ఇద్దరు పాకిస్థానీలను దేశం నుంచి బహిష్కరించిన భారత్

ABN , First Publish Date - 2020-06-01T05:57:03+05:30 IST

గూఢచార్యానికి పాల్పడిన ఇద్దరు పాకిస్థానీ అధికారులను దేశం నుంచి బహిష్కరించినట్టు

ఇద్దరు పాకిస్థానీలను దేశం నుంచి బహిష్కరించిన భారత్

న్యూఢిల్లీ: గూఢచార్యానికి పాల్పడిన ఇద్దరు పాకిస్థానీ అధికారులను దేశం నుంచి బహిష్కరించినట్టు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది. ఢిల్లీ పోలీసులకు సంబంధించిన స్పెషల్ సెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 10.45 గంటలకు ముగ్గురు పాకిస్థానీలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థానీ మిషన్‌లో అసిస్టెంట్‌గా ఉన్న అబిద్ హుస్సేన్ అబిద్(42), క్లర్క్‌గా ఉన్న మహమ్మద్ తహీర్ ఖాన్(44), డ్రైవర్ జావేద్ హుస్సేన్‌(36)లపై గత కొద్ది నెలల నుంచి ఢిల్లీ పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు అధికారులు తెలిపారు. తాజాగా ఓ భారతీయుడి నుంచి ఇండియన్ సెక్యూరిటీకి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుంటూ వీరు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్టు పేర్కొన్నారు. తాము ముగ్గురం భారతీయులమంటూ నకిలీ ఆధార్ కార్డులను చూపించారని.. అనంతరం తాము పాకిస్థాన్‌ హైకమిషన్‌కు చెందిన అధికారులమంటూ నిజం చెప్పారని పోలీసులు తెలిపారు. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద నిందితులపై కేసు పెట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. అనంతరం అబిద్, ఖాన్‌లను దేశం నుంచి బహిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. 24 గంటల్లో వీరు దేశాన్ని విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రకటనను కూడా విదేశాంగశాఖ విడుదల చేసింది. కాగా.. పోలీసుల అదుపులో ఉన్న మరో పాకిస్థానీ వ్యక్తికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-06-01T05:57:03+05:30 IST