Abn logo
Sep 19 2021 @ 17:02PM

India: విదేశీ పర్యాటకులకు త్వరలో అనుమతి

న్యూడిల్లీ: కరోనా కేసులు తగ్గడంతో భారత్‌ త్వరలో విదేశీ పర్యాటకులను అనుమతించనుందని అధికారులు తెలిపారు. పర్యాటకాన్ని పునరుద్ధరించడానికి తొలి 5లక్షల మందికి ఉచితంగా వీసాలను జారీ చేస్తామన్నారు. రాబోయే 10 రోజుల్లో పర్యాటకులను అనుమతిస్తారని హోంశాఖ నుంచి అధికారిక నిర్ణయం వెలువడుతుందని వివరించారు.  తొలి 5లక్షల మంది లేదా మార్చి 31, 2022 వరకు ఉచిత వీసాలను జారీ చేస్తామన్నారు. వీసాల జారీతో ప్రభుత్వంపై ఆర్థికంగా 100కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా వేశారు. స్వల్పకాల వ్యవధిలో భారత్‌ను సందర్శించేవారిని ప్రోత్సహించడం కోసం వీసాలను జారీ చేస్తున్నామన్నారు. పర్యాటకులకు ఒక నెల వ్యవధికి జారీ చేసే ఈ-వీసా ఖరీదు 25 అమెరికన్ డాలర్ల వరకు ఉంటే, ఏడాదిలో పలుమార్లు భారత్‌ను సందర్శించేవారికీ  జారీ చేసే ఈ-వీసా ఖరీదు దాదాపుగా 40అమెరికన్ డాలర్ల వరకు ఉంటుంది.


కరోనా తొలిదశ లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి భారత్ ఈ-వీసాలను జారీ చేయడం లేదు. వ్యాక్సిన్ వేసుకున్న యాత్రికులను మాత్రమే అనుమతించాలా, విదేశీ పర్యాటకులకు ఆంక్షలతో కూడిన అనుమతినివ్వాలా అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. దశల వారీగా పర్యాటకులను అనుమతినించాలని సర్కారు భావిస్తుంది. ఇప్పటికే కొన్ని దేశాలు పర్యాటకులను అనుమతిస్తున్నాయి. భారత్‌లో కొత్తగా 30,773 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కేసుల సంఖ్య 3.32లక్షలకు చేరుకుంది. శనివారం వరకు బారత్‌లో టీకా తీసుకున్నవారి సంఖ్య 80కోట్లుగా నమోదైంది.