119 పరుగులా.. ఏడు వికెట్లా?

ABN , First Publish Date - 2022-07-05T10:05:11+05:30 IST

అంచనాలన్నీ తారుమారయ్యాయి. సిరీ్‌సలో చివరిదైన ఐదో టెస్టులో భారత్‌ కష్టాల్లో కూరుకుపోయింది.

119  పరుగులా.. ఏడు వికెట్లా?

గెలుపు దిశగా ఇంగ్లండ్‌

రెండో ఇన్నింగ్స్‌ 259/3 

నాలుగో రోజు భారత్‌ తడబాటు

ఇంతలోనే ఎంత మార్పు.. ఆదివారం ఆటను చూస్తే మ్యాచ్‌ భారత్‌దే అన్నట్టుగా కనిపించినా.. మరుసటి రోజుకే సీన్‌ రివర్స్‌ అయ్యింది. టెస్టు ఫార్మాట్‌లో సరికొత్త ఆటతీరును ప్రదర్శిస్తోన్న ఇంగ్లండ్‌.. ఇటీవలి కాలంలో భారీ లక్ష్యాలను సైతం అవలీలగా ఛేదిస్తోంది. ఇప్పుడు కూడా 378 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగి బుమ్రా సేనను వణికిస్తోంది. బెయిర్‌స్టో, రూట్‌ కదం తొక్కడంతో ఆతిథ్య జట్టు ఐదో టెస్ట్‌లో విజయానికి మరో 119 పరుగుల దూరంలో నిలిచింది. భారత్‌ గట్టెక్కేందుకు ఏడు వికెట్లు పడగొట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఆఖరి రోజు ఏం జరుగుతుందనేది వేచిచూడాల్సిందే.. 

విదేశీ గడ్డపై ఓ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ, అర్ధసెంచరీ సాధించిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌. అలాగే ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టులో ఎక్కువ పరుగులు (203) చేసిన కీపర్‌గా క్లైడ్‌ వాల్‌కాట్‌ రికార్డు (1950లో 172)ను అధిగమించాడు.


ఇంగ్లండ్‌తో  జరిగిన ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌గా బుమ్రా (23). కపిల్‌ (22)ను అధిగమించాడు.


భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో ఎక్కువ పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రూట్‌ (671)


బర్మింగ్‌హామ్‌: అంచనాలన్నీ తారుమారయ్యాయి. సిరీ్‌సలో చివరిదైన ఐదో టెస్టులో భారత్‌ కష్టాల్లో కూరుకుపోయింది. అటు ఐదు టెస్టుల సిరీ్‌సను సమం చేసే దిశగా ఇంగ్లండ్‌ సాగుతోంది. నాలుగో రోజు పూర్తిగా స్టోక్స్‌ సేనదే ఆధిపత్యం. 378 పరుగుల భారీ ఛేదనలో సోమవారం ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో 259/3 స్కోరు చేసింది. ఆఖరి రోజు విజయానికి ఇంకా 119 పరుగులే కావాల్సి ఉండగా, చేతిలో మరో ఏడు వికెట్లుండడం విశేషం. క్రీజులో రూట్‌ (76 బ్యాటింగ్‌), బెయిర్‌స్టో (72 బ్యాటింగ్‌) అద్భుతంగా నిలదొక్కుకున్నారు. ఓపెనర్లు లీస్‌ (56), క్రాలే (46) శుభారంభం అందించారు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. మంగళవారం ఆటలో భారత బౌలర్లు ఏమేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. పంత్‌ (57) రాణించాడు. స్టోక్స్‌కు నాలుగు, బ్రాడ్‌.. పాట్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.


భారత్‌ తడబాటు:

నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి భారత్‌ మరో 120 పరుగులను మాత్రమే అదనంగా జత చేయగలిగింది. 125/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించగా రెండు సెషన్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. అయితే మొత్తంగా 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందుంచగలిగింది. ఆరంభంలో అండర్సన్‌ ఓవర్‌లో పుజార రెండు ఫోర్లు సాధించడం ఆకట్టుకుంది. అయితే పంత్‌ మాత్రం ఆచితూచి బ్యాటింగ్‌ కొనసాగించాడు. బ్రాడ్‌ వేసిన ఆఫ్‌సైడ్‌ బాల్‌ను ఆడే ప్రయత్నంలో పుజార అవుట్‌ కావడంతో నాలుగో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్‌ (19) షార్ట్‌ పిచ్‌ బాల్‌కు దొరికిపోయాడు. అటు పంత్‌ నిలకడ చూపిస్తూ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.


అయితే రివర్స్‌ పుల్‌ షాట్‌ ప్రయత్నంలో స్లిప్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. సెషన్‌ చివర్లో పాట్స్‌ షార్ట్‌ బాల్‌ శార్దూల్‌ (4) హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. దీంతో తను కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఆ తర్వాత జడేజా (23), షమి (13) మరో వికెట్‌ పడకుండా బ్రేక్‌కు వెళ్లారు. కానీ విరామం తర్వాత కెప్టెన్‌ స్టోక్స్‌ ధాటికి మరో 8.5 ఓవర్లలోనే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. షమిని రెండో సెషన్‌ ఆరంభ ఓవర్‌లోనే అవుట్‌ చేయగా.. స్వల్ప వ్యవధిలోనే జడ్డూ, బుమ్రా (7)లను పెవిలియన్‌కు చేర్చడంతో భారత్‌ ఆలౌటైంది.


శతక భాగస్వామ్యం:

378 పరుగుల ఛేదన అంత సులువేమీ కాదు. కానీ ఇంగ్లండ్‌ మాత్రం ఎదురుదాడిని నమ్ముకుంది. దీంట్లో భాగంగానే ఓపెనర్లు లీస్‌, క్రాలే మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరి ధాటికి టీ విరామానికి 23 ఓవర్లలోనే 107 పరుగులను సాధించింది. దీనికి తోడు పిచ్‌ నుంచి స్వింగ్‌, టర్న్‌ రాబట్టలేకపోవడంతో భారత బౌలర్ల నుంచి ఎలాంటి ప్రమాదం ఎదురుకాలేదు. ఫ్లాట్‌గా మారిన ట్రాక్‌పై ఈ జోడీ వన్డే తరహా ఆటతీరుతో చెలరేగింది. ముఖ్యంగా లీస్‌ దూకుడును కనబర్చగా.. క్రాలే చక్కగా సహకరించాడు. టీ బ్రేక్‌కు కాస్త ముందు భారత్‌ కొత్త బంతి తీసుకోవడం ఫలితాన్నిచ్చింది. 22వ ఓవర్‌లో బుమ్రా సూపర్‌ బంతికి క్రాలే బౌల్డ్‌ అయ్యాడు.


ఆదుకున్న రూట్‌, బెయిర్‌స్టో:

చివరి సెషన్‌ తొలి రెండు ఓవర్లలోనే పోప్‌ (0), లీస్‌ వికెట్లను కోల్పోగా ఇంగ్లండ్‌ ఆత్మరక్షణలో పడిపోయింది. పోప్‌ను బుమ్రా అవుట్‌ చేయగా.. లీస్‌ రనౌటయ్యాడు. ఈ దశలో డాషింగ్‌ బ్యాటర్‌ బెయిర్‌స్టో, రూట్‌ జట్టును ఆదుకున్నారు. అయితే సిరాజ్‌ ఓవర్‌లో బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను విహారి వదిలేయడం నష్టపరిచింది. 46వ ఓవర్‌లో స్కోరు 200 దాటగా అటు రూట్‌ అర్ధసెంచరీ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాకపోవడంతో వీరు నాలుగో వికెట్‌కు అజేయంగా 150 రన్స్‌ జోడించి రోజును ముగించారు.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 416

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 284

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌:

గిల్‌ (సి) క్రాలే (బి) అండర్సన్‌ 4, పుజార (సి) లీస్‌ (బి) బ్రాడ్‌ 66, విహారి (సి) బెయిర్‌స్టో (బి) బ్రాడ్‌ 11, కోహ్లీ (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 20, పంత్‌ (సి) రూట్‌ (బి) లీచ్‌ 57, అయ్యర్‌ (సి) అండర్సన్‌ (బి) పాట్స్‌ 19, జడేజా (బి) స్టోక్స్‌ 23, శార్దూల్‌ (సి) క్రాలే (బి) పాట్స్‌ 4, షమి (సి) లీస్‌ (బి) స్టోక్స్‌ 13, బుమ్రా (సి) క్రాలే (బి) స్టోక్స్‌ 7, సిరాజ్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 19, మొత్తం: 81.5 ఓవర్లలో 245 ఆలౌట్‌;  వికెట్లపతనం: 1-4, 2-43, 3-75, 4-153, 5-190, 6-198, 7-207, 8-230, 9-236, బౌలింగ్‌: అండర్సన్‌ 19-5-46-1, బ్రాడ్‌ 16-1-58-2, మాథ్యూ పాట్స్‌ 17-3-50-2, లీచ్‌ 12-1-28-1, స్టోక్స్‌ 11.5-0-33-4, రూట్‌ 6-1-17-0.


ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ :

లీస్‌ (రనౌట్‌) 56, క్రాలే (బి) బుమ్రా 46, పోప్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0, రూట్‌ (బ్యాటింగ్‌) 76, బెయిర్‌స్టో (బ్యాటింగ్‌) 73, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం : 57 ఓవర్లలో 260/3 వికెట్లపతనం : 1-107, 2-107, 3-109: బౌలింగ్‌: బుమ్రా 13-0-54-2, షమి 12-2-49-0, జడేజా 15-2-53-0, సిరాజ్‌ 10-0-64-0, శార్దూల్‌ 7-0-33-0. 

Updated Date - 2022-07-05T10:05:11+05:30 IST