పటేల్ ఐక్యతా స్ఫూర్తితో సవాళ్లను ఎదుర్కొందాం: మోదీ

ABN , First Publish Date - 2021-10-31T18:16:12+05:30 IST

భారతదేశం ఎలాంటి అంతర్గత, బహిర్గత సవాళ్లు ఎదురైనా పూర్తి సామర్థ్యంతో ఎదుర్కొనేందుకు..

పటేల్ ఐక్యతా స్ఫూర్తితో సవాళ్లను ఎదుర్కొందాం: మోదీ

న్యూఢిల్లీ: భారతదేశం ఎలాంటి అంతర్గత, బహిర్గత సవాళ్లు ఎదురైనా పూర్తి సామర్థ్యంతో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోందని, ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంత్యుత్సవాన్ని 'జాతీయ ఐక్యతా దినోత్సవం'గా దేశ ప్రజలు ఆదివారంనాడు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, నింగి, నేల, నీరు, అంతరిక్షం ఇలా ఏ రంగంలో చూసినా భారత్ అసమాన ప్రతిభ చాటుకుంటూ ముందుకు వెళ్తోందని, దేశ సామర్థ్యం, నిబద్ధత ఆసాధారణ స్థాయిలో ఉన్నాయని అన్నారు.


సామర్థ్యం, అప్రమత్తత, నిబద్ధత, అణకువ కలిగిన అభివృద్ధి భారతాన్ని సర్దార్ పటేల్ కోరుకునేవారని, జాతి ప్రయోజనాలకే పటేల్ ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేవారని ప్రధాని చెప్పారు. పటేల్ స్ఫూర్తితో ఈరోజు భారతదేశం పూర్తిగా అంతర్గత, బహిర్గత సవాళ్లను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతను సంతరించుకుంటోందని చెప్పారు. దశాబ్దాలుగా కొరగాకుండా మిగిలిన అనేక చట్టాల నుంచి గత ఏడేళ్లుగా విముక్తి కలిగిస్తూ వచ్చామని చెప్పారు. 'ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్' కోసం తన జీవితాన్నే అంకితం చేసిన పటేల్ చరిత్రలోనే కాకుండా దేశ ప్రజలందరి హృదయాలలోనూ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఏక్ భారత్ అంటే ప్రతి ఒక్కరికీ సమానావకాశాలు, ఇందుకోసం కలలు గనే హక్కు కలిగి ఉండటమని అన్నారు. దేశ ప్రయోజనాల పరిరక్షణకు 'ఆత్మనిర్భర్' భారత్ పేరుతో కొత్త జర్నీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ వ్యాఖ్యలను మనం గుర్తుంచుకోవాలని అన్నారు. ఉమ్మడి లక్ష్యాల సాధనకు దేశాన్ని సర్వోన్నత స్థాయికి తీసుకువెళ్లాలని, ఇందుకోసం ఐక్యంగా ముందుకు సాగాలని, ఐక్యత లోపిస్తే విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Updated Date - 2021-10-31T18:16:12+05:30 IST