న్యూఢిల్లీ : సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత దేశం 40,000 టన్నుల డీజిల్‌ను పంపించింది. దీనిని శనివారం సాయంత్రం నుంచి పంపిణీ చేస్తారు. కొద్ది రోజుల నుంచి డీజిల్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రజలకు ఇది కొంచెం ఊరటనిచ్చే వార్త. ఈ వివరాలను సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ సుమిత్ విజేసింఘే చెప్పారని శ్రీలంక మీడియా తెలిపింది.
భారత్-శ్రీలంక గత నెలలో 1 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దాదాపు 40 వేల టన్నుల బియ్యాన్ని శ్రీలంకకు పంపించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోందని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ బియ్యం శ్రీలంకకు చేరితే, ఆ దేశంలో గత ఏడాది రెట్టింపు అయిన ధరలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం కలుగుతుంది. పట్టాభి ఆగ్రో ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బీవీ కృష్ణారావు మాట్లాడుతూ, తాము మొదట ప్రాంప్ట్ షిప్మెంట్ కోసం కంటెయినర్లను లోడింగ్ చేస్తున్నామన్నారు. వెజల్ లోడింగ్ కొద్ది రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. భారత్-శ్రీలంక ప్రభుత్వాల మధ్య కుదిరిన రుణ ఒప్పందంలో భాగంగా ఈ సంస్థ శ్రీలంక స్టేట్ ట్రేడింగ్ (జనరల్) కార్పొరేషన్‌కు బియ్యాన్ని సరఫరా చేస్తోంది.
కొన్ని దశాబ్దాల తర్వాత ఇటువంటి సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అదనంగా 500 మిలియన్ డాలర్ల విలువైన ఇంధన సహాయాన్ని భారత్ అందజేస్తోంది. దీనిలో భాగంగానే డీజిల్‌ను పంపించింది. ఈ వారంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. పెట్రోలు, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో రోజుకు 13 గంటలపాటు విద్యుత్తు కోతలను అమలు చేయడంతోపాటు పెట్రోలు బంకుల వద్ద సాయుద దళాలను మోహరించవలసి వస్తోంది.
ఇదిలావుండగా, గురువారం రాత్రి హింసాత్మక నిరసనలు జరిగాయి. వందలాది మంది ప్రజలు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంలోకి దూసుకెళ్ళందుకు ప్రయత్నించారు. భద్రతా దళాలు బాష్పవాయు గోళాలను, వాటర్ కెనన్లను ప్రయోగించి, నిరసనకారులను చెల్లాచెదురు చేశారు. ఈ సంఘటనలో 15 మంది గాయపడ్డారు, పోలీసు బస్సులు, వాహనాలను తగులబెట్టారు. కొలంబోలో కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణలకు తీవ్రవాద గ్రూపులే కారణమని రాజపక్స ఆరోపించారు.
రాజపక్స శుక్రవారం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. అనుమానితులను అరెస్టు చేసి, నిర్బంధించేందుకు పోలీసులకు అధికారం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి