ఈసారి తడబడ్డారు..

ABN , First Publish Date - 2022-01-04T09:16:21+05:30 IST

తొలి టెస్టులో అదరగొట్టిన టీమిండియా జోరు ఈసారి కాస్త తగ్గింది. తాత్కాలిక కెప్టెన్‌ రాహుల్‌ ఆరంభంలో.. అశ్విన్‌ చివర్లో జట్టుకు అండగా నిలవడంతో స్కోరు అతికష్టంగా 200 దాటింది.

ఈసారి తడబడ్డారు..

  • భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ 202 ఆలౌట్‌
  • ఆదుకున్న రాహుల్‌, అశ్విన్‌
  • జాన్సెన్‌కు నాలుగు వికెట్లు
  • దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 35/1 


తొలి టెస్టులో అదరగొట్టిన టీమిండియా జోరు ఈసారి కాస్త తగ్గింది. తాత్కాలిక కెప్టెన్‌ రాహుల్‌ ఆరంభంలో.. అశ్విన్‌ చివర్లో జట్టుకు అండగా నిలవడంతో స్కోరు అతికష్టంగా 200 దాటింది. బౌన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ సఫారీ పేసర్లు జాన్సెన్‌, ఒలివియెర్‌, రబాడ చెలరేగడంతో తొలి రోజే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. మరోవైపు భారత వెటరన్లు పుజార, రహానె  పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ  నిరాశపరిచారు.


జొహాన్నె్‌సబర్గ్‌: చరిత్రాత్మక సిరీస్‌ విజయం కోసం వేచిచూస్తున్న భారత జట్టును రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఇబ్బంది పెడుతోంది. పేసర్లు అద్భుత ప్రదర్శనతో  ఆ జట్టుకు బాసటగా నిలిచారు. దీంతో సోమవారం తొలి రోజు భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 63.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (133 బంతుల్లో 9 ఫోర్లతో 50) అర్ధసెంచరీ సాధించగా.. అశ్విన్‌ (50 బంతుల్లో 6 ఫోర్లతో 46) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. లెఫ్టామ్‌ పేసర్‌ జాన్సెన్‌కు 4, రబాడ.. ఒలివియెర్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సరికి 18 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. భారత్‌కన్నా 167 పరుగులు వెనుకంజలో ఉంది. ఎల్గర్‌ (11 బ్యాటింగ్‌), పీటర్సన్‌ (14 బ్యాటింగ్‌) ఓపిగ్గా క్రీజులో నిలిచారు. షమికి ఓ వికెట్‌ దక్కగా.. పీటర్సన్‌ క్యాచ్‌ను పంత్‌ వదిలేశాడు. ఇక చివర్లో సిరాజ్‌ తొడ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు. పిచ్‌ పేసర్లకు సహకరిస్తుండడంతో రెండో రోజు భారత్‌ ఏ మేరకు ప్రత్యర్థిని నిలువరిస్తుందో చూడాలి. 


ఆరంభంలోనే..: వరుసగా రెండో టెస్టులోనూ టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ తీసుకున్నప్పటికీ పరుగులు మాత్రం కష్టమయ్యాయి. మూడేళ్ల తర్వాత టెస్టు ఆడుతున్న ఒలివియెర్‌ భారత్‌ను వణికించాడు. దీంతో లంచ్‌ విరామానికే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలిగంట ఆటలో మయాంక్‌ అగర్వాల్‌ (26) టచ్‌లో ఉన్న ట్టు కనిపించాడు. 5 ఫోర్లతో ఎదురుదాడికి దిగడంతో ఓపెనర్ల నుంచి తొలి టెస్టు మాదిరే భారీ భాగస్వామ్యం వస్తుందనిపించింది. కానీ 15వ ఓవర్‌లోనే జాన్సెన్‌ ఎక్స్‌ట్రా బౌన్స్‌తో మయాంక్‌ను బోల్తా కొట్టించాడు. ఎడ్జ్‌ తీసుకున్న బంతి కీపర్‌ చేతుల్లో పడడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత బౌన్సీ బంతులను ఆడేందుకు ఇబ్బంది పడిన పుజారతో పాటు వచ్చీ రాగానే అనవసర షాట్‌కు యత్నించిన రహానెను ఒలివియెర్‌ వరుస బంతుల్లో అవుట్‌ చేశాడు. అనంతరం రాహుల్‌, విహారి సెషన్‌ను 53/3తో ముగించారు.


