిమెంట్లకు భారత్ కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గట్టి చర్యలతో ఈ సరిహద్దు ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కొనసాగించాలని అన్నారు.
ఇదిలావుండగా, తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా వైపు భారతీయ దళాలు వెళ్ళినట్లు చైనా చేస్తున్న ఆరోపణలను భారత దేశం పదే పదే ఖండిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతలను కాపాడటం కోసం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది.