తక్కువ పరీక్షలతో మెరుగైన లెక్కలా!

ABN , First Publish Date - 2020-06-14T07:18:33+05:30 IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది! అయితే.. ఇప్పటికే ఆ మార్కును దాటిన అమెరికా, బ్రెజిల్‌, రష్యా దేశాలకు అందుకు పట్టిన సమయం కన్నా.. భారత్‌కు పట్టిన సమయం చాలా ఎక్కువ...

తక్కువ పరీక్షలతో మెరుగైన లెక్కలా!

  • 134 రోజులు.. 3 లక్షల కేసులు
  • అమెరికా, రష్యా, బ్రెజిల్‌తో పోలిస్తే మన దేశంలోనే కరోనా అత్యంత నిదానం
  • 2 లక్షల కేసులకూ ఎక్కువ రోజులు
  • ఉత్తరప్రదేశ్‌లోని కరోనా మృతుల్లో 21-60 ఏళ్ల వయసువారే ఎక్కువ
  • మిగతా రాష్ట్రాలూ జాగ్రత్తపడాలి
  • వైద్యరంగ నిపుణుల సూచన
  • కరోనా కేసులు పురుషుల్లోనే అధికం
  • మరణాల రేటు మహిళల్లోనే జాస్తి


దేశంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది! అయితే.. ఇప్పటికే ఆ మార్కును దాటిన అమెరికా, బ్రెజిల్‌, రష్యా దేశాలకు అందుకు పట్టిన సమయం కన్నా.. భారత్‌కు పట్టిన సమయం చాలా ఎక్కువ. అమెరికాలో కేసుల సంఖ్య 3 లక్షలకు చేరడానికి 73 రోజులు పడితే.. మనదేశంలో అందుకు 134 రోజులు పట్టింది. బ్రెజిల్‌లో అందుకు 85 రోజులు పడితే.. రష్యాలో 109 రోజులు పట్టింది. లక్ష, రెండు లక్షల కేసులు కూడా భారత్‌లో నిదానంగానే నమోదయ్యాయి. ఆ లెక్క పరిశీలిస్తే..


  1. భారత్‌లో తొలి లక్ష కేసులు నమోదవడానికి 109 రోజులు పట్టింది. మే 18న మనదేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది. ఆ తర్వాత 15 రోజులకు.. అంటే జూన్‌ 2 నాటికి 2 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పదంటే పది రోజుల్లో కేసుల సంఖ్య మూడో లక్ష దాటేసింది.
  2. అదే సమయంలో అమెరికాలో కేసుల సంఖ్య లక్షకు చేరడానికి 65 రోజులు పట్టగా.. 5 రోజుల్లో 2 లక్షల మార్కు, ఆ తర్వాత 3 రోజుల్లోనే మూడు లక్షల మార్కు దాటేసింది. 
  3. వైరస్‌ వ్యాప్తి వేగాన్ని అంచనా వేసేందుకు ఎపిడమాలజిస్టులు చూసే లెక్క.. కేసుల సంఖ్య ఎన్ని రోజుల్లో రెట్టింపు అవుతోందన్నది. కరోనా కేసుల సంఖ్య లక్షన్నర నుంచి 3 లక్షలకు చేరడానికి మనదేశంలో 17 రోజులు పట్టింది (మార్చి 25న లాక్‌డౌన్‌ విధించేనాటికి దేశంలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి పట్టిన సమయం కేవలం 3.4 రోజులు). ఇక.. అమెరికాలో కేసుల సంఖ్య లక్షన్నర నుంచి 3 లక్షలకు చేరడానికి 5 రోజులు పట్టగా.. బ్రెజిల్‌లో అందుకు 12 రోజులు, రష్యాలో 14 రోజులు పట్టింది. 
  4. 3 లక్షల కేసులకు ఎన్ని మరణాలు నమోదయ్యాయనే లెక్క (కేస్‌ ఫాటాలిటీ రేట్‌-సీఎ్‌ఫఆర్‌)ను పరిశీలిస్తే రష్యాలో 0.95శాతంగా ఉంది. మనదేశంలో 3 లక్షల కేసులకు సీఎఫ్‌ఆర్‌ 2.95ు అమెరికాలో 3.37శాతం, బ్రెజిల్‌లో 6.48గా ఉంది. 


