తాలిబన్లతో భారత్ తొలిసారి దౌత్య సమావేశం

ABN , First Publish Date - 2021-08-31T23:58:55+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లతో భారత్

తాలిబన్లతో భారత్ తొలిసారి దౌత్య సమావేశం

దోహా : ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లతో భారత్ తొలిసారి దౌత్యపరమైన సంప్రదింపులు జరిపింది. కతార్‌లోని భారత దౌత్యవేత్త దీపక్ మిట్టల్, దోహాలోని తాలిబన్ల రాజకీయ కార్యాలయం చీఫ్ షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ సమావేశమయ్యారని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. తాలిబన్ల విజ్ఞప్తి మేరకు ఈ సమావేశం జరిగినట్లు తెలిపింది. 


ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత, రక్షణ, వారిని తిరిగి రప్పించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. భారత దేశం రావాలని కోరుకునే ఆఫ్ఘన్ జాతీయులు, ముఖ్యంగా మైనారిటీల ప్రయాణానికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిపింది. 


ఆఫ్ఘనిస్థాన్ గడ్డను భారత దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి అడ్డాగా ఉపయోగించుకోరాదని తాలిబన్ నేతకు చెప్పినట్లు తెలిపింది. భారత దేశ ఆందోళనను సకారాత్మకంగా (పాజిటివ్‌గా) పరిష్కరిస్తామని తాలిబన్ నేత హామీ ఇచ్చినట్లు తెలిపింది. 


ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికన్ దళాల ఉపసంహరణ పూర్తయిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-08-31T23:58:55+05:30 IST