India-China Military Talks : చైనా సైన్యానికి భారత సైన్యం ఏం చెప్పబోతోందంటే...

ABN , First Publish Date - 2022-07-16T20:05:16+05:30 IST

భారత్-చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ల 16వ విడత చర్చలు

India-China Military Talks : చైనా సైన్యానికి భారత సైన్యం ఏం చెప్పబోతోందంటే...

న్యూఢిల్లీ : భారత్-చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ల 16వ విడత చర్చలు ఆదివారం జరుగుతాయి. లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి 10 కిలోమీటర్ల నో-ఫ్లై జోన్ సంప్రదాయాన్ని గౌరవించాలని, పెట్రోలింగ్ పాయింట్-15 (ఖుగ్రంగ్ నల్లా) వద్ద సైనిక దళాలను ఉపసంహరించాలని చైనాకు భారత్ గట్టిగా చెప్తుంది. 2020 ఏప్రిల్ నాటి పరిస్థితిని 2021 ఆగస్టులో గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనీస్ ఆర్మీ పునరుద్ధరించినప్పటి నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)  దళాల ఉపసంహరణలో కదలిక లేదు. 


జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నేపథ్యంలో జూలై 7న బాలీలో భారత్-చైనా విదేశాంగ మంత్రులు సుబ్రహ్మణ్యం జైశంకర్, వాంగ్ యీ సమావేశమయ్యారు. సరిహద్దు వివాదం పరిష్కారమవ్వాల్సిందేనని ఈ సమావేశంలో జైశంకర్ పట్టుబట్టారు. దీంతో 16వ విడత సీనియర్ మిలిటరీ కమాండర్స్ చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ చర్చలు భారత దేశంవైపునగల చూసుల్‌లో ఆదివారం జరుగుతాయి.  


ఈ చర్చలు సత్ఫలితాలనిస్తాయని పరిశీలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలింగ్ పాయింట్ 15 నుంచి చైనా దళాల ఉపసంహరణ అంత తేలిక కాదని కూడా అంటున్నారు. గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ నుంచి గల్వాన్ సెక్టర్ మధ్య అత్యంత దగ్గరి దారిలో పీఎల్ఏ దళాలు ఉండటమే దీనికి కారణమని వివరిస్తున్నారు. శ్యోక్ నదికి ఉప నదులు ఖుగ్రంగ్ నల్లా, చాంగ్ చెమ్మో. ఈ నదుల ఒడ్డునే పీపీటీ 14 (గల్వాన్), పీపీటీ 15 (ఖుగ్రంగ్), పీపీటీ 16 (హాట్ స్ప్రింగ్స్), పీపీటీ 17 (గోగ్రా) ఉన్నాయి. 


చైనా యుద్ధ విమానం జే-10 ఫైటర్ జెట్ జూన్‌లో నో-ఫ్లై జోన్‌లో ప్రవేశించింది. ఫ్రిక్షన్ పాయింట్లలో ప్రయాణించింది. ఈ విమానాన్ని ఇండియన్ రాడార్లు గుర్తుపట్టాయి. దీనిని తరిమికొట్టేందుకు, నిరోధించేందుకు భారత విమానాలు చర్యలు చేపట్టాయి.  ఈ విషయాన్ని ఈ చర్చల్లో భారత్ ప్రస్తావించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే భారత ప్రభుత్వం దీనిపై ఏ విధంగానూ స్పందించలేదు. 


చైనా భావిస్తున్న వాస్తవాధీన రేఖను ఏర్పాటు చేయడంలో భాగంగానే పీఎల్ఏ విమానం ఈ విధంగా ప్రయాణించిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇరు వైపులా చెరొక మూడు డివిజన్ల దళాలు ఉన్నాయి. 


2020 మే 5 నుంచి లడఖ్ సెక్టర్‌లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. పాంగాంగ్ సో ఉత్తర దిశలో చైనీస్ పీఎల్ఏ దళాలు అక్రమంగా చొరబడటంతో ఈ ప్రతిష్టంభన ప్రారంభమైంది. 

Updated Date - 2022-07-16T20:05:16+05:30 IST