భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు ఈ నెల 11న

ABN , First Publish Date - 2022-03-08T22:54:50+05:30 IST

లడఖ్‌లో ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా భారత్-చైనా సైనిక కమాండర్ల

భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు ఈ నెల 11న

న్యూఢిల్లీ : లడఖ్‌లో ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా భారత్-చైనా సైనిక కమాండర్ల స్థాయి 15వ విడత చర్చలు ఈ నెల 11న జరుగుతాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మిగిలిన ఘర్షణ ప్రదేశాల వద్ద కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించుకోవడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి పెడతారు. ఈ పరిణామాల గురించి తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా మంగళవారం ఈ వివరాలను వెల్లడించింది. 


2020 మే నెలలో తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య ఘర్షణ ప్రారంభమైంది. 2020 జూన్ 15/16 తేదీల మధ్య రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడం కోసం దౌత్య, సైనిక కమాండర్ల స్థాయుల్లో చర్చలు జరుగుతున్నాయి. జనవరి 12న జరిగిన 14వ విడత చర్చల్లో పెద్దగా సానుకూల ఫలితాలు కనిపించలేదు. ఈ ప్రతిష్టంభనను తొలగించడం కోసం పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తామని ఇరు వర్గాలు చెప్పాయి. 


15వ విడత కార్ప్స్ కమాండర్ లెవెల్ చర్చలు మార్చి 11న భారత దేశం వైపుగల చూషుల్-మోల్డో మీటింగ్ పాయింట్ వద్ద జరుగుతాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. గాల్వన్, పాంగాంగ్ సో, గోగ్రా హైట్స్ ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద ఇరు దేశాల సైన్యాల ఉపసంహరణ జరిగినప్పటికీ, దాదాపు 50,000 నుంచి 60,000 మంది చొప్పున  ఇరు దేశాల సైనికులు లడఖ్ థియేటర్లో ఉన్నారు. 


ఎల్ఏసీ వెంబడి ఉన్న హాట్ స్ప్రింగ్స్ లేదా పెట్రోల్ పాయింట్-15 నుంచి ఇరు దేశాల సైన్యాన్ని ఉపసంహరించడానికి సంబందించిన పరిష్కారంపై 15వ విడత చర్చల్లో దృష్టి పెడతారని తెలుస్తోంది. హాట్ స్ప్రింగ్స్ వద్ద భారత సైన్యం గస్తీ కార్యకలాపాలపై ప్రభావం పడిందని, అదేవిధంగా చైనా సైన్యం డెప్సాంగ్ ప్లెయిన్స్‌లో ఉండటం వల్ల పీపీ-10, 11, 11-ఏ, 12, 13లకు వెళ్ళే మార్గాలకు భారత సైనికులు వెళ్ళడం సాద్యపడటం లేదని సమాచారం. 


Updated Date - 2022-03-08T22:54:50+05:30 IST