లక్షమందిలో సగటున ఒకరికి.. 

అమెరికా, రష్యా, బ్రెజిల్‌ దేశాల జనాభా మొత్తం కలిపినా, మన జనాభాలో సగమే! అయినా అక్కడ కేసుల సంఖ్య ఎక్కువగా, ఇక్కడ తక్కువగా ఉండడానికి కారణం పరీక్షలు తక్కువగా చేయడమేనా? ఈ ప్రశ్నకు నిపుణులు అవుననే సమాధానమిస్తున్నారు. మనదేశంలో ఇప్పుడు రోజూ 1.5 లక్షల పరీక్షలు జరుపుతున్నారు. మొదట్లో పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉం డేది. నెలన్నర క్రితం కూడా రోజూ 10-20 వేల పరీక్షలే చేశారు. ఈ నేపథ్యంలో, దేశంలో తొలి కరోనా కేసు నమోదైన జనవరి 30 నుంచి ఇప్పటిదాకా లక్ష మందికి రోజుకు సగటున ఒకరికే కరోనా పరీక్ష చేస్తున్నట్టు లెక్క అని జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాలు చెబుతున్నాయి. పరీక్షలు ఎక్కువగా జరిపితే కేసుల సంఖ్య, రెట్టింపయ్యే వేగం పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


యూపీలో యువకులూ..

ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాల్లో మరణించినవారిలో అత్యధికులు 60-70 ఏళ్లు పైబడినవారే! కానీ.. మనదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 21-60 ఏళ్లలోపు వారిలో, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారి మరణాలు సైతం పెరుగుతున్నాయి. యూపీ సర్కారు ప్రకటించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. జూన్‌ 10 దాకా యూపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 321. అందులో 209 మంది మృతుల్లో 65ు మంది) 21-60 ఏళ్లలోపువారే. మిగిలినవారిలో 101 మంది (31.5 శాతం) 60 ఏళ్లు పైబడినవారు కాగా.. 11 మంది (3.5 శాతం) 20 ఏళ్లలోపు వారు! ‘‘పరిస్థితి మారుతోంది. వృద్ధులు కానివారి, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారి మరణాలను మేం నమోదు చేస్తున్నాం. రోజూ నమోదవుతున్న 10-12 మరణాల్లో కనీసం రెండు, మూడు యువతీయువకులవే అయి ఉంటున్నాయి!’’ అని యూపీ ఆరోగ్య శాఖ సీనియర్‌ అధికారి ఒ కరు తెలిపారు. 21 నుంచి 60 ఏళ్ల దాకా వయసున్నవారు మరణిస్తున్నప్పటికీ.. నమోదవుతున్న కేసులతో పోలిస్తే, ఆ వయసువారిలో మరణాల రేటు తక్కువ ఉంది. అదే, 60 ఏళ్లకు పైబడిన వైరస్‌ పాజిటివ్‌ పేషెంట్లలో మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఇక తక్కువ వయసున్నవారిలో ఎలాంటి ఇతర అనారోగ్యాలూ లేకున్నా.. వారు మరణించడానికి కారణం వారి రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండడమేనని లఖ్‌నవుకు చెందిన డాక్టర్‌ డి హిమాన్షు తెలిపారు. ఈ విషయంలో జాగ్రత్తపడాలని ఎపిడమాలజిస్టులు సూచిస్తున్నారు.


ఆడపిల్లలకు అధిక ముప్పు!

దాదాపు అన్ని దేశాల్లో కరోనా వల్ల పురుషులే ఎక్కువగా చనిపోతుండగా.. మనదేశంలో 5-19 ఏళ్లలోపు మృతుల్లో మగపిల్లలు లేకపోవడం గమనార్హం. ఆ వయసు గ్రూపులో వైరస్‌ సోకిన ఆడపిల్లల్లో 0.6ు మంది మరణించారు. మే 20 వరకు గణాంకాలను చూస్తే, పాజిటివ్‌గా తేలినవారిలో పురుషుల మరణాల రేటు 2.9ు కాగా.. మహిళల్లో అది 3.3ుగా ఉంది. 

- సెంట్రల్‌ డెస్క్‌


Updated Date - 2020-06-14T07:18:33+05:30 IST