Commonwealth Games: చివరి రోజు కనకవర్షం!

ABN , First Publish Date - 2022-08-09T01:28:41+05:30 IST

కామన్వెల్త్‌ గేమ్స్ చివరి రోజు భారత క్రీడాకారులు అదరగొట్టారు. కనక వర్షం కురిపించారు. ఈ గేమ్స్‌లో మొత్తంగా 61 పతకాలు

Commonwealth Games: చివరి రోజు కనకవర్షం!

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్‌ గేమ్స్ చివరి రోజు భారత క్రీడాకారులు అదరగొట్టారు. కనక వర్షం కురిపించారు. ఈ గేమ్స్‌లో మొత్తంగా 61 పతకాలు గెలుచుకున్న భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. చివరి రోజైన నేడు (సోమవారం) బ్యాడ్మింటన్ సింగిల్స్ మహిళల విభాగంలో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ విజయాలు సాధించి దేశానికి రెండు స్వర్ణాలు అందించారు.


ఆ తర్వాత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడి ఇంగ్లండ్ ద్వయం బెన్ లెన్-సీన్‌ వెండీలపై 21-15, 21-13తో విజయం సాధించి బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. పురుషుల టేబుల్ టెన్నిస్‌లో 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్‌ఫోర్డ్‌తో 4-1తో విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నాడు. దీంతో చివరి రోజు భారత్‌కు నాలుగు స్వర్ణాలు లభించాయి.


అలాగే, టేబుల్ టెన్నిస్‌లోనే భారత్‌కు కాంస్య పతకం లభించింది. మూడో స్థానం కోసం ఇంగ్లండ్ ఆటగాడు పాల్ డ్రింక్‌హాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జ్ఞానశేఖరన్ సాతియాన్ విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఇక, పురుషుల హాకీ ఫైనల్‌లో భారత జట్టు తీవ్రంగా నిరాశపర్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 0-7తో చిత్తుగా ఓడి రజతంతో సరిపెట్టుకుంది. మరోవైపు, భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియాకు కామన్వెల్త్‌లో ఇది వరుసగా ఏడో పతకం కావడం గమనార్హం.

Updated Date - 2022-08-09T01:28:41+05:30 IST