సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్.. హడలిపోతున్న చైనా..

ABN , First Publish Date - 2020-09-09T03:03:28+05:30 IST

సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్‌ నెలకొంది. చైనా అదను చూసి కయ్యానికి కాలుదువ్వుతోంది.

సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్.. హడలిపోతున్న చైనా..

ఏబీఎన్-ఆంద్రజ్యోతి : సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్‌ నెలకొంది. చైనా అదను చూసి కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ క్రమంలో మరోసారి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించింది. అంతటితో ఆగకుండా భారత స్థావరాలకు సమీపంలో కాల్పులకు తెగబడింది. అయితే.. భారతసైన్యం వారికి దీటుగా బదులిస్తోంది. ఇండియన్‌ ఆర్మీ ప్రతిఘటనకు చైనా సైన్యం హడలి పోతోంది. భారత్‌ ముందుకి.. చైనా వెనక్కి. ఇవాల్టి ఏబీఎన్‌ స్పెషల్‌ ఫోకస్‌..

 

నక్క జిత్తుల చైనా సైన్యం బొంకుతోంది. శాంతి ఒప్పందాలను, చర్చల సారాంశాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దులు దాటి వస్తూ రెచ్చగొడుతోంది. పైగా.. భారత సైన్యంపైనే నిష్కారణంగా అభాండాలు వేస్తోంది. భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. చైనా సైన్యం ఆగడాలు ఎల్‌ఏసీ వద్ద టెన్షన్‌కు కారణమవుతున్నాయి. అదను చూసి, అనూహ్యంగా గిల్లికజ్జాలకు దిగుతోంది చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ. అయితే.. నిరంతరం అప్రమత్తంగా ఉండే భారత సైన్యం.. ఎప్పటికప్పుడు ఇలాంటి కుటిల యత్నాలను తిప్పికొడుతోంది. చైనీయులకు దీటుగా బదులిస్తోంది.


తాజాగా.. లడాఖ్‌లో తూర్పు ప్రాంతంలోని సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే, తూర్పు లడఖ్ సెక్టార్లో ఇరు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి సమయంలో సరిహద్దుల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. చైనా బలగాలు.. గుట్టు చప్పుడు కాకుండా.. భారత సైన్యం స్థావరాలకు సమీపంలోకి చేరుకున్నాయని, గాలిలోకి కాల్పులు కూడా జరిపాయని చెబుతున్నారు. అయితే.. భారత సైన్యం అప్రమత్తంగా ఉండటంతో తిరిగి పీఎల్‌ఏ జవానులు వెనక్కి తగ్గారని తెలుస్తోంది.


లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా భారత సైన్యంపై దురాగతానికి పాల్పడ్డ నాటినుంచి సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చైనా దొంగదెబ్బతో ఆ సమయంలో 20 మంది భారత సైనికులు వీరమరణం చెందారు. అయితే.. భారత సైనికులు ఊహించని రీతిలో జరిగిన ఆ దాడినుంచి వేగంగా తేరుకున్నారు. చైనా సైనికులకు దీటుగా బదులిచ్చారు. పదులసంఖ్యలో చైనా సైనికులను హతమార్చి బదులు తీర్చుకున్నారు.


అప్పటినుంచీ చైనా ఆర్మీ ఓ రకంగా భారత్‌పై కక్ష గట్టింది. భారత సరిహద్దులు దాటడం, రహస్యంగా భారత స్థావరాలవైపు చొచ్చుకురావడం, వీలైతే భారత ఆర్మీ చూడకుండా కుటిల చర్యలకు దిగడం వంటి తప్పుడు చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి భారత బోర్డర్‌ దాటడమే కాకుండా.. కాల్పులకు తెగబడ్డారు చైనా సైనికులు. అయితే.. ఇలాంటి పరిస్థితిని ముందే పసిగడుతున్న భారత సైన్యం వాళ్లను ప్రతిఘటించింది.


