అంతా చైనామయం

ABN , First Publish Date - 2020-06-19T08:29:58+05:30 IST

ఇందుగలదందు లేదని సందేహం వలదు.. ఎందెందు వెదకి చూచిన అందందే చైనా ఉనికి కలదు! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8,146 ఉత్పత్తులను మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన నిత్యజీవితాల్లోకి చైనా అంతగా చొచ్చుకొచ్చింది...

అంతా చైనామయం

  • మన దిగుమతులు ఎక్కువ.. ఎగుమతులు తక్కువ
  • డ్రాగన్‌ దేశ వైఖరితో భారతీయుల్లో ఆగ్రహం

ఇందుగలదందు లేదని సందేహం వలదు.. ఎందెందు వెదకి చూచిన అందందే చైనా ఉనికి కలదు! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8,146 ఉత్పత్తులను మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన నిత్యజీవితాల్లోకి చైనా అంతగా చొచ్చుకొచ్చింది. భారత చైనా సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగినప్పుడల్లా యాంటీ-చైనా సెంటిమెంట్‌ దేశంలో రగులుతుంది. ‘చైనా ఉత్పత్తుల్ని నిషేధిద్దాం’ అని చాలా మంది నినదిస్తున్నారు. అది సాధ్యమేనా? భారత్‌-చైనాల వాణిజ్యం విలువ ఎంత? ఏయేవస్తువులు, సేవలు ఎగుమతి/దిగుమతి అవుతున్నాయి? చైనా దిగుమతులను ఎలా తగ్గించుకోవాలి? అనే అంశాలను పరిశీలిస్తే..


మనం వాడే సెల్‌ఫోన్‌.. మేడిన్‌ చైనా! ఫోన్‌ చైనా తయారీది కాకపోయినా.. దాంట్లో వాడిన కాంపోనెంట్లు.. మేడిన్‌ చైనా!!


మన ఫోన్‌లో వేసే యాప్‌ల్లో అత్యధికం.. మేడిన్‌ చైనా! గిఫ్టు షాపుల్లో మనం కొనే దేవతా విగ్రహాలు.. మేడిన్‌ చైనా!! దీపావళి రోజున మనం కాల్చే టపాసుల్లో అత్యధికం.. మేడిన్‌ చైనా! మన దేశం దిగుమతి చేసుకునే టెలికం పరికరాల్లో అత్యధికం.. మేడిన్‌ చైనా!! 


లద్దాఖ్‌లో సోమవారం రాత్రి డ్రాగన్‌ సైన్యం పక్కాప్లాన్‌తో దాడి చేసి భారత జవాన్ల ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘యాంటీ చైనా’ సెంటిమెంట్‌ రగిలింది. ప్రభుత్వం సైతం ఆర్థిక చర్యలు తీసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, అదంత సులువు కాదని గత అనుభవాలు చెబుతున్నాయి.


ప్రపంచంలోని ప్రతి దేశం ఏదో ఒక రకంగా చైనా మీద ఆధారపడి ఉంది. మనదేశంలో చైనా ప్రత్యక్ష పెట్టుబడుల విలువ దాదాపుగా రూ.18వేల కోట్లు అని అంచనా. పరోక్ష పెట్టుబడులను లెక్కిస్తే అది రూ.45 వేల కోట్ల నుంచి 60 వేల కోట్ల దాకా ఉంటుంది. చైనాకు చెందిన అలీబాబా, షామీ, టెన్సెంట్‌, చైనా-యురేసియా ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ ఫండ్‌, దీదీ చుక్సింగ్‌, షున్‌వెయ్‌ క్యాపిటల్‌, ఫోసన్‌ క్యాపిటల్‌ తదితర సంస్థలు మనదేశంలోని స్టార్టప్‌ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మనందరికీ చిరపరిచితమైన పేటీఎం, స్నాప్‌డీల్‌, స్విగ్గీ, ఓలా వంటివాటన్నింటిలో చైనా పెట్టుబడులున్నాయి. పేటీఎం, బిగ్‌బాస్కెట్‌, జొమాటో వంటి 11 స్టార్ట్‌ప్సలో అలీబాబా పెట్టుబడులు పెట్టింది. ఓలాలో.. చైనా-యురేసియా ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ ఫండ్‌, దీదీ చుక్సింగ్‌ పెట్టుబడులు పెట్టాయి. టెన్సెంట్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ సంస్థ కు ఫ్లిప్‌కార్ట్‌, బైజు సహా 16 స్టార్ట్‌ప్సలో పెట్టుబడులున్నాయి. ఇలా చెప్పుకొంటూ పోతే ఆ చిట్టా చాంతాడంత. వాటిపై మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో ఎంతో కొంత చైనాకు వెళ్తుంది. ఇక,  పర్యాటకరంగం ద్వారా.. అంటే చైనా నుంచి మన దేశానికి వచ్చే పర్యాటకుల ద్వారా రూ.4 వేల కోట్లకు పైగానే ఆదాయం వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.  ఎగుమతులు, దిగుమతుల విలువ వేరే. ఏటా మనం రూ.1.15 లక్షల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్ల విలువైన హిందూ దేవతల బొమ్మలు, కొవ్వొత్తులు, బొమ్మలు, చైనాబజార్లలో, ఇతర దుకాణాల్లో దొరికే చిన్నచిన్న గృహోపకరణాలను దిగుమతి చేసుకుంటున్నామని ఇండియా-చైనా ఆర్థిక, సాంస్కృతిక మండలి సెక్రటరీ జనరల్‌ మహ్మద్‌ సకీబ్‌ తెలిపారు. ఇక ఫోన్లు, ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులు సరేసరి. ప్రస్తుతం దేశంలో ఆన్‌లైన్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల్లో అత్యధికం డ్రాగన్‌ దేశానివే.


మనదేశంలో ఏటా అమ్ముడవుతున్న ఫోన్లలో 75ు చైనా కంపెనీలవే. అందులో షామీ వాటా, 31శాతం.. వివో వాటా 21ు. భారత్‌ చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2000 సంవత్సరం నాటికి కేవలం 3 బిలియన్‌ డాలర్లు ఉండగా.. 2018 ముగిసేనాటికి అది 95.54 బిలియన్‌ డాలర్లకు చేరింది. అందులో చైనాకు ఎగుమతి అయ్యే మన ఉత్పత్తుల విలువ కన్నా.. దిగుమతుల విలువే అత్యధికం. 2019లో చైనా మనదేశానికి రూ.5 లక్షల కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అదే సమయంలో మన దేశఽం నుంచి చైనాకు ఎగుమతి అయిన ఉత్పత్తుల విలువ కేవలం రూ.1.25 లక్షల కోట్లు. తేడా.. రూ.4 లక్షల కోట్లు!! గుడ్డిలో మెల్ల ఏంటంటే.. 2016-19 నడుమ చైనాకు భారతదేశ ఎగుమతులు 23 శాతానికి పెరిగాయి. 2016 నాటి ఎగుమతుల విలువతో పోలిస్తే ఇది 4.5ు ఎక్కువ. అలాగని సంబర పడాల్సిన పనిలేదు. 5జీ టెక్నాలజీ విషయంలో చైనా కంపెనీలు ఇప్పటికే ముందువరుసలో ఉన్నాయి. మనదేశంలో 5జీ ట్రయల్స్‌ నిర్వహించడానికి.. చైనాకు చెందిన వావే కంపెనీకి మోదీ సర్కారు ఇప్పటికే అనుమతులు ఇచ్చేసింది. 


ఇప్పటికిప్పుడు ఆపలేం

చైనా ఉత్పత్తులను నిషేధిద్దాం.. అని ఆవేశంగా అనుకోవడానికి వ్యక్తిగత స్థాయిలో బాగానే అనిపించొచ్చుగానీ, రెండు దేశాల స్థాయిలో చూస్తే అదంత సులువైన విషయం కాదు. వ్యక్తిగత స్థాయిలో అంటే.. మనం చైనా ఫోన్‌ కొనాలా వద్దా అనేది మన నిర్ణయం. తక్షణ నిర్ణయం తీసుకుని దానికి ప్రత్యామ్నాయంగా వేరే దేశానికి చెందిన కంపెనీ ఫోన్‌ను కొనగలం. కానీ, ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని చైనా ఉత్పత్తుల దిగుమతులను ఇప్పటికిప్పుడు నిలిపివేయలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల నేపథ్యంలో అలా చేయడం కుదరదు. అయినా, అసలు అలా ఉన్నట్టుండి చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే మనకే నష్టమని.. ‘రిసెర్చ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఫర్‌ డెవలపింగ్‌ కంట్రీ్‌స’కు చెందిన ప్రొఫెసర్‌ ప్రబీర్‌ డే పేర్కొన్నారు. అలా చేస్తే, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నంత వేగంగా మన ఉత్పత్తిదారులు వాటిని తయారుచేయలేరని.. ఆయా ఉత్పత్తుల సరఫరా తగ్గి, ధరలు పెరిగిపోతాయని వివరించారు. వైద్యరంగానికి చెందిన కొన్ని రకాల ఉత్పత్తులనైతే మన భారతీయ సంస్థలు కనీసం మరికొన్నేళ్లపాటు తయారుచేసే పరిస్థితిలో లేవని ప్రబీర్‌ డే తెలిపారు. ఇతర దేశాల్లో తయారయ్యే అలాంటి ఉత్పత్తులనే కొనాలంటే.. ధర తడిసిమోపెడవ్వడం ఖా యం. వీటి మధ్య వ్యత్యి సం 3-4 రెట్లు ఉంటుంది.


మరేం చేయాలి?

చైనా ఉత్పత్తుల నిషేధం కన్నా ముందు దేశీయంగా పరిశోధన, అభివృద్ధి సదుపాయాలను మెరుగుపరచుకోవాలి. దేశ శాస్త్ర, సాంకేతిక విభాగానికి చెందిన ‘నేషనల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2004-15 కాలంలో భారతదేశం ఆర్‌ అండ్‌ డీపై చేసిన ఖర్చు మన స్థూలజాతీయోత్పత్తిలో కేవలం 0.7ు. అదే సమయంలో చైనా పెట్టిన ఖర్చు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 2ు. ఇజ్రాయెల్‌ లాంటి దేశాలతై ఆర్‌ అండ్‌ డీపై 4ు కన్నా ఎక్కువే ఖర్చుచేస్తాయి. ఆర్‌ అండ్‌ డీ ఎంత విస్తృతంగా జరిగితే వనరుల నిర్వహణ, అభివృద్ధిపై పెట్టుబడుల వంటివాటిని అంత సమర్థంగా చేయగలుగుతాం. రెండో అంశం.. కంపెనీలకు చైనా చాలా చౌకగా రుణాలిస్తుది. మనదేశంలో ఆ పరిస్థితి లేదు.


దేశంలో.. 100కు పైగా చైనా సంస్థలు

మనవద్ద ప్రభుత్వ పరంగా, ప్రైవేటు రంగంలో చేపట్టే భారీ ప్రాజెక్టుల్లో 100కు పైగా చైనా సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వాటిలో.. సినోస్టీల్‌, షౌగాంగ్‌ ఇంటర్నేషనల్‌, బావోషాన్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌, సినో హైడ్రో కార్పొరేషన్‌ వంటి చైనా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. 


చైనాలో మన సంస్థలు..

మనదేశంలో చైనా సంస్థల హవా స్థాయిలో కాకున్నా.. చైనాలో భారతీయ కార్పొరేట్‌ దిగ్గజాల ఉనికి ఉంది. ఫార్మా రంగంలో డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా, మాట్రిక్స్‌ ఫార్మా వంటివి.. ఐటీ రంగంలో ఎన్‌ఐఐటీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, యాప్‌టెక్‌, విప్రో, మహీంద్రా సత్యం వంటివి అక్కడ సత్తా చాటుతున్నాయి.


ఔషధ ముడిపదార్థాలకు చైనాయే దిక్కు!

భారత ఫార్మా పరిశ్రమ పరిమాణంలో.. ప్రపంచంలోనే మూడో అతిపెద్దది, విలువ పరంగా 14వ స్థానంలో ఉంది. మనదేశం నుంచి పలు దేశాలకు రూ.లక్షల కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి అవుతాయి. అంతవరకూ నిజమే. కానీ.. ఔషధాల తయారీకి అవసరమైన బల్క్‌డ్రగ్స్‌/యాక్టివ్‌ ఫార్మస్యూటికల్‌ ఇంగ్రిడెంట్స్‌ (ఏపీఐలు) విషయంలో మాత్రం మన ఫార్మా కంపెనీలు చైనాపై ఆధారపడి ఉన్నాయి. మనం దిగుమతి చేసుకునే బల్క్‌డ్రగ్స్‌/ఏపీఐల్లో 67.56 శాతం.. అంటే, మూడింట రెండు వంతులకుపైగా చైనా నుంచే వస్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో పార్లమెంటులో చెప్పిన లెక్క. 


చైనా కంపెనీల దెబ్బకు విరిగిన ‘మిల్క్‌’

మైక్రోమాక్స్‌ (ఎం), ఇంటెక్స్‌ (ఐ), లావా (ఎల్‌), కార్బన్‌ (కె).. ఈ నాలుగు భారతీయ మొబైల్‌ కంపెనీలనూ కలిపి ‘మిల్క్‌’గా మార్కెట్‌ నిపుణులు వ్యవహరిస్తారు. చైనా కంపెనీల దెబ్బకు ఈ నాలుగు కంపెనీలూ అతలాకుతలమైపోయాయి. 2019 గణాంకాల ప్రకారం మనదేశంలో జరిగిన మొబైల్‌ విక్రయాల్లో మైక్రోమాక్స్‌ వాటా కేవలం 1.1 శాతం. ఇంటెక్స్‌ వాటా 0.1 శాతం కాగా.. లావా వాటా 1.2 శాతం, కార్బన్‌ వాటా 0.2 శాతం. అదేసమయంలో చైనా కంపెనీల వాటా 72 శాతం దాకా ఉంది. 2018లో వాటి వాటా 60 శాతమే. ముఖ్యంగా.. బీబీకే గ్రూప్‌ (ఒప్పో, వివో, రియల్‌ మీ, వన్‌ ప్లస్‌ ఫోన్లను తయారుచేసేది ఈ కంపెనీయే) వాటా మన మార్కెట్లో 37 శాతం కాగా.. షామీది (రెడ్‌ మీ, పోకో) 28 శాతం. 


ఇవీ దిగుమతులు..

చైనా నుంచి మనం ప్రధానంగా దిగుమతి చేసుకునేవి.. ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులు, స్మార్ట్‌ఫోన్లు, టెలిఫోన్లు, రూటర్లు, ఇతర ఇంటర్‌నెట్‌ ఆధారిత పరికరాలు, డయోడ్‌లు, ట్రాన్సిస్టర్లు, సెమీకండక్టర్లు, ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌, ఎల్‌ఈడీలు, ఔషధాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలు, ఆటోమొబైల్‌ ఉత్పత్తులు, విగ్రహాలు, కొవ్వొత్తులు, వస్త్రాలు, గృహోపకరణాలు, తదితరాలు.


ఇవీ ఎగుమతులు

చైనాకు మనం చేసే ప్రధాన ఎగుమతులు.. పత్తి, దారం, ఇనుప ఖనిజం, శుద్ధి చేసిన రాగి, ఇతర లోహాలు.


14.37శాతం

మన దిగుమతుల్లో చైనా వాటా (చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు). 7.57 శాతంతో అమెరికా రెండోస్థానంలో ఉంది. అదే ఎగుమతుల విషయానికి వస్తే.. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల్లో 16.94 శాతం అమెరికాకే వెళ్తాయి.


-సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-06-19T08:29:58+05:30 IST