‘భారత’ రహస్య సమాచారాన్ని సేకరించా!

ABN , First Publish Date - 2022-07-13T07:20:01+05:30 IST

పాకిస్థాన్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు నస్రత్‌ మీర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘భారత’ రహస్య సమాచారాన్ని సేకరించా!

కీలక సమాచారాన్ని ఐఎ్‌సఐకి అందించా: పాక్‌ సీనియర్‌ జర్నలిస్టు 


న్యూఢిల్లీ, జులై 12: పాకిస్థాన్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు నస్రత్‌ మీర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌ యూట్యూబర్‌ షకీల్‌ చౌధరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. తాను 2005 నుంచి 2011 మధ్య కాలంలో భారత్‌లో అనేకసార్లు పర్యటించినట్లు మీర్జా చెప్పారు. 2010లో నాటి ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఆహ్వానం మేరకు ఢిల్లీలో ఉగ్రవాదంపై నిర్వహించిన సదస్సుకు హాజరైనట్లు తెలిపారు. చివరిసారిగా 2011లో భారత్‌లో పర్యటించానన్నారు. భారత్‌ గురించి సేకరించిన రహస్య సమాచారాన్నంతటినీ పాక్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐకు అందజేసినట్లు మీర్జా వెల్లడించారు. భారత్‌ గురించి తాను విస్తృతంగా సేకరించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌ వాడుకోలేకపోయిందన్నారు. భారత్‌లోని 40 రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్నాయని మీర్జా చెప్పగా.. యూట్యూబర్‌ చౌధరి కల్పించుకొని భారత్‌లో 29 రాష్ట్రాలే ఉన్నాయని గుర్తుచేశారు. దానికి ఆగ్రహం వ్యక్తం చేసిన మీర్జా.. తనకు అంతా తెలుసని వ్యాఖ్యానించడం గమనార్హం. భారత్‌, పాక్‌లు శాంతియుతంగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా? అన్న ప్రశ్నకు.. భారత్‌ శాంతికి వ్యతిరేకమని మీర్జా ఆరోపించారు. కాగా, హమీద్‌ అన్సారీ తనను ఆహ్వానించారన్న మీర్జా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, అన్సారీ మాజీ ఓఎస్డీ గురుదీ్‌పసింగ్‌ సప్పల్‌ ఖండించారు. అప్పటి సదస్సుకు అన్సారీ ముఖ్య అతిథి అని, బార్‌ అసోసియేషన్‌ లేదా కేంద్ర హోం శాఖ మాత్రమే పాక్‌కు చెందిన వారిని ఆహ్వానిస్తాయని తెలిపారు. మీర్జా తనను అన్సారీ ఆహ్వానించారని ఎన్నడూ కెమెరా ముందు చెప్పలేదన్నారు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న పనులేనని వరస ట్వీట్లలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-13T07:20:01+05:30 IST