మొన్నటికి మొన్న చైనా ఆర్మీ.. భారత సైన్యం కళ్లుగప్పి దుర్మార్గపు చర్యకు పాల్పడింది. ఎప్పుడూ ఉత్తర భాగంలోని సరిహద్దు ప్రాంతంలోనే మోహరించే చైనా.. గుట్టు చప్పుడు కాకుండా.. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలోని శిఖరాలపైకి చేరుకుంది. అయితే.. భారత సైన్యం వాళ్లకు గట్టిగా బుద్ధిచెప్పి.. తిరిగి ఆ శిఖరాలను భారత్‌ అధీనంలోకి తెచ్చాయి. ఎంతగా దొంగదెబ్బ తీయాలని చైనాప్రయత్నిస్తున్నా.. భారత సైనికులు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. గట్టిగా బుద్ధి చెబుతున్నారు. ఈ పరిణామాలను చైనా సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. తూర్పు లడఖ్‌ సెక్టార్‌లోని ఎల్‌ఏసీలో సోమవారం అర్థరాత్రి ఈ పరిణమాలు చోటుచేసుకున్నాయని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. చైనీయుల కుయుక్తులను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. దేశ రక్షణ కోసం ఎంతటికైనా సై అని రొమ్ము విరిచి చెబుతోంది ఇండియన్‌ ఆర్మీ. చైనాను ఒక్క అడుగు కూడా ముందుకు రానిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.


వాస్తవానికి చైనా ద్వంద్వ బుద్ధితో వ్యవహరిస్తోంది. ఓవైపు ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు ఉసిగొల్పుతోంది. మరోవైపు, చర్చలంటూ అంతర్జాతీయ సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు.. గాల్వన్‌లోయ పరిణామాల తర్వాత పలు దఫాలుగా భారతీయ ఉన్నతాధికారులతో చర్చల్లో కూడా చైనా ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుందామంటూ నీతులు వల్లిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే  గత మూడు నెలలుగా రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల స్థాయి చర్చలే కాదు.. నాలుగు రోజుల క్రితమే మాస్కోలో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య సమావేశం కూడా జరిగింది. ఆ చర్చల ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతోంది. మరో రెండు రోజుల్లో ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య కూడా ఈ సరిహద్దు ఉద్రిక్తలపై మరో సమావేశం జరగనుంది. 


మాస్కో వేదికగా భారత-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, వీ ఫెంఘే నాలుగు రోజుల క్రితం సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో జరిగిన భేటీలో సరిహద్దు అంశాన్ని భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ ప్రస్తావించారు. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌, మాస్కోలో భారత రాయబారి డీబీ వెంకటేశ్‌ వర్మ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.  రెండు దేశాల మధ్య గాల్వన్‌ ఘర్షణలు చెలరేగినప్పటినుంచీ  రెండు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్యనే చర్చలు జరిగాయి. 



ఈ పరిణామం తర్వాత మాస్కోలో అత్యున్నత స్థాయి రాజకీయ భేటీ జరగడంతో ఇక ఉద్రిక్తతలు చల్లారతాయని, చైనా సైన్యం వెనక్కి తగ్గుతుందని అందరూ భావించారు. అంతకుముందే.. భారత్‌, చైనా విదేశాంగ మంత్రుల మధ్య ఫోన్‌ద్వారా చర్చలు కూడా జరిగాయి.  భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సరిహద్దు సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని పరస్పరం నిర్ణయానికి వచ్చారు. మరో రెండు రోజుల్లో వీళ్లిద్దరూ స్వయంగా చర్చల్లో పాల్గొనాలని కూడా ప్రతిపాదించారు.  కానీ, చైనా సైన్యం మాత్రం తన సహజ స్వభావాన్ని వదులుకోవడం లేదు.


                       - సప్తగిరి గోపగాని, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.


Updated Date - 2020-09-09T03:03:28+05:30 IST