ఆట అదిరె..

ABN , First Publish Date - 2022-09-19T09:35:58+05:30 IST

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన భారత మహిళలు ఇంగ్లండ్‌తో ఆదివారంనాటి తొలి వన్డేలో ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించారు.

ఆట అదిరె..

తొలి వన్డేలో భారత్‌ గెలుపు

స్మృతి, కౌర్‌, యాస్తిక మెరుపులు

హోవ్‌: బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన భారత మహిళలు ఇంగ్లండ్‌తో ఆదివారంనాటి తొలి వన్డేలో ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించారు. టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 227/7 స్కోరు చేసింది. డేవిడ్‌సన్‌ రిచర్డ్స్‌ (50 నాటౌట్‌), వ్యాట్‌ (43), ఎకిల్‌స్టోన్‌ (31) రాణించారు. స్పిన్నర్‌ దీప్తిశర్మ రెండు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో భారత్‌ 44.2 ఓవర్లలో మూడు వికెట్లకు 232 పరుగులు చేసి సునాయాసంగా నెగ్గింది. స్మృతి మంధాన (91), హర్మన్‌ప్రీత్‌ (74 నాటౌట్‌), యాస్తికా భాటియా (50) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో హర్మన్‌సేన 1-0తో నిలిచింది. మంధాన ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికైంది.


‘టాప్‌’ లేపారు..

ఓ మోస్తరు ఛేదనలో షఫాలీ వర్మ (1) విఫలంకాగా..మరో ఓపెనర్‌ మంధాన, కీపర్‌ యాస్తికా భాటియా ఇంగ్లండ్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొని 96 పరుగుల భాగస్వామ్యం ఏర్పరచారు. భాటియా నిష్క్రమణ తర్వాత స్మృతికి, హర్మన్‌ప్రీత్‌ జోరు తోడుకావడంతో భారత్‌ సులువుగా లక్ష్యం దిశగా దూసుకుపోయింది. అయితే సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో క్రాస్‌ బౌలింగ్‌లో స్మృతి నిష్క్రమించగా..99 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. ఆపై కౌర్‌, హర్లీన్‌ డియోల్‌ (6 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా జట్టును గెలిపించారు. అంతకుముందు..ఇంగ్లండ్‌ ఓపెనర్లు బ్యూమాంట్‌ (7), లాంబ్‌ (12) విఫలంకాగా..లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్లు ఆదుకోవడంతో ఇంగ్లండ్‌ స్కోరు 200 దాటింది.  


సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్‌:

50 ఓవర్లలో 227/7 (అలైస్‌ రిచర్డ్స్‌ నాటౌట్‌ 50, వ్యాట్‌ 43, ఎకిల్‌స్టోన్‌ 31, డంక్లీ 29, దీప్తిశర్మ 2/33, జులన్‌ 1/20, హర్లీన్‌ 1/25)


భారత్‌:

44.2 ఓవర్లలో 232/3 (స్మృతి మంధాన 91, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 74 నాటౌట్‌, యాస్తిక 50, క్రాస్‌ 2/43).

Updated Date - 2022-09-19T09:35:58+05:30 IST