1200 ఇళ్లు.... 2 కాలేజీలు.... శ్రీలంకకు భారత్ కానుక

ABN , First Publish Date - 2021-10-05T02:06:09+05:30 IST

అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం శ్రీలంకలో భారత ప్రభుత్వం నిర్మించిన 1200కుపైగా గృహాలు, రెండు కళాశాలలను

1200 ఇళ్లు.... 2 కాలేజీలు.... శ్రీలంకకు భారత్ కానుక

న్యూఢిల్లీ: అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం శ్రీలంకలో భారత ప్రభుత్వం నిర్మించిన 1200కుపైగా గృహాలు, రెండు కళాశాలలను సోమవారం ఆ దేశానికి అప్పగించింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక చేరుకున్న భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా వాటిని ఆ దేశానికి అప్పగించారు.


భారత ప్రభుత్వ సాయంతో పూర్తయిన ఈ ప్రాజెక్టులు శ్రీలంకలో భారతదేశ బలమైన, బహుముఖ అభివృద్ధికి సంబంధించిన సహకారానికి ఉదాహరణ అని కొలంబోలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. కాగా, చైనాతో శ్రీలంక సన్నిహితంగా మెలుగుతున్న వేళ హర్షవర్ధన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.   


ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్ట్ (ఐహెచ్‌పీ) మూడో దశలో భాగంగా భారత్ నిర్మించిన 1235 గృహాలను శ్రీలంక ప్రభుత్వానికి అందజేసింది. రూ. 1,372 కోట్ల నిధులతో శ్రీలంకలోని వివిధ జిల్లాల్లో మొత్తం 50 వేల ఇళ్లను భారత్ నిర్మించనుంది. శ్రీలంకలో మూడు దశాబ్దాలపాటు కొనసాగిన పౌర యుద్ధం కారణంగా చెల్లాచెదురైన వేలాదిమంది తమిళులకు ఆశ్రయం ఇచ్చే లక్ష్యంతో ఈ గృహాలను నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-10-05T02:06:09+05:30 IST