నువ్వా.. నేనా?

ABN , First Publish Date - 2021-03-20T09:41:56+05:30 IST

ఇప్పటిదాకా జరిగిన నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో ఒకటి నువ్వు.. ఒకటి నేను అన్నట్టుగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు విజయాలు..

నువ్వా.. నేనా?

సిరీస్‌ కోసం భారత్‌-ఇంగ్లండ్‌ పోరు 

నేడు ఐదో టీ20

ఇప్పటిదాకా జరిగిన నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో ఒకటి నువ్వు.. ఒకటి నేను అన్నట్టుగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు విజయాలు సాధించాయి. ఇక మిగిలింది ఒక్క మ్యాచే. మరో చాన్స్‌ లేదు కాబట్టి ఫైనల్‌ పంచ్‌ ఎవరిదో వారికే సిరీస్‌. క్రితం మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. కుర్రాళ్లు స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపిస్తుండడం జట్టుకు సానుకూలాంశం. అటు వరల్డ్‌ నెంబర్‌వన్‌ ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో తడబాటు ఆందోళన పెంచుతోంది. 


అహ్మదాబాద్‌: ఐదు టీ20ల సిరీస్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. శనివారం భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య నరేంద్ర మోదీ మైదానంలో ఐదో టీ20 జరగనుంది. ఇరు జట్లు చెరో రెండు విజయాలు సాధించగా 2-2తో సిరీస్‌ సమంగా ఉంది. ఈనేపథ్యంలో విజేతగా నిలిచేందుకు ఇరు జట్లు తమ ఉత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాయి. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20లో భారత్‌ చివరి ఓవర్‌లో నెగ్గింది. తద్వారా ఈ సిరీ్‌సలో టాస్‌ ఓడితే మ్యాచ్‌ కూడా పోతుందనే అభిప్రాయాన్ని కోహ్లీ సేన బ్రేక్‌ చేసింది. అలాగే టీ20 ప్రపంచక్‌పను దృష్టిలో ఉంచుకుని ప్రయోగాలకు వెళ్లి తగిన ఫలితాన్ని కూడా సాధించింది. ఇషాన్‌, సూర్యకుమార్‌, రాహుల్‌ చాహర్‌లకు అవకాశాలు భారత్‌ ప్రణాళికల్లో భాగంగానే చెప్పవచ్చు.


మార్పుల్లేకుండానే..:

భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఓపెనింగ్‌ ఒక్కటే సమస్యగా ఉంది. ధవన్‌, రాహుల్‌, రోహిత్‌లలో ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. అటు వరుసగా విఫలమవుతున్నా రాహుల్‌ను కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో అతడి పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ రూపంలో భారత్‌కు దూకుడైన ఆటగాళ్లు లభించారు. ఎలాంటి పరిస్థితిల్లోనైనా ఎదురుదాడే లక్ష్యంగా వీరి ఆటతీరు కనిపించింది. తెవాటియా ఒక్కడే అరంగేట్రం చేయలేకపోయాడు. నేటి మ్యాచ్‌లో అతడికి చాన్సిస్తారో చూడాలి. అదే జరిగితే రాహుల్‌, సుందర్‌లలో ఒకరు బెంచికే పరిమితం కాక తప్పదు. మరోవైపు హార్దిక్‌ తన ఓవర్ల కోటాను పూర్తి చేస్తుండడం జట్టుకు లాభించే విషయం. శార్దూల్‌ డెత్‌ ఓవర్లలో చెలరేగుతుండగా స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ ఆకట్టుకుంటున్నాడు.


స్టార్లు సత్తా చాటితేనే..:

ఇంగ్లండ్‌ జట్టులో స్టార్లకు కొదవ లేదు. అయినా స్థాయికి తగ్గ ఆటతీరు కనిపించడం లేదు. ఈ ఫార్మాట్‌లో నెంబర్‌వన్‌ డేవిడ్‌ మలాన్‌ సిరీ్‌సలో ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. బట్లర్‌ కూడా మూడో టీ20లోనే మెరిశాడు. బెయిర్‌స్టో, మోర్గాన్‌ జట్టును గెలిపించే స్థాయిలో ఆడడం లేదు. బౌలింగ్‌లో మార్క్‌ వుడ్‌, జోఫ్రా ఆర్చర్‌ అదరగొడుతున్నా జోర్డాన్‌, సామ్‌ కర్రాన్‌ల నుంచి సహకారం లభించడం లేదు. అందుకే లోపాలను సరిదిద్దుకుని ఎలాగైనా చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజృంభించాలనుకుంటోంది.


జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌, కోహ్లీ (కెప్టెన్‌), పంత్‌, శ్రేయాస్‌, పాండ్యా, సుందర్‌, శార్దూల్‌, భువనేశ్వర్‌, రాహుల్‌ చాహర్‌.

ఇంగ్లండ్‌: రాయ్‌, బట్లర్‌, మలాన్‌, బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌, మోర్గాన్‌ (కెప్టెన్‌), సామ్‌ కర్రాన్‌, మార్క్‌ వుడ్‌, జోర్డాన్‌, ఆర్చర్‌, రషీద్‌.

Updated Date - 2021-03-20T09:41:56+05:30 IST