రాహుల్‌ అర్ధసెంచరీ: బ్రేక్‌ తర్వాత భారత్‌ ఇన్నింగ్స్‌లో జోరు పెరిగింది. 25 ఓవర్లపాటు సాగిన రెండో సెషన్‌లో రాహుల్‌ అర్ధసెంచరీతో రాణించగా జట్టు 93 పరుగులు చేసింది. ఆరంభంలోనే ఎన్‌గిడి ఓవర్‌లో విహారి అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతడిచ్చిన సులువైన క్యాచ్‌ను బవుమా అందుకోలేకపోయాడు. కానీ ఈ సువర్ణావకాశాన్ని విహారి సద్వినియోగం చేసుకోలేదు. కాసేపటికే రబాడ ఓవర్‌లో డుస్సెన్‌ సూపర్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. 4వ వికెట్‌కు ఈ జోడీ మధ్య 42 రన్స్‌ వచ్చాయి. అర్ధసెంచరీ ముగిసిన వెంటనే రాహుల్‌ పుల్‌షాట్‌కు ప్రయత్నించి ఫైన్‌లెగ్‌లో రబాడకు క్యాచ్‌ ఇచ్చాడు. అశ్విన్‌, పంత్‌ ధాటిగా ఆడి బౌలర్లపై ఒత్తిడి పెంచేందుకు చూశారు. 


అశ్విన్‌ పోరాటం: ఆఖరి సెషన్‌లో భారత్‌ మరో 56 రన్స్‌ చేసి మిగిలిన 5 వికెట్లను కోల్పోయింది. పంత్‌ (17)ను ఆరంభంలోనే జాన్సెన్‌ దెబ్బతీయగా, వెంటనే శార్దూల్‌ (0)ను ఒలివియెర్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ కోలుకోలేకపోయింది. ఓవైపు అశ్విన్‌ ఓపిగ్గా క్రీజులో నిలిచినా సహకారం లేకపోయింది. చివరికి అర్ధసెంచరీకి 4 పరుగుల దూరంలో అశ్విన్‌ను జాన్సెన్‌ అవుట్‌ చేశాడు. 62వ ఓవర్‌లో బుమ్రా (14 నాటౌట్‌) 4,6,4తో చెలరేగడంతో జట్టు స్కోరు 200 దాటింది. కానీ చివరి 2 వికెట్లను రబాడ పడగొట్టి భారత్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు.


ఆరు మ్యాచ్‌లు.. ఆరుగురు కెప్టెన్లు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు వేదిక జొహాన్నె్‌సబర్గ్‌లో టీమిండి యా ఆసక్తికరమైన రికార్డు నెలకొల్పింది. ఇక్కడ ఆడిన మొత్తం ఆరు టెస్ట్‌ల్లో ఆరుగురు వేర్వేరు కెప్టెన్లతో భారత్‌ బరిలోకి దిగడం విశేషం. తొలిసారిగా 1992లో ఇక్కడ మ్యాచ్‌ ఆడిన భారత్‌కు మహ్మద్‌ అజరుద్దీన్‌ సారథ్యం వహించగా.. 1997లో సచిన్‌ టెండూ ల్కర్‌, 2006లో రాహుల్‌ ద్రవిడ్‌, 2013లో ధోనీ, 2018లో విరాట్‌ కోహ్లీ జట్టు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇక, ప్రస్తుత టెస్ట్‌కు కోహ్లీ గాయంతో దూరమవగా.. కేఎల్‌ రాహుల్‌ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.  


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) రబాడ (బి) జాన్సెన్‌ 50; మయాంక్‌ (సి) వెర్రేన్‌ (బి) జాన్సెన్‌ 26; పుజార (సి) బవుమా (బి) ఒలివియెర్‌ 3; రహానె (సి) పీటర్సన్‌ (బి) ఒలివియెర్‌ 0; విహారి (సి) డుస్సెన్‌ (బి) రబాడ 20; పంత్‌ (సి) వెర్రేన్‌ (బి) జాన్సెన్‌ 17; అశ్విన్‌ (సి) పీటర్సన్‌ (బి) జాన్సెన్‌ 46; శార్దూల్‌ (సి) పీటర్సన్‌ (బి) ఒలివియెర్‌ 0; షమి (సి అండ్‌ బి) రబాడ 9; బుమ్రా (నాటౌట్‌) 14; సిరాజ్‌ (సి) వెర్రేన్‌ (బి) రబాడ 1; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 63.1 ఓవర్లలో 202 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-36, 2-49, 3-49, 4-91, 5-116, 6-156, 7-157, 8-185, 9-187, 10-202 ; బౌలింగ్‌: రబాడ 17.1-2-64-3; ఒలివియెర్‌ 17-1-64-3; ఎన్‌గిడి 11-4-26-0; జాన్సెన్‌ 17-5-31-4; కేశవ్‌ 1-0-6-0.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (బ్యాటింగ్‌) 11; మార్‌క్రమ్‌ (ఎల్బీ) షమి 7; పీటర్సన్‌ (బ్యాటింగ్‌) 14; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 18 ఓవర్లలో 35/1; వికెట్‌ పతనం: 1-14; బౌలింగ్‌: బుమ్రా 8-3-14-0; షమి 6-2-15-1; సిరాజ్‌ 3.5-2-4-0; శార్దూల్‌ 0.1-0-0-0.

Updated Date - 2022-01-04T09:16:21+05:30 IST