Monkeypox: హమ్మయ్య.. భారత్‌లో మంకీపాక్స్ సోకిన తొలి బాధితుడి చర్మంపై ఉన్న..

ABN , First Publish Date - 2022-07-30T23:52:14+05:30 IST

భారత్‌లో మంకీపాక్స్ గురించి కలవరపడుతున్న ప్రజలకు ఊరట కలిగించే వార్త ఇది. దేశంలో తొలి మంకీపాక్స్ కేసుగా నమోదైన కేరళకు..

Monkeypox: హమ్మయ్య.. భారత్‌లో మంకీపాక్స్ సోకిన తొలి బాధితుడి చర్మంపై ఉన్న..

తిరువనంతపురం: భారత్‌లో మంకీపాక్స్ గురించి కలవరపడుతున్న ప్రజలకు ఊరట కలిగించే వార్త ఇది. దేశంలో తొలి మంకీపాక్స్ కేసుగా నమోదైన కేరళకు చెందిన వ్యక్తి కోలుకున్నాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న కొల్లాంకు చెందిన 35 ఏళ్ల ఈ వ్యక్తి  పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కానున్నాడు. యూఏఈ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి మంకీపాక్స్‌గా నిర్ధారణ అయింది. జులై 12న ఇతను త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. జులై 14న మంకీపాక్స్ లక్షణాలతో హాస్పిటల్‌లో చేరాడు. ప్రస్తుతం ఇతను మంకీపాక్స్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని, అతని చర్మంపై మంకీపాక్స్ కారణంగా ఏర్పడిన దద్దుర్లు కూడా పూర్తిగా నయమయ్యాయని కేరళ వైద్యఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇతని శాంపిల్స్‌ను రెండుసార్లు ల్యాబ్‌కు పంపించగా రెండుసార్లు నెగిటివ్ వచ్చిందని ఆమె తెలిపారు. ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నట్లు చెప్పారు. కేరళలో మంకీపాక్స్‌ బారిన పడిన మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలోనే మూడు మంకీపాక్స్ కేసులు నమోదు కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది.



మహారాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులైన డాక్టర్ శశాంక్ జోషి మంకీపాక్స్ వ్యాప్తిపై మాట్లాడారు. ఇప్పటికైతే మంకీపాక్స్ వల్ల భారత్‌కు వచ్చిన ముప్పేమీ లేదని చెప్పారు. ఇప్పటికే కోవిడ్ మన జీవన శైలిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని.. కోవిడ్-19 ప్రభావం తర్వాత కార్డియో-మెటబాలిక్ వ్యాధులైన మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. అందువల్ల.. మంకీపాక్స్ వంటి వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే తినే ఆహారం విషయంలో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మేలని ఆయన చెప్పారు. యోగా, వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.


మంకీ పాక్స్‌ అంత ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత రోగిని నాలుగు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. ఇవే లక్షణాలు మంకీపాక్స్‌ ఉన్న వారిలో ఉంటాయని తెలిపారు. మెడ భాగం, చంకలు, గజ్జల్లో బిళ్లలు కట్టడమనేది ఈ వ్యాధి ప్రత్యేకతని వెల్లడించారు. రోగికి అతి దగ్గరగా ఉన్న వారికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు. వ్యాధి సోకిన వ్యక్తి నోటి నుంచి వచ్చే తుంపర్లు, దుస్తులు, వాడే వస్తువులను నుంచి ఈ వ్యాధి సోకుతుందని వెల్లడించారు. చిన్నపిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. స్మాల్‌ పాక్స్‌ వ్యాధికి, మంకీపాక్స్‌ వ్యాధికి దగ్గర సారూప్యత ఉందని తెలిపారు.



వ్యాధి లక్షణాలు

మంకీపాక్స్‌ సోకిన వ్యక్తికి 1 నుంచి 2 వారాలు జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, అలసిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. చంకలు, మెడ భాగం, గజ్జల్లో బిళ్లలు కట్టడం ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం రోగికి లక్షణాలు పెరిగేకొద్ది ముఖం, చేతులు, ఛాతీ భాగాల్లో చిన్న చిన్న పొక్కులు కనిపిస్తాయి. తర్వాత వాటి స్థానంలో గోతులు ఏర్పడతాయి.


మంకీపాక్స్‌ అంత ప్రమాదకరం కాదు

ఈ వ్యాధి అంత ప్రమాదకరం కాదు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత రోగిని నాలుగు వారాల పాటు ఐసొలేషన్‌లో ఉంచాలి. పీపీఈ కిట్లు, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఈ వ్యాధికి సంబంధించి మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఉండి మందులు వాడితే తొందరగా కోలుకుంటారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు వ్యాధి లక్షణాలు ఉంటే దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Updated Date - 2022-07-30T23:52:14+05:30 IST