ఇటలీ, స్పెయిన్‌ను దాటేసిన‌ భారత్‌

ABN , First Publish Date - 2020-06-07T12:42:04+05:30 IST

దేశంలో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. కేసులు, మరణాల్లో ఏ రోజుకారోజు అంకెలు పెరుగుతూ పోతున్నాయి.

ఇటలీ, స్పెయిన్‌ను దాటేసిన‌ భారత్‌

కరోనా కేసులు 2.45 లక్షలు

న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. కేసులు, మరణాల్లో ఏ రోజుకారోజు అంకెలు పెరుగుతూ పోతున్నాయి. వరుసగా మూడో రోజు 9 వేల పైగా కేసులు నమోదయ్యాయి. జాన్స్‌ హాప్కిన్స్‌ వర్సిటీ డేటా ప్రకారం శనివారం రాత్రికి భారత్‌లో కేసుల సంఖ్య 2,45,670కి చేరింది. దీంతో స్పెయిన్‌ (2,41,310)ను సైతం దాటేసి ప్రపంచ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్‌, రష్యా, యూకే.. మన దేశం కంటే ముందుకున్నాయి. అమెరికా, బ్రెజిల్‌ తర్వాత రోజువారీ ఎక్కువ కేసులు రికార్డవుతున్నది భారత్‌లోనే కావడం గమనార్హం. కాగా, శనివారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 9,887 కేసులు నమోదయ్యాయని, 294 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.


అప్పటికి మొత్తం 2,36,657 కేసులతో మన దేశం.. ఇటలీ (2,34,531)ని దాటేసింది. తాజా మరణాలతో కలిపి మొత్తం మరణాలు 6,642 అయ్యాయి. దేశంలో కోలుకున్నవారి శాతం 48.2 అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా 1,37,938 మందికి పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. మరోవైపు కేసుల్లో మహారాష్ట్ర (82,968).. చైనా (83,030)ను సమీపించింది. ఆ రాష్ట్రంలో మరణాలు 3 వేలకు చేరాయి. ఔరంగాబాద్‌ సెంట్రల్‌ జైల్‌లో మరో 29 మంది ఖైదీలకు కరోనా సోకింది. గుజరాత్‌లోని భుజ్‌లో ఐదుగురు సరిహద్దు భద్రతా దళం జవాన్లనకు వైరస్‌ సోకింది. సాధారణ వ్యక్తులే కాక దేశంలో ఓస్థాయి వారూ కరోనాకు గురవుతున్నారు. కోల్‌కతాలోని డిస్ట్రిక్ట్‌ సివిల్‌ సెషన్స్‌ కోర్టులో ఇద్దరు జడ్జిలకు వైరస్‌ సోకింది. స్పెషల్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి సహా.. ఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రధాన కార్యాలయంలో ఐదుగురు అధికారులు కరోనా బారినపడ్డారు. దీంతో కార్యాలయాన్ని 48 గంటలు సీల్‌ చేశారు. 


తమిళనాట తగ్గని ఉధృతి

తమిళనాడులో శనివారం 1,458 కేసులు నమోదయ్యాయి. ఇందులో చెన్నైవే 1,146 కేసులు. మరో పందొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 329 మంది మహారాష్ట్ర నుంచి వచ్చినవారే. 


భారత్‌లో వైరస్‌ ఇంకా విజృంభించలేదు: డబ్ల్యూహెచ్‌వో

భారత్‌ సహా జనాభా ఎక్కువగా ఉండే దక్షిణాసియాలో కరోనా ఇంకా విజృంభించలేదని.. కానీ లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులతో ఆ ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర విభాగ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో భారత్‌లో కరోనా వ్యాప్తి నెమ్మదించిందన్న ర్యాన్‌.. ఎత్తివేత అనంతరం ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో వైరస్‌ విరుచుకుపడే ముప్పుందన్నారు. కాగా, 135 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో 2 లక్షల కేసులు పెద్ద విషయం కాదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. 

Updated Date - 2020-06-07T12:42:04+05:30